నారా లోకేశ్‌తో వట్టి పవన్ భేటీ.. ఉంగుటూరు సీటు కోసమేనా?

దివంగత మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ సోదరుడి కుమారుడైన వట్టి పవన్ నిన్న అమరావతి లో లోకేశ్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

నారా లోకేశ్‌తో వట్టి పవన్ భేటీ.. ఉంగుటూరు సీటు కోసమేనా?

Vatti Pavan Kumar Meet Nara Lokesh

Vatti Pavan Kumar : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఆయా పార్టీల అగ్ర నాయకులు పార్టీ సమావేశాలు, ప్రచారాల్లో బిజీ అయిపోయారు. మరోవైపు ఆశావహులు కూడా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల అగ్రనేతలను కలిసి సీటు కోసం విన్నవించుకుంటున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఉంగుటూరుకు చెందిన వట్టి పవన్ కుమార్ కలవడం ఆసక్తికరంగా మారింది.

వట్టి వసంత కుమార్ వారసుడిగా..
దివంగత మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ సోదరుడి కుమారుడైన వట్టి పవన్ నిన్న అమరావతి లో లోకేశ్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు అరగంట పాటు సాగిన వీరి సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల గురించి చర్చించినట్టు సమాచారం. ఉంగుటూరు ఎమ్మెల్యే సీటు కోసమే లోకేశ్ ను ఆయన కలిశారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉంగుటూరు నియోజకవర్గంలో కొన్ని రోజులుగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పవన్ ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. వట్టి వసంత కుమార్ వారసుడిగా రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఉంగుటూరు ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన పుప్పాల వాసుబాబు కొనసాగుతున్నారు.

Also Read: సీఎం జగన్‌ను కలిసిన తర్వాత.. ఏపీ మంత్రి ఉషాశ్రీ చరణ్ సంచలన ప్రకటన

వట్టి వసంత కుమార్ ఉంగుటూరు నుంచి 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత రోశయ్య క్యాబినెట్ లోనూ కొనసాగారు. కిరణ్ కుమార్ క్యాబినెట్ లో టూరిజం మినిస్టర్ గా ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. గతేడాది జనవరి 29న విశాఖపట్నంలో ఆయన కన్నుమూశారు.