ఏపీ లాక్‌డౌన్ ఎఫెక్ట్ : విశాఖ, విజయవాడలో రోడ్లన్నీ నిర్మానుష్యం

కరోనా వ్యాప్తిని నియంత్రణపై దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా కఠినమైన ఆంక్షలతో లాక్ డౌన్ విధించాయి. ఇటలీ తరహాలో కరోనా మహమ్మారి విజృంభించకుండా ఉండేలా నియంత్రణ చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది
లాక్ డౌన్ విధించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జనం వాహనాల్లో బయటకు రావడం రోడ్లపై తిరగడంపై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. బయటకు అడుగుపెడితే లాఠీఛార్జ్ చేస్తూ ఇంటికి తరమేస్తున్నారు. వాహనాలను సీజ్ చేయడం.. కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో ఏపీలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్ అయ్యాయి.
రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. అప్పటివరకూ ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి. రైల్వే స్టేషన్లు అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు అధికారులు. నగర వీధులన్నీ నిర్మూనుష్యంగా మారిపోయాయి. మరోవైపు విజయవాడలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రోడ్లపై పోలీసులు తప్ప ఒక్కరూ కూడా కనిపించడం లేదు.
మొన్నటివరకూ లాక్ డౌన్ లైట్ గా తీసుకున్న జనమంతా పోలీసుల దెబ్బకు ఇంట్లోనుంచి బయటకు రావాలంటే బయపడిపోతున్నారు. మొదటి రోజు కంటే.. రెండో రోజు ఏపీలోని ఈ రెండు ప్రధాన జిల్లాల్లో రోడ్లు అంతా ఖాళీగా కనిపించాయి. లారీలు కూడా ఎక్కెడిక్కడ నిలిపివేశారు. ఏ వైపు చూసినా రోడ్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఏప్రిల్ 14 వరకు కొనసాగితే కరోనా వైరస్ పూర్తిస్థాయిలో కట్టడి చేయవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్ డౌన్ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏపీపై పెను ప్రభావం చూపుతోంది. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విజయవాడ, విశాఖ నగరాల్లో లాక్ డౌన్ విధించడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ముఖ్యంగా రవాణా రంగంతో ముడిపడిన రాష్ట్ర ఆర్ధిక రంగంపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.