Anandaiah Medicine : ఆనందయ్య కొత్త మందుకు చెక్ పెట్టిన గ్రామస్తులు

ఆనందయ్య   ఒమిక్రాన్ కోసం తయారు చేసిన   మందు కోసం భారీగా ప్రజలు తరలిరావడంతో గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Anandaiah Medicine :  ఆనందయ్య కొత్త మందుకు చెక్ పెట్టిన గ్రామస్తులు

Nelore Anandaiah Omicron

Updated On : December 27, 2021 / 4:06 PM IST

Anandaiah Omicron Medicine  :  నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆనందయ్య మందు కోసం  ఇతర ప్రాంతాల నుంచి పెద్ద  ఎత్తున  ప్రజలు తరలి రావడంతో గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఇటీవలే ఒమిక్రాన్‌కు  మందు తయారు చేశానని ఆనందయ్య ప్రకటించడంతో ప్రజలు భారీగా తరలివచ్చారు.  దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆనందయ్య మందుకు అనుమతి లేదని.. ప్రజలు భారీగా తరలివస్తుండటంతో తమకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు  పోలీసులకు తెలిపారు.  దీంతో పోలీసులు ఆనందయ్యతో  చర్చలు జరిపారు.   ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న పత్రాలను చూపించాలని కోరారు. అయితే ఆనందయ్య మందుకు అనుమతులు లేవని ఆయుష్‌ శాఖ ఇప్పటికే ప్రకటించింది.  అయినా ప్రజలు తరలివస్తుండటంతో కృష్ణపట్నం వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.

గతంలో ఆనందయ్య వద్ద కోవిడ్ మందు తీసుకు వెళ్లటానికి ఇతర రాష్ట్రాల  నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.  చాలా మంది రోగులు అంబులెన్స్ లో కూడా వచ్చి తీసుకు వెళ్లారు. అంతమంది ప్రజలు  ఊళ్లోకి రావటంతో   గ్రామస్తులకు కోవిడ్   సోకి కొందరు మరణించారని  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.   మరో వైపు ఆనందయ్య తన మందుకు కోర్టు అనుమతి ఇచ్చిందనే విషయాన్ని గుర్తు  చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే ఒమిక్రాన్ మందు  కూడా   కోవిడ్ లో   భాగమేనని ఆనందయ్య అంటుండగా పోలీసులు, గ్రామస్తులు అందుకు ఒప్పుకోవటంలేదు.

Also Read : Tirumala Srivani Trust : శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ల కోటా డిసెంబర్ 28న విడుదల

ఒమిక్రాన్ మందుకు సంబంధించి అనుమతులు తీసుకోవాల్సిందేనని.. గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు  గూమి గూడటానికి  వారు ఒప్పుకోవటం లేదు.   తాను స్వఛ్చందంగా ఉచితంగా   ఒమిక్రాన్  మందు పంపిణీ   చేస్తుంటే గ్రామస్తులు ఎందుకు అడ్డుకుంటున్నారో   తెలియటం  లేదని ఆనందయ్య అన్నారు.  ఇప్పుడు ఒమిక్రాన్ మందు పంపిణీ చేయవద్దని   అనే  వారంతా గతంలో తన వద్ద కోవిడ్ మందు వాడి.. ఇతరులకు కూడా పంపిణీ చేశారని ఆనందయ్య వెల్లడించారు.  తానేమీ మందు పంపిణీ చేస్తూ  డబ్బులు వసూలు  చేసుకోలేదని.. తన బ్యాంకు  ఖాతాలు కూడా చెక్  చేసుకోవచ్చని ఆనందయ్య చెప్పారు.