Somu Veerraju : 5వేల కోట్లకుపైగా ఖర్చు చేశారు- వాలంటీర్ వ్యవస్థపై సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు
Somu Veerraju : వాలంటీర్ల కోసం ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్ ప్రభుత్వం వృథా చేస్తోందని సోమువీర్రాజు ధ్వజమెత్తారు.

Somu Veerraju
Somu Veerraju – Volunteer System : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరుతోందని, రూ.5వేలు ఇచ్చి వాలంటీర్లకు ప్రజల ఇళ్లలోకి చొరబడే అవకాశం ఇచ్చారని పవన్ కల్యాణ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వాలంటీర్ వ్యవస్థపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్ వ్యవస్థ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆయన ఆరోపించారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసమే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారని సోమువీర్రాజు మండిపడ్డారు. వాలంటీర్ల కోసం ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్ ప్రభుత్వం వృథా చేస్తోందని సోమువీర్రాజు ధ్వజమెత్తారు.
”వాలంటీర్ వ్యవస్థ రాజకీయ కోణంలో ఏర్పాటు చేసిన వ్యవస్థ. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యవస్థ. ప్రభుత్వ ధనంతో ఈ వ్యవస్థను నడుపుతున్నారు. బీజేపీ కార్యకర్తలతో దేశ్ ప్రముఖ్ లను నడుపుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల లెక్కన ఐదేళ్లలో 5వేల కోట్లకుపైగా ఈ వ్యవస్థ కోసం ఖర్చు పెట్టింది” అని సోజువీర్రాజు అన్నారు.
అసలు పవన్ ఏమన్నారంటే..
వారాహి విజయ యాత్రలో భాగంగా ఆదివారం ఏలూరులో బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఏపీలో 30వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని, దీని వెనుక వాలంటీర్ల హస్తం ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తనతో చెప్పాయని పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒంటరిగా, భర్త లేని, బాధల్లో ఉన్న మహిళలను వెతికి పట్టుకోవడం, ట్రాప్ చేయడం, బయటకు తీసుకెళ్లడం, మాయం చేయడం ఇదే వాలంటీర్ల పని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. మహిళల మిస్సింగ్ వెనుక వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందన్నారు పవన్ కల్యాణ్.
”రాష్ట్రంలో మహిళల అదృశ్యం, అక్రమ రవాణ వెనుక వైసీపీ నేతలు ఉన్నారు. వాలంటీర్లు రహస్యంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి.. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. వారిలో మహిళలు ఎందరు, వితంతువులున్నారా అని ఆరా తీస్తున్నారు. ఈ పాలనలో అదృశ్యమైన 30వేల మందిలో 14వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణం” అని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మహిళల అదృశ్యం, వాలంటీర్ల వ్యవస్థ గురించి పవన్ చేసిన ఈ ఆరోపణలు తీవ్ర దుమారమే రేపాయి.
నా భార్య కూడా ఏడుస్తుంది-పవన్ కల్యాణ్
వైసీపీ నాయకుల మాటలకు తన భార్య కూడా ఏడుస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని అందుకే నిలబడినట్లు పవన్ చెప్పారు. ఎవరో పెట్టిన పార్టీని వైసీపీ వాళ్లు తీసుకున్నారు. యువజనులు, శ్రామికులు, రైతులకు ఏమీ చేయని పార్టీ వైసీపీ. తనను కూడా బెదిరించారని, డబ్బుతో మభ్య పెట్టాలని చూశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ”వాళ్ల మాటలకు నా భార్య కూడా ఏడుస్తుంది. ఏడ్వకుండా ఉండదు కదా. సర్ది చెప్పి ముందుకెళ్తాను. రాజకీయాల్లో నేను బాధ్యత తీసుకున్నా. వెనక్కి వెళ్లలేను” అని చెప్పారు పవన్ కల్యాణ్.