Accident : తిరుపతి జిల్లాలో విషాదం.. శ్రీవారి భక్తులపైకి దూసుకెళ్లిన 108 వాహనం
శ్రీవారి భక్తులు పుంగనూరు నుంచి తిరుమలకు రోడ్డు పక్కన కాలినడకన వెళ్తుండగా.. మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం ..

Road Accident: తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద తిరుమల శ్రీవారి భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పుంగనూరు నుంచి తిరుమలకు శ్రీవారి భక్తులు కాలినడకన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ముగ్గురిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతులు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లి వాసులుగా గుర్తించారు.
శ్రీవారి భక్తులు పుంగనూరు నుంచి తిరుమలకు రోడ్డు పక్కన కాలినడకన వెళ్తుండగా.. మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం రోగిని తీసుకెళ్తున్న 108 వాహనం వేగంగా వచ్చి వారిపైకి దూసుకెళ్లెంది. ఈ ప్రమాదంలో పెద్ద రెడ్డమ్మ (40), లక్ష్మమ్మ (45) మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలు కాగా వారి ఆస్పత్రికి తరలించారు. అయితే, వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. మృతులతోపాటు గాయపడిన వారంతా చెంపాలపల్లి గ్రామానికి చెందిన వారు కావటంతో ఆ గ్రామంలో విషాదం అలముకుంది.
స్వామివారి సన్నిదికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవటంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే, స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇదిలాఉంటే.. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఆదివారం కారు బోల్తా పడింది. కర్ణాటకకు చెందిన ఐదుగురు భక్తులు కారులో తిరుమల వచ్చారు. స్వామిని దర్శించుకుని కారులో తిరుపతి బయలుదేరారు. వీరి వాహనం ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద అకస్మాత్తుగా బోల్తా పడింది. కారులోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.