Electric Vehicle Blast: విజయవాడ విద్యుత్ వాహనం పేలుడు: బైక్ తయారీదారుపై చర్యలకు కుటుంబ సభ్యులు డిమాండ్
బైక్ బయటపెట్టి..బ్యాటరీ మాత్రమే ఇంట్లోకి తీసుకెళ్లి చార్జింగ్ పెట్టి ఉండడంతో..ఈ పేలుడు సంభవించినట్లు గుర్తించామని షోరూమ్ నిర్వాహకుడు పేర్కొన్నాడు

Bike Blast
Electric Vehicle Blast: విజయవాడ సత్యనారాయణపురం పీఎస్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకున్న విద్యుత్ ద్విచక్ర వాహనం పేలుడు ఘటనలో శివకుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈఘటనలో గాయపడిన మృతుడి భార్య, పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సాంకేతిక లోపంతోనే బైక్ పేలి తన కుమారుడు మృతి చెందాడని మృతుడు శివకుమార్ తండ్రి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం 10టీవీతో మాట్లాడిన రాంబాబు ఘటన వివరాలు వెల్లడించారు. తన కుమారుడు శివకుమార్ శుక్రవారం ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వచ్చాడని..రాత్రి బైక్ బ్యాటరీకు చార్జింగ్ పెట్టి అందరూ నిద్ర పోగా..అనంతరం తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించినట్లు రాంబాబు తెలిపారు.
Also read:Electric Scooters : పేలుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఈ జాగ్రత్తలు పాటించండి
పేలుడును గమనించి తన కుమారుడు ఇంటికి వెళ్లి చూడగా మంచం మీద కుమారుడు, కోడలు ఇద్దరు బిడ్డలు కనిపించలేదని, పేలుడు ధాటికి వారు కింద పడి పక్కనే ఆర్తనాదాలు పెడుతున్నట్లు రాంబాబు వివరించారు. వెంటనే స్థానికుల సహకారంతో కొడుకు, కోడలును హాస్పిటల్ కి తరలించామని..ఆస్పత్రికి తరలించే సమయంలో శివకుమార్ మృతిచెందాడని రాంబాబు తెలిపారు. ఎలక్ట్రిక్ బైక్ నా కుమారుడు శివకుమార్ పాలిట శాపంగా మారుతోందని ఊహించలేదంటూ రాంబాబు కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కుమారుడి చావుకి కారణమైన బైక్ తయారీ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాంబాబు డిమాండ్ చేశారు.
కాగా బైక్ పేలిన ఘటనపై సదరు వాహనం షోరూం సేల్స్ మేనేజర్ సత్య స్పందిస్తూ..శివకుమార్ అనే వ్యక్తి తమ వద్ద కార్బెట్ 14 అనే ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకెళ్లిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే శివకుమార్ తాత్కాలికంగా డెమో కోసమే బైక్ ను తీసుకెళ్లారని, రెండు రోజులు వాడి నచ్చితే నగదు ఇచ్చి బైక్ ను రిజిస్టర్ చేసుకుంటానని తెలిపినట్లు సేల్స్ మేనేజర్ వివరించారు. శివకుమార్ తమ పాత కస్టమరేనని పదేళ్ల క్రితం కూడా ఓ బైక్ కొన్న ఆయనకు ఎలక్ట్రిక్ బైక్ పై అవగాహన ఉండే ఉంటుందని సేల్స్ మేనేజర్ సత్య పేర్కొన్నారు.
Also read:Electric Vehicle Blast: మరో విద్యుత్ ద్విచక్ర వాహనం పేలుడు: వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు
బైక్ తీసుకెళ్లే సమయంలో బైక్ డెమో అంతా వివరించామని, బైక్ బయటపెట్టి..బ్యాటరీ మాత్రమే ఇంట్లోకి తీసుకెళ్లి చార్జింగ్ పెట్టి ఉండడంతో..ఈ పేలుడు సంభవించినట్లు గుర్తించామని షోరూమ్ నిర్వాహకుడు పేర్కొన్నాడు. బ్యాటరీ పేలుడు ఎలా జరిగింది అనే విషయాన్ని కంపెనీ నుంచి వచ్చే సాంకేతిక బృందం విశ్లేశిస్తుందని షోరూమ్ ప్రతినిధి పేర్కొన్నారు. విద్యుత్ ద్విచక్ర వాహనాల్లో బ్యాటరీ ఛార్జింగ్ నిండిన అనంతరం ఆటోమెటిక్ గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, అయితే ప్రస్తుత ఘటనకు షార్ట్ సర్క్యూటా, లోడ్ బ్యాలన్స్ వలన జరిగిందా..అనే విషయం తెలియాల్సి ఉన్నట్లు షోరూం ప్రతినిధి వివరించారు.
Also read:Kidnap Murder : కిడ్నాప్‌కు గురైన జ్యూయలరీ షాపు ఉద్యోగి హత్య