అందుకే లిక్కర్ ధరలు పెంచాం – సీఎం జగన్

ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడాన్ని సీఎం జగన్ సమర్థించుకున్నారు. కరోనా వైరస్ కారణంగా 40 రోజుల వరకు దుకాణాలు బంద్ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం..మద్యం షాపులు తెరుచుకున్నాయి. 25 శాతం మేర ధరలు పెంచింది ఏపీ ప్రభుత్వం. దీనిపై విమర్శలు చెలరేగాయి. మే 05వ తేదీ మంగళవారం మరో 50 శాతం ధరలు పెంచుతున్నట్లు ప్రకటన వెలువడింది. ఒక్కసారిగా మందుబాబులు షాక్ తిన్నారు. దీనిపై సీఎం జగన్ స్పందించారు.
దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలు ఎలా జరుగుతున్నాయో టీవీ ఛానళ్లు, పేపర్లు చూపిస్తున్నాయన్నారు. మద్యపానాన్ని నిరుత్సాహ పరచడానికి 75 శాతం పెంచామన్నారు. ఢిల్లీలో 70 శాతం పెంచారనే విషయాన్ని గుర్తు చేశారు.
దుకాణాల సంఖ్య కూడా 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మొత్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 33 శాతం తగ్గించినట్టు అవుతుందన్నారు.
ప్రతి షాపు వద్ద ఇంతకు ముందు ప్రైవేటు రూమ్స్ పెట్టడం జరిగిందని, దీన్ని రద్దు చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..43 వేల బెల్టు షాపులను రద్దు చేశామని చెప్పుకొచ్చారు. గ్రామాల్లో బెల్టు షాపులు పర్మినెంట్‌గా లేకుండా ఉండాలంటే… లాభాపేక్ష లేనప్పుడే జరుగుతుందన్నారు.
అందుకనే ప్రైవేటు వారికి కాకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుందని, లేకపోతే సేల్స్‌ను ప్రోత్సహించడం కోసం ప్రైవేటు వాళ్లు బెల్టుషాపులను ప్రోత్సహిస్తారని చెప్పారు. మద్యానికి దూరంగా ఉండేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని, మద్యం విక్రయించే వేళలలను 11 గంటల నుంచి 8 గంటవరకూ పరిమితం చేశామన్నారు. అందులో భాగంగానే 75శాతం పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు.
పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా, రాష్ట్రంలో మద్యం తయారీని కూడా అడ్డుకోవాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రెండింటి బాధ్యత ఎస్పీల మీద ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేక పోలీసు అధికారిని పెట్టామన్నారు. లిక్కర్, ఇసుక మీద కలెక్టర్లు, ఎస్పీలు ఫోకస్ పెట్టాలని, కేవలం ఎక్సైజ్ స్టాఫ్ మాత్రమే చేయలేదని సూచించారు.
పోలీసులు దీంట్లో భాగస్వామ్యం కావాలని, అక్రమ మద్యం రావాణా, మద్యం తయారీ, ఇసుక అక్రమాలు ఎట్టి పరిస్థితులోనూ ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉపేక్ష అనేది ఉండకూడదని కలెక్టర్లుకు, ఎస్పీలకు చెబుతున్నానని, ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని మరోసారి చెప్పారు. తానే ఈ విషయాలపై పర్యవేక్షిస్తానని సీఎం జగన్ వెల్లడించారు.
Also Read | ఏపీలో మద్యపాన నిషేధం దిశగా మరో ముందడుగు