AP Congress : తెలంగాణలో విజయం ఏపీ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వ్యూహ రచన

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగుపడింది. జిల్లాల్లో పర్యటించడం, పార్టీ పెద్దలను అడపాదడపా ఏపీకి తీసుకువస్తుండటంతో కార్యకర్తల్లో కొంత ఉత్సాహం కలిగింది.

AP Congress : తెలంగాణలో విజయం ఏపీ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వ్యూహ రచన

AP Congress

AP Congress New Inspiration : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తెలంగాణలో విజయం ఏపీ కాంగ్రెస్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో నిరుత్సాహంతో ఉన్న నేతలంతా ఇప్పుడు ఆంధ్రరత్న భవన్‌ వైపు ఆశగా చూస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రెండు రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించే పనిలో ఏఐసీసీ నిమగ్నమైంది.

రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది. సీనియర్లంతా కాంగ్రెస్‌ను వీడటం.. ఓటర్లంతా ఇతర పార్టీల వైపు మళ్లడంతో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున చిరంజీవి ప్రచారం చేసినా ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది.

Telangana Congress Cabinet: కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉన్న నేతలు వీరే?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగుపడింది. జిల్లాల్లో పర్యటించడం, పార్టీ పెద్దలను అడపాదడపా ఏపీకి తీసుకువస్తుండటంతో కార్యకర్తల్లో కొంత ఉత్సాహం కలిగింది. మరోవైపు రాహుల్‌గాంధీ చేపట్టిన జోడో యాత్ర విజయవంతం కావడంతోపాటు, కర్ణాటకలో పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే తెలంగాణలోనూ విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురించాయి.

ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రామస్థాయి నుంచి బూత్ కమిటీలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేయాలని ఏపీ కాంగ్రెస్ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇదే సమయంలో తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు కూడా వ్యూహాలు రచిస్తోంది.

BJP MP GVL : తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం ఖాయం : జీవీఎల్

టీడీపీ, జనసేన పొత్తు విషయంలో బీజేపీ ఇప్పటికీ సైలెంట్‌గా ఉంది. దీంతో ఆ పార్టీలతో కలిసి వెళ్లాలా? లేదా ఒంటరిగానే పోటీ చేయాలా అన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కలిస్తే.. ఆ కూటమిలో కాంగ్రెస్ చేరే అవకాశం లేదు. కానీ కమలం పార్టీ లేకుండా రెండు పార్టీలే ఎన్నికలకు వెళ్తే మాత్రం పొత్తులో భాగస్వామ్యం కచ్చితమనే చర్చ ఇప్పటికే ప్రారంభమైంది.

ఇటు తెలంగాణ కాంగ్రెస్ విజయంలో టీడీపీ భాగస్వామ్యం ఉందన్న ప్రచారంతో ఏపీలోనూ పొత్తుల అంశంపై కొన్ని వారాల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటి నుంచే రాష్ట్రంలోని ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటక, తెలంగాణలో ఇచ్చిన ఎన్నికల హామీలను మ్యానిఫెస్టోలో పెట్టి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

Telangana Election Results : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10మంది మహిళలు.. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు

ముఖ్యంగా ఉచితంగా గ్యాస్ సిలెండర్లు, మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం వంటి స్పెషల్ స్కీమ్స్‌ను ఎన్నికలకు ముందుగానే ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో ఏపీతో సన్నిహిత సంబంధాలున్న కాంగ్రెస్ ముఖ్య నేతలను ఏపీకి తీసుకురావడం ద్వారా పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేస్తూనే వచ్చే ఎన్నికల్లో ఎలా అధికారంలోకి రావాలో అన్న వ్యూహ రచనలు ఏపీ కాంగ్రెస్ ప్రారంభించింది.