కరోనాతో మృతి చెందిన వ్యక్తి దహన సంస్కారాలకు అంగీకరించని గ్రామస్తులు

  • Published By: bheemraj ,Published On : July 2, 2020 / 07:43 PM IST
కరోనాతో మృతి చెందిన వ్యక్తి దహన సంస్కారాలకు అంగీకరించని గ్రామస్తులు

Updated On : July 2, 2020 / 7:53 PM IST

ప్రకాశం జిల్లా యరజర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలకు గ్రామస్తులు అంగీకరించ లేదు. మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురాకుండా స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు నచ్చజెప్పినా వినకపోవడంతో గ్రామంలో భారీగా సీఆర్ పీఎఫ్ బలగాలను మోహరించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఈ గ్రామంలో దహన సంస్కారాలు చేయడానికి వీల్లేదని భీష్మించుకు కూర్చున్నారు.

జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కుటుంబ సభ్యులు తీసుకెళ్లడానికి అంగీకరించని డెడ్ బాడీలను జిల్లాలోని యరజర్ల శివారులో ఖననం చేసేందుకు పోలీసులు, వైద్యాధికారులు అర్ధరాత్రి సమయంలో ప్రయత్నించారు.

ఈ విషయం తెలుసుకున్న యరజర్ల గ్రామస్తులు వాటిని గ్రామంలో ఖననం చేసేందుకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు. దాదాపు ఐదు గ్రామాలకు ఇక్కడి నుంచి మంచినీరు సరఫరా అవుతుంది. దహన సంస్కారాలు నిర్వహించినట్లైతే డెడ్ బాడీలను 15 అడుగుల లోతులో పూడ్చిపెట్టడంతో ఆ డెడ్ బాడీల్లో ఉన్న వైరస్ నీటిలో వ్యాపిస్తుందన్నారు. ఆ నీటిని తాము సేవించడం ద్వారా ఇది చాలా ప్రమాదకరం, ఇది మొత్తం గ్రామానికే అంటుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డెడ్ బాడీలను గ్రామంలో ఖననం చేసేందుకు ఒప్పుకోబోమని గ్రామస్తులు అడ్డుకున్నారు.

ఇదే పరిస్థితుల్లో అధికారులు పోలీసులను రంగంలోకి దించి డెడ్ బాడీలను ఖననం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులు ముందుగానే పసిగట్టి పోలీసు బలగాలు, జేసీబీని అడ్డుకున్నారు. మరోసారి ప్రయత్నించినట్లైతే గ్రామం మొత్తం ఏకమై తిరగబడతామని, దహన సంస్కారాలు చేసేందుకు ఒప్పుకోబోమన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచిది లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అధికారులను హెచ్చరించారు.