Visakha Beach Tragedy: విశాఖలో విషాదం.. బీచ్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు.. ఒకరు మృతి

మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు పర్యాటకులు ఇటలీ నుంచి విశాఖకి వచ్చారు.

Visakha Beach Tragedy: విశాఖలో విషాదం.. బీచ్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు.. ఒకరు మృతి

Updated On : October 5, 2025 / 6:41 PM IST

Visakha Beach Tragedy: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. బీచ్ అందాలను చూస్తూ సరదాగా గడిపేందుకు వస్తే ప్రాణాలే పోయాయి. యారాడ బీచ్ లో అలలు తాకిడికి ఇద్దరు విదేశీయులు కొట్టుకుపోయారు. ఇది గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. నీళ్లలో కొట్టుకుపోతున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఓ విదేశీయుడు చనిపోయారు.

ఇటలీకి చెందిన 16మంది టూరిస్టులు యారాడ బీచ్ కి వచ్చారు. సముద్రం లోపలికి వెళ్లొద్దని మెరైన్ పోలీసులు హెచ్చరించారు. అయినా వారు వినిపించుకోలేదు. వారు ఈత కోసం దిగినట్లు తెలుస్తోంది. అలల తాకిడికి సముద్రంలోకి వెళ్లిపోగా అక్కడే ఉన్న పోర్ట్ మెరైన్ పోలీసులు వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో ఒకరు అక్కడే మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. టూరిస్ట్ మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Also Read: డార్జిలింగ్‌లో వర్ష బీభత్సం.. కూలిన వంతెన.. విరిగిపడిన కొండచరియలు.. చిన్నారులుసహా 17మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ..

సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో ఇటలీ దేశానికి చెందిన 16మంది టూరిస్టులు యారాడ బీచ్ కి వచ్చారు. వీరంతా స్థానికంగా ఉన్న షిప్ యార్డ్ లో పని చేస్తున్నారు. ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు యారాడ బీచ్ కి వచ్చారు. సముద్రంలో స్నానం చేసేందుకు ఏడుగురు బీచ్ లోకి దిగారు. వీరిలో ముగ్గురు సముద్రం లోపలికి వెళ్లి స్నానం చేస్తున్నారు. పోర్ట్ మెరైన్ పోలీసులు, లైఫ్ గార్డులు వారిని హెచ్చరించారు. లోపలికి వెళ్లొద్దని వారించారు. అయినా వారు పట్టించుకోలేదు. సముద్రం లోపలికి వెళ్లారు. అలల తాకిడికి వారు కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన లైఫ్ గార్డ్స్ లోపలికి వెళ్లి ఇద్దరిని కాపాడారు. వారిలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మరొకరు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసుకున్న మల్కాపురం పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అక్కడే విధుల్లో ఉన్న పోర్ట్ మెరైన్ సిబ్బంది హెచ్చరికలు జారీ చేసినా పెడచెవిన పెట్టడంతో ఈ ఘోరం జరిగింది.

బీచ్ లో లోపలికి వెళ్లి సముద్ర సాన్నం చేయడం ప్రాణాలకే ప్రమాదం అని అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా టూరిస్టులు వినడం లేదు. సముద్రపు అలల్లో స్నానం చేయాలనే ఆరాటంలో ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ క్రమంలో చాలా చోట్ల జీవీఎంసీ 32 మంది లైఫ్ గార్డ్స్ ను నియమించింది. సముద్రం లోపలికి వెళ్లి స్నానాలు చేసే వారిని హెచ్చరించడంతో పాటు ప్రమాదాల బారిన పడే వారిని కాపాడటం వీరి విధి.