కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. ఉభయగోదావరి, విశాఖ జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన

vayu gundam : వాయుగుండం కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. మరో 12గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. నర్సాపురం, విశాఖ, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 320కి.మి. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 20సెం.మీ. కంటే అత్యధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలలోపాటు విశాఖ, కృష్ణాపైనా అధికంగా ప్రభావం:
తీవ్ర వాయుగుండం ఉభయ గోదావరి జిల్లాలపై విరుచుకుపడే అవకాశముంది. ఉభయ గోదావరి జిల్లాలలోపాటు విశాఖ, కృష్ణాపైనా అధికంగా ప్రభావం చూపే అవకాశముంది. కోస్తాలోని మిగిలిన జిల్లాలపైనా కొంతమేర ప్రభావం ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. తీరం వెంబడి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.
వాయుగుండం ప్రభావంతో.. తెలంగాణలోనూ వర్షాలు:
వాయుగుండం ప్రభావంతో.. తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ వాన కురుస్తోంది. బంజారాహిల్స్, మెహదీపట్నం, ఉప్పల్, నాగోల్, సికింద్రాబాద్, పంజాగుట్టతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ కురుస్తోంది. రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు చర్యలు చేపడుతున్నారు.