విజయనగరం టీడీపీలో కొత్త మంట, చంద్రబాబు నిర్ణయంతో రగిలిపోతున్న సీనియర్లు

vizianagaram tdp: పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను నియమించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. పార్టీని పునరుద్ధరించే పనిలో భాగంగా చర్యలు చేపట్టింది. కాకపోతే ఇక్కడే కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయట. కొన్ని చోట్ల పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. నేతల మధ్య వివాదాలు రేగుతున్నాయి. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జునను అధిష్టానం నియమించింది. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు ఆయన. 2019 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి బొత్స సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు.
పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు యువ రక్తానికి అవకాశం:
పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు యువ రక్తానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న తరుణంలో యువకుడైన నాగార్జునకు బాధ్యతలు అప్పగించడంపై జిల్లా పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే నాగార్జున జూనియర్ అయినప్పటికీ, ఆయన బ్యాక్‌గ్రౌండ్ మాత్రం పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. రాజకీయాల్లోకి రాక ముందు విదేశాల్లో చదువుకుని, ఉద్యోగం చేసిన ఆయన.. గత ఎన్నికలకు ముందు రాజకీయ అరంగేట్రం చేశారు.
చంద్రబాబు నిర్ణయంపై సీనియర్ల ఆగ్రహం:
తనకి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ సీనియర్ల మెప్పు పొందుతానని నాగార్జున చెబుతున్నారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, బొబ్బిలి, గజపతినగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ సెగ్మంట్లు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారిని కాదని యువకుడిని ఎంపిక చేయడంపై కొంతమంది సీనియర్ నేతలు కినుక వహించారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకేసి తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు.
నాగార్జున పేరుతో కంగుతిన్న సీనియర్లు:
వాస్తవానికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవిపై చాలామంది బీసీ నేతలు గత కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కె.ఎ.నాయుడు, మీసాల గీత, కోళ్ల లలితకుమారి వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతి, బొబ్బిలి రాజవంశీకుడు, మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీనాయన వంటి నేతల పేర్లు కూడా అప్పుడప్పుడూ వినిపిస్తుండేవి. కానీ, ఆకస్మాత్తుగా నాగార్జున పేరు తెరపైకి రావడంతో సీనియర్లంతా కంగుతిన్నారట.
మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తీవ్ర అసంతృప్తి:
అధిష్టానం నిర్ణయంపై గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని చెబుతున్నారు. తన కార్యాలయానికి పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంగా బోర్డు పెట్టి మరీ తన నిరసన తెలిపారు. కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేసి, తనకి జరిగిన అన్యాయంపై ఏకరువు పెట్టారు. జూనియర్‌కి అధ్యక్ష పదవి ఇచ్చి సీనియర్లను అవమానపరుస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇక టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రభుత్వ విప్ గద్దె బాబూరావు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఏకంగా రాజీనామా చేసిన గద్దె బాబూరావు:
ఎన్టీఆర్ టైంలో జిల్లాలో ఒక వెలుగు వెలిగిన గద్దె బాబూరావు 2004 ఎన్నికల తర్వాత క్రమంగా తెరమరుగయ్యారు. ఒకప్పుడు రెండు జిల్లాల్లో ఎమ్మెల్యే స్థానాల బీ ఫారాలను తన చేతులు మీదుగా పంపిణీ చేసే స్థాయిలో ఉండే బాబూరావును ప్రస్తుత పరిస్థితుల్లో పట్టించుకునే నాథుడే కరువయ్యారట. తనని టీడీపీ నాయకత్వం పట్టించుకోవడం మానేసిందని, ఆత్మగౌరవం కోల్పోయి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కిమిడి నాగార్జునకు పార్టీ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ముందే సమాచారం అందుకున్న బాబూరావు అందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
అశోక్ బంగ్లా ద్వారానే పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయా?
మరోపక్క ఇప్పటి వరకు టీడీపీ జిల్లా కార్యాలయం అంటే అశోక్ గజపతిరాజు నివాసం ఉంటున్న బంగ్లాయే. ఈ బంగ్లా నుంచే పార్టీ కార్యకలాపాలు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే, కరోనా వచ్చినప్పటి నుంచి అశోక్ బంగ్లా గేట్లు మూతపడ్డాయి. కేవలం అశోక్ కుటుంబం తప్ప, మిగిలిన వారికి ప్రవేశం లేకుండా పోయింది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. తాజాగా కొత్త అధ్యక్షుడు నియామకమైన నేపథ్యంలో భవిష్యత్‌లో కూడా అశోక్ బంగ్లా ద్వారానే పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయా? లేక కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాగార్జున వేరే కార్యాలయం ప్రారంభిస్తారా అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.
పార్టీ అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందా?
విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడి నియామకంలో అసలు అశోక్ గజపతిరాజు సలహా, సంప్రదింపులు జరిగాయా? లేక పార్టీ అధిష్టానం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందా? అన్న విషయమై కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తం మీద యువ నాయకుడికి కొత్తగా పార్టీ పగ్గాలను అప్పగించిన నేపథ్యంలో మున్ముందు జిల్లాలో పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది.