South India Shopping Mall : సంతలో కంటే ఎక్కువమంది జనాలు.. సౌతిండియా షాపింగ్ మాల్‌కు జరిమానా

కరోనా భయమే లేదు. సంతలోకంటే ఎక్కువమంది జనాలు ఉన్నారు. మాస్కులు లేవు. భౌతిక దూరం మర్చిపోయారు. ఆ షాపింగ్ మాల్ లో జనాలను చూసి కమిషనర్ అవాక్కయ్యారు.

South India Shopping Mall : సంతలో కంటే ఎక్కువమంది జనాలు.. సౌతిండియా షాపింగ్ మాల్‌కు జరిమానా

South India Shopping Mall

Updated On : July 28, 2021 / 5:39 PM IST

South India Shopping Mall : తిరుపతిలోని సౌతిండియా షాపింగ్ మాల్ కు జరిమానా పడింది. రూ.50వేలు ఫైన్ వేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో నగర పాలక కమిషనర్ గిరీశా జరిమానా విధించారు. సిబ్బందితో కలిసి నగర పాలక కమిషనర్ గిరిజ షాపింగ్ మాల్ ను సందర్శించారు. ఆ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. గుంపులుగా జనాలు ఉన్నారు. భౌతికదూరం లేదు. కొందరు మాస్కులు కూడా ధరించలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్.. జరిమానా విధించారు. తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని షాపింగ్ మాల్ యాజమాన్యానికి ఆదేశించారు.

కరోనా అంటే జనాలకు భయం లేకుండా పోతోంది. నిబంధనలు సడలించడంతో షాపింగ్ మాల్స్‌కు క్యూ కట్టారు. కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగలేదని, జాగ్రత్తగా ఉండాలని నిబంధనలు పాటించాలని ప్రభుత్వం నెత్తీనోరు బాదుకుంటున్నా జనాలు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. సంతలో జనం కంటే ఎక్కువమంది ఆ మాల్ లో ఉన్నారు. వెంటనే రంగంలోకి దిగిన కమిషనర్ గిరీషా.. సౌతిండియా షాపింగ్ మాల్‌లో తనిఖీలు చేశారు. అక్కడ జనాల్ని చూసి అవాక్కయ్యారు. షాపింగ్ మాల్‌కు వచ్చిన కస్టమర్లు మాస్క్ కూడా సరిగ్గా పెట్టుకోలేదు. భౌతిక దూరం కూడా పాటించడం లేదని గుర్తించారు. నిబంధనల గురించి చెప్పాల్సిన షాపింల్ మాల్ సిబ్బంది.. చూసీచూడనట్టు వ్యవహరించారు.

దీంతో షాపింగ్ మాల్ సిబ్బంది తీరుపై కమిషనర్ గిరీషా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు బేఖాతరు చేసినందుకు రూ.50 వేలు జరిమానా విధించారు. తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని.. ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నించారు. నిబంధనలు పాటించకపోతే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందరూ అప్రమత్తతతో ఉండాలని.. నిబంధనలను పాటించాలని హెచ్చరించారు. మరోసారి కోవిడ్ నిబంధనలు పాటించకపోతే రూ.5లక్షలు జరిమానాతో పాటు షాపును సీజ్ చేస్తామని కమిషనర్ హెచ్చరించారు.