వల్లభనేని వంశీ అరెస్టు.. విజయవాడ చేరుకున్నాక ట్విస్టుల మీద ట్విస్టులిచ్చిన పోలీసులు.. వంశీ సతీమణి వాహనం అడ్డగింత
నందిగామ వద్ద వంశీ సతీమణి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వంశీ సతీమణి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎస్కార్ట్ తో ఆమెను హైదరాబాద్ కు తరలించినట్లు ..

Vallabhaneni Vamsi Arrest
Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు ఇవాళ ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీస్ భద్రత మధ్య వంశీని విజయవాడ తరలించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడే ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు.
అయితే, వంశీని విజయవాడ తరలించిన సమయంలో పోలీసులు ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చారు. వంశీ అరెస్టు నేపథ్యంలో వైసీపీ నేతలు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో ముందస్తుగా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, పోలీస్ 30 చట్టం అమలు చేస్తున్నట్లు ఎస్పీ గంగాధర్ తెలిపారు. ర్యాలీలు, సభలు నిషేధమని, ఎవరైనా అసాంఘీక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
Also Read: వల్లభనేని వంశీ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
వల్లభనేని వంశీని పోలీస్ బందోబస్తు మధ్య విజయవాడ తరలించిన పోలీసులు ఏ స్టేషన్ కు తీసుకెళ్తున్నారనే విషయాన్ని తొలుత గోప్యంగా ఉంచారు. ఉదయం వంశీ నివాసానికి వెళ్లిన పోలీసులు.. అతనికి నోటీసులు ఇచ్చారు. అనంతరం వంశీని అరెస్టు చేసి ఆయన సతీమణికి అరెస్టు విషయాన్ని తెలియజేశారు. అనంతరం అతన్ని పోలీస్ బందోబస్తు మధ్య విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో సూర్యాపేట దగ్గర బ్రేక్ పాస్ట్ కోసం కొద్దిసేపు ఆపారు. విజయవాడకు చేరుకోగానే.. వైసీపీ నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చి వంశీని తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారంతో.. వంశీని ఏ స్టేషన్ కు తరలిస్తున్నారనే విషయాన్ని చివరి వరకు పోలీసులు గోప్యంగా ఉంచారు.
తొలుత భవానీపురం పోలీస్ స్టేషన్ కు వంశీని తరలిస్తారని భావించారు. కానీ, భవానీపురం వద్ద వంశీ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపిన పోలీసులు.. అతన్ని వేరే వాహనంలోకి ఎక్కించారు. ఆ తరువాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తారని అనుకున్నప్పటికీ.. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వల్లభనేని వంశీని తీసుకెళ్లారు. అక్కడే అతన్ని విచారిస్తున్నారు. విచారణ అనంతరం వంశీకి విజయవాడలోని జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆ తరువాత విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు సమాచారం.
Also Read: దడపుట్టిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఏలూరు జిల్లాలో మనిషికి సోకిన వైరస్.. అప్రమత్తమైన అధికారులు
మరోవైపు నందిగామ వద్ద వంశీ సతీమణి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వంశీ సతీమణి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎస్కార్ట్ తో ఆమెను హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది. వంశీ అరెస్టు నేపథ్యంలో పడమట పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. పడమట పోలీస్ స్టేషన్ కు వంశీని తీసుకెళ్లాలని తొలుత పోలీసులు భావించారు. ఈ నేపథ్యలో స్టేషన్ వద్దకు స్పెషల్ పార్టీ పోలీసులు, ఎస్బీ, ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు చేరుకున్నారు. స్టేషన్ ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ, సీఐలు, పోలీసులు స్టేషన్ వద్ద, పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే, వైసీపీ కార్యకర్తలు పటమట పోలీస్ స్టేషన్ కు వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. పోలీసులు పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. BNS సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3 (5) కింద కేసులు నమోదు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు.