Teachers Face Recognition App : టీచర్లకు అటెండెన్స్ యాప్.. అసలు ప్రభుత్వం ప్లాన్ ఏంటి? టీచర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ఫేషియల్ రికగ్నైషన్ అటెండెన్స్ యాప్.. ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? టీచర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్లు చెబుతున్న అభ్యంతరాలు ఏంటి? ప్రభుత్వం ఆలోచన మంచిదా? కాదా? ఎదురుకాబోయే సవాళ్లేంటి?

Teachers Face Recognition App : టీచర్లకు అటెండెన్స్ యాప్.. అసలు ప్రభుత్వం ప్లాన్ ఏంటి? టీచర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

Teachers Face Recognition App : ఫేస్ రికగ్నిషన్ యాప్.. టీచర్ల అటెండెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ యాప్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. టీచర్లు స్కూళ్లకు రాగానే ముందుగా చేయాల్సిన పని ఫొటో దిగడం. ఏపీ స్కూళ్లలో జగన్ సర్కార్ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఫేషియల్ రికగ్నైషన్ హాజరు పద్దతిని ప్రభుత్వం తీసుకొచ్చింది. పాఠశాల విద్యను పటిష్టం చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సర్కార్ టీచర్లను గాడిలో పెట్టేందుకు ఈ కొత్త మార్గం ఎంచుకుంది. మరి దీనిపై టీచర్లు ఏమంటున్నారు? ఊ అంటున్నారా? ఊహూ అంటున్నారా? వాళ్లు చెబుతున్న అభ్యంతరాలు ఏంటి? ప్రభుత్వం ఆలోచన మంచిదా? కాదా? ఎదురుకాబోయే సవాళ్లేంటి? యాప్ ఎపిసోడ్ పై ఇప్పుడు జనాల్లో జరుగుతున్న చర్చేంటి?

ఒకదాన్ని మించి ఒకటి.. ఒకదాని తర్వాత ఒకటి.. ఏపీలో ఒక వివాదం ఎప్పుడూ అలా నానుతూనే ఉంటుంది. స్కూల్ ఫీజుల మీద ఒకసారి, ఎయిడెడ్ స్కూల్స్ మీద మరోసారి, ఒకదానికి మించి మరొకటి కనిపించిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు స్కూల్ చుట్టూ మరో వివాదం అలుముకుంది. అయితే ఈసారి టీచర్ల నుంచి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీచర్లకు కోపం తెప్పిస్తోంది. అలా ఎలా సాధ్యమవుతుందని? ప్రశ్నించేలా చేస్తోంది.

ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసం కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ స్థానంలో ఫేస్ యాప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. టీచర్లు ఒక్క నిమిషం ఆలస్యంగా విధులకు హాజరైనా హాఫ్ డే లీవ్ గా పరిగణించేలా దీన్ని రూపొందించింది పాఠశాల విద్యాశాఖ. సిమ్స్ ఏపీ పేరుతో ఈ యాప్ ను ప్లే స్టోర్ లో అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది పని చేస్తుంది. ప్రతి ప్రభుత్వ టీచర్ తప్పనిసరిగా ఈ యాప్ ను తమ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులకు కూడా అదే యాప్ నుంచి హాజరు వేయాలని క్లియర్ గా చెప్పింది.

రాష్ట్రంలో మొత్తం లక్షా 70వేల మంది టీచర్లు పని చేస్తుండగా, దీన్ని డౌన్ లోడ్ చేసుకున్న వారు చాలా తక్కువ మంది. గర్నమెంట్ టీచర్లు విధులకు సక్రమంగా సకాలంలో హాజరుకావడం లేదంటూ ఫిర్యాదులు అందడంతో విద్యా మంత్రిత్వ శాఖ దీన్ని ప్రవేశపెట్టింది. ముందుగా హెడ్ మాస్టర్ ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీచర్ల ముఖాలను మూడు కోణాల్లో ఇందులో అప్ లోడ్ చేయాల్సి ఉంది. ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా లెక్కలోకి తీసుకుంటారు. ఉదయం స్కూల్ కి వచ్చినప్పుడు ఒకసారి, సాయంత్రం తిరిగి వెళ్లేటప్పుడు మరోసారి ఇలా రెండుసార్లు హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ యాప్ పై టీచర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు కోసం యాప్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
1. యాప్ ప్రవేశపెట్టడం వెనుక సర్కార్ టార్గెట్ ఏంటి?
2. యాప్ పై టీచర్ల అభ్యంతరాలు ఏంటి?
3. యాప్ తో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యే ఛాన్స్ ఉంది?
4. యాప్ హాజరుపై టీచర్లలో వినిపిస్తున్న సందేహాలు ఏంటి?
5. యాప్ హాజరుపై టీచర్లు రాద్దాంతం చేస్తున్నారా?

ఏపీ స్కూల్స్ లో యాప్ హాజరు విధానం అమల్లోకి తీసుకొచ్చిన వేళ ఇప్పుడు చాలామందిలో వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. యాప్ అధికారిక హాజరుపై టీచర్లు, విద్యాశాఖ మధ్య బయటకు కనిపించని యుద్ధమే జరుగుతోంది ఇప్పుడు. ఈ విధానాన్ని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య, ఇతర ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే ఉద్యమానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. యాప్ హాజరుపై టీచర్లలో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిలోమీటర్ దూరంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5వ తరగతులను హైస్కూళ్లలో విలీనం చేశారు. టీచర్లను కొత్త స్కూళ్లలో సర్దుబాటు చేశారు.

యాప్ లో మాత్రం పాత స్కూల్ లోనే ఉన్నట్టు చూపిస్తున్నారు. వీరి హాజరు సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఉదయం 9 గంటల లోపే హాజరు వేయాలనే నిబంధన పెట్టారు. నెట్ వర్క్ సమస్యతో హాజరు పడకపోతే పరిస్థితి ఏంటనేది వాళ్లు వేస్తున్న మరో ప్రశ్న. స్మార్ట్ ఫోన్ లేని వారి పరిస్థితి ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే తమకు ట్యాబ్ లు ఇవ్వాలని, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

”ఇవి మా సొంత ఫోన్లు. మా వ్యక్తిగత ఫోన్లు. అలాంటి వాటిలో మేము యాప్ డౌన్ లోడ్ చేసుకోము. కచ్చితంగా ప్రభుత్వం దీనిపై ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వమే డివైజ్ ఇవ్వాలి. కెపాసిటీ పెంచాలి. గంట సేపు ప్రయత్నం చేసినా ఒక్క ఫొటో కూడా అప్ లోడ్ అవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్లు పాఠాలు చెప్పలేరు. విద్యా వ్యవస్థను ఇంత గందరగోళంలోకి నెట్టడం కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వమే టీచర్లకు డివైజ్ లు ఇస్తే అటెండెన్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని టీచర్ల సమాఖ్య ప్రతినిధి చెప్పారు.

స్కూళ్లలో టీచర్ల అటెండెన్స్ కు సంబంధించి గతంలో రిజిస్ట్రర్ లో సంతకం చేసేవారు. ఆ తర్వాత వేలి ముద్రల ద్వారా అటెండెన్స్ వేసే విధానం తీసుకొచ్చారు. దీంతో పాటు ఐరిస్ ద్వారా హాజరు నమోదు చేశారు. కరోనా కారణంగా ఈ విధానాలు నిలిచిపోయాయి. అయితే టీచర్లు స్కూళ్లకు సరిగా రావడం లేదని, విద్యార్థులకు సరైన బోధన అందడం లేదన్న ఆరోపణలు రావడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది ప్రభుత్వ వాదన. అటెండెన్స్ యాప్ సరిగ్గా ఉదయం 9 గంటలకు ఓపెన్ అవుతుంది. ముందు కానీ తర్వాత కానీ అది ఓపెన్ అవ్వదు. సాంకేతిక సమస్య అయినా మరేదైనా 9గంటలకు యాప్ లో ఫొటో అప్ లోడ్ చేయకపోతే ఆ టీచర్ సెలవు కిందే లెక్క. ఒకే టీచర్ ఉన్న స్కూళ్లకు దీని వల్ల ఇబ్బంది అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే నెట్ వర్క్ సమస్య లేకుండా ఆఫ్ లైన్ ఎంపికకు కూడా అవకాశం ఉందని విద్యాశాఖ అంటోంది. 9కి అరగంట ముందు వచ్చి ఫొటోలు అప్ లోడ్ చేస్తే ఒకవేళ సిగ్నల్ సమస్య ఉన్నా అంతా సెట్ అయ్యాక సర్వర్ కు కనెక్ట్ అవుతుందని వివరిస్తోంది.

చాలా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విధుల విషయంలో మేనేజ్ చేస్తున్నారు చాలామంది. అలాంటి టీచర్లను దారిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. పాఠశాల విద్యాను పటిష్టం చేయడానికి ఏపీ సర్కార్ రకరకాల పథకాలు తీసుకువస్తోంది. సర్కారీ స్కూళ్ల తలరాతలే మారిపోయేలా నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టింది. కోట్లకు కోట్లు ఖర్చు చేస్తోంది. జగనన్న విద్యాదీవెన కారణంగా స్కూళ్లకు విద్యార్థుల హాజరు కూడా పెరిగింది. అలాంటిది స్కూళ్లలో టీచర్లు సరైన సమయానికి వచ్చి సరైన సమయంలో విద్యార్థుల పక్కన ఉంటే ఆ ఇంపాక్ట్ ఆలోచన చేయడానికి కూడా హైలో ఉంటుంది కదా అన్నదే సర్కార్ భావన.

టీచర్ల హాజరును సెట్ చేస్తే క్లాసులు కరెక్ట్ గా జరుగుతాయి. క్లాసులు జరిగితే రిజల్ట్ బాగుంటుంది. రిజల్ట్ బాగుంటే విద్యా ప్రమాణాలు పెరుగుతాయని సర్కార్ అంచనా వేస్తోంది. అందుకే కష్టంగా ఉన్నా కష్టమైన విధానాన్ని సర్కార్ అమలు చేస్తోందన్న చర్చ నడుస్తోంది.

బతకలేక బడి పంతులు అనే వాళ్లు ఒకప్పుడు. బతుకంటే బడి పంతులదే అనేది ఇప్పటి మాట. జీవితాలు, జీతాలు అన్నీ బాగున్నాయి. ఓ అద్భుతమైన సమాజ నిర్మాణంలో టీచర్ పాత్ర వెలకట్టలేనిది. అందుకే ఆచార్య దేవో భవ అని తల్లి,తండ్రి తర్వాత స్థానాన్ని గురువుకి ఇచ్చారు. అలాంటిది కొందరు టీచర్ల కారణంగా ఇప్పుడు విద్యావ్యవస్థే ప్రమాదంలో పడిపోయిన పరిస్థితి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఐఏఎస్, ఐపీఎస్ అయిన వారు ఎంతోమంది. మరిప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే లేదనే సమాధానం వస్తోంది. గవర్నమెంట్ స్కూల్ అంటేనే ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాంటి స్కూళ్లకు ప్రాణం పోయాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే టీచర్లు కరెక్ట్ సమయంలో వచ్చి కరెక్ట్ సమయంలో స్టూడెంట్ తో ఉంటే చాలు మార్పు అడ్రస్ వెతుక్కుని మరీ వస్తుంది. మంచి అయినా, మందు అయినా, మార్పు అయినా ముందుగా చేదుగానే ఉంటుంది. కాస్త ఓర్చుకోవాలి.

ప్రభుత్వం కూడా టీచర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. సాంకేతిక సమస్యలను సెట్ చేయాల్సిన అవసరం ఉంది. టీచర్లలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి. టీచర్ల హాజరు అనేది విద్యార్థుల హాజరును డిసైడ్ చేయాలి. అంతే తప్ప లేని పోని యుద్ధాలతో అర్థం లేని వాదనలతో విద్యార్థులు హాజరు కాకుండా హాజరైనా ఏమీ ఫలితం లేకుండా ఉండే పరిస్థితులు తీసుకురావొద్దు. అదే జరిగితే సర్కారీ స్కూళ్లు మరింత ప్రమాదంలో పడతాయన్నది మాత్రం క్లియర్ కట్.