నేటి నుంచి ఆన్‌లైన్ లో శ్రీవారి కల్యాణోత్సవం టికెట్లు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవాన్ని భక్తుల కోరిక మేరకు ఆగస్టు 7వ తేదీ శుక్రవారం నుండి ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా శ్రీ వారి కళ్యాణోత్సవాన్ని భక్తులు తమ ఇళ్ళ నుండి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించడం ద్వారా కల్యాణోత్సవ సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్నామన్న భావన కలుగుతుంది. ఆగస్టు 7 నుండి 31వ తేదీ వరకు కల్యాణోత్సవం టికెట్లు ఆగస్టు 6వ తేదీ, గురువారం ఉదయం 11.00 గంటల నుండి ఆన్ లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.
టికెట్లు కావలసిన గృహస్తులు టిటిడి వెబ్‌సైట్‌లో (www.tirupatibalaji.ap.gov.in) తమ వివరాలు పొందుపరచి, టిటిడి నియమ నిబంధనలకు లోబడి గేట్‌వే ద్వారా రూ.1000/- చెల్లించి ఆన్‌లైన్ రశీదు పొందవచ్చు. శ్రీవారి ప్రసాదాలను పోస్టల్ శాఖ ద్వారా టిటిడి ఉచితంగా అందిస్తుంది.
స్వామివారి కల్యాణోత్సవం ప్రతి రోజు మధ్యాహ్నం 12. గంటలకు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. పాల్గొనే గృహస్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి, అర్చక స్వాముల సూచనల మేరకు తమ గోత్ర నామాలతో సంకల్పం చెప్పాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్లు పొందిన గృహస్తుల పేరు, గోత్ర నామాల ప్రతిని అర్చకులు స్వామివారి మూల విరాట్టు పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహిస్తారు.
ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరియం, రవిక, అక్షింతలు ప్రసాదంగా పోస్టల్ శాఖ ద్వారా గృహస్తుల చిరునామాకు పంపడం జరుగుతుంది. భక్తులు టికెట్లు బుక్ చేసుకునేందుకు www.tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలని సూచించింది.