ఇందుకే భక్తుల కోసం టీటీడీలో ఏఐ టెక్నాలజీ.. దీన్ని వృథా అనడం ఏంటి? ఎల్వీ సుబ్రహ్మణ్యం విజ్ఞతకు వదిలేస్తున్నాం: టీటీడీ ఛైర్మన్
"ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం బాధాకరం. సీనియర్ అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం టెక్నాలజీ నిరూపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు" అని అన్నారు.

తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం కోసం వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని తప్పుపడుతూ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు.
ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఏఐని ఉపయోగించాలన్నా ఆలయంలో కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పిన విషయం తెలిసిందే. ఆ ప్రయత్నాలు విరమించుకోవాలని, శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సుబ్రహ్మణ్యం చెప్పారు.
Also Read: ఇన్‌స్టాగ్రామ్ కొత్త నిబంధన.. ఈ యూజర్లు ఇకపై లైవ్ ఫీచర్ వాడలేరు.. ఫుల్ డీటెయిల్స్
దీనిపై బీఆర్ నాయుడు స్పందిస్తూ.. “వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకున్నాం. ఉచితంగా గూగుల్ టీసీఎస్ తో పాటు ఇతర సంస్థల సహకారంతో అధునాతన ఏఐ టెక్నాలజీ ఉపయోగించి భక్తులకు దర్శనం కల్పించాలని పాలకమండలి నిర్ణయించింది.
భక్తులకు దర్శన సమయాన్ని ముందస్తుగా తెలియజేయడానికి మాత్రమే ఏఐ టెక్నాలజీ అమలుకు నిర్ణయించాం. దర్శన సమయం ముందుగా తెలియడం వల్ల భక్తులు ఎక్కువ సమయం కంపార్ట్మెంట్లో వేచి ఉండకుండా ఇతర ఆలయాలను సందర్శించేందుకు వీలుగా టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.
ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. సీనియర్ అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం టెక్నాలజీ నిరూపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు భక్తుల్లో గందరగోళం సృష్టించేలా ఉన్నాయి. దాతల సాయంతో ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృథా అనడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం” అని బీఆర్ నాయుడు అన్నారు.