వైకుంఠ ఏకాదశి : తిరుమల ముస్తాబు..ఏర్పాట్ల వివరాలు

  • Published By: madhu ,Published On : January 5, 2020 / 07:06 AM IST
వైకుంఠ ఏకాదశి : తిరుమల ముస్తాబు..ఏర్పాట్ల వివరాలు

Updated On : January 5, 2020 / 7:06 AM IST

తిరుమ‌ల‌లో వైకుంఠ ఏకాద‌శికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ. రేపు తెల్లవారుజామున ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని టీటీడీ తెలిపింది. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకున్నామ‌ని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. వైకుంఠ ఏకాదశి గత అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి వీఐపీలకు, సామాన్య భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేప‌ట్టింది టీటీడీ.

 

2020, జనవరి 06వ తేదీ సోమవారం ఉదయం ధ‌నుర్మాస కైంక‌ర్యాల తరువాత 2 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. ముందు ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీలను దర్శనానికి అనుమతిస్తారు. తరువాత ఉదయం 5 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభిస్తామ‌ని చెప్పారు. వీఐపీల‌తోపాటు సామాన్య భ‌క్తుల‌కు మ‌హాల‌ఘు ద‌ర్శనం ఉంటుంద‌ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. 
 

వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చే భక్తులను ఇప్పటికే క్యూలైన్లలోకి అనుమతించారు. 
ఆళ్వార్ ట్యాంక్ విశ్రాంతి గృహం వ‌ద్ద ఉన్న ప్రవేశమార్గం ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోనికి, ఆ త‌రువాత నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లలోకి పంపుతారు. 
ఆ త‌రువాత వ‌చ్చే భ‌క్తుల‌ను మేద‌ర‌మిట్ట వ‌ద్ద గ‌ల ఎన్‌1 ప్రవేశ‌మార్గంలో డ‌బ్ల్యూ-7 గేటు ద్వారా మాడ వీధుల్లోకి అనుమ‌తిస్తారు. 
ద‌క్షిణ మాడ వీధిలో 6500 మంది, ప‌డ‌మర మాడ వీధిలో 14 వేల మంది, ఉత్తర మాడ వీధిలో 19 వేల మంది, తూర్పు మాడ వీధిలో 4వేల మంది భ‌క్తులు కూర్చునేందుకు అవ‌కాశం ఉంది. 
చివ‌ర‌గా వ‌చ్చే భ‌క్తుల‌ను క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద అనుమ‌తిస్తారు. 

 

క్యూలైన్లలో ఎక్కువ సేపు నిల‌బ‌డ‌కుండా త‌గిన జాగ్రత్తలు తీసుకున్నారు. భ‌క్తుల‌కు అన్నప్రసాదాలు, అల్పాహారం, తాగునీరు, టీ, కాఫీ పంపిణీకి ప్రణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు చేశారు. 172 ప్రాంతాల్లో 3 ల‌క్షల తాగునీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచారు. 9 ల‌క్షల ల‌డ్డూలు నిల్వ ఉంచిన‌ట్టు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లు, మాడ వీధుల్లోని షెడ్లు, క‌ల్యాణ‌వేదికలో క‌లిపి 85 వేల మంది భ‌క్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. షెడ్లకు అనుబంధంగా మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
 

శ్రీ‌వాణి ట్రస్టుకు విరాళాలు అందించిన దాత‌ల‌కు వైకుంఠ ఏకాద‌శికి 2500 మందికి, ద్వాద‌శికి 2500 మందికి అవ‌కాశం క‌ల్పించనుంది టీటీడీ. 
వీరు ఉద‌యం 10 గంట‌ల‌కు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 వ‌ద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 
వారికి మ‌హాల‌ఘు ద‌ర్శనం క‌ల్పిస్తామ‌ని చెప్పారు.