ఏలూరు టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం ఎవరికి? వీరిలో సీఎం చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి?

బీసీలకు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే, ఆ కెపాసిటీ ఉన్న నేతలెవరు..?

ఏలూరు టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం ఎవరికి? వీరిలో సీఎం చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి?

Updated On : September 26, 2025 / 8:35 PM IST

Eluru: ఏలూరు జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనన్నది ఉత్కంఠ కొనసాగుతోంది. ఏలూరు సైకిల్ సవారీ రేసులో ఉన్న నేతల నుంచి ఇప్పటికే త్రిసభ్య కమిటీ దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లా అధ్యక్ష పదవి తమ నేతకే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకోవడం హాట టాపిక్‌గా మారింది.

ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఉన్నారు. ఆయనకు డీసీసీబీ ఛైర్మన్ పదవి దక్కింది. ఆ తర్వాత ఆప్కాబ్ ఛైర్మన్‌గా కూడా కీలక పదవి ఇవ్వడంతో పాటు, ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు దక్కనివారికి జిల్లా బాధ్యతలు ఇచ్చి, గుర్తింపునిచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందంటున్నారు. (Eluru)

జిల్లాకు వచ్చి అభిప్రాయ సేకరణ చేసిన త్రిసభ్య కమిటీ ఆరుగురి పేర్లు అధిష్టానంకు పంపించిందట. వారిలో ప్రస్తుత అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుతో పాటు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటామురళితో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీసీ సామాజిక వర్గానికి చెందిన దాసరి శ్యామ్ చంద్రశేషు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: వరల్డ్‌ బ్యాంకుకు లేఖ రాసిన ఎమ్మెల్యే.. ఇదేం ట్విస్ట్.. రాసింది ఇందుకేనా?

ఈ ఆరుగురు నేతల్లో ఎవరిని జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుందనేదానిపై ఇప్పుడు ఏలూరు జిల్లా టీడీపీ శ్రేణులతో పాటు ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. అయితే ఆప్కాబ్ ఛైర్మన్ పదవి దక్కడంతో గన్ని వీరాంజనేయులుకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇక దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా ప్రెసిడెంట్ పోస్ట్ చేపట్టేందుకు సుముఖంగా లేరట. మిగిలిన నలుగురిలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ, కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వచ్చిన నేత కావడంతో లోకల్ లీడర్లు అభ్యంతరం తెలుపుతున్నారట. దీంతో ఘంటా మురళీ పేరు వెనక్కు వెళ్లినట్లేనని కొందరి వాదన.

జిల్లా అధ్యక్ష బాధ్యతలపై చంటి ఆసక్తిగా లేరా?

ఇక జిల్లాలో గట్టిగా వినిపిస్తున్న పేర్లలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ బడేటి చంటి. టీడీపీ కుటుంబానికి చెందిన బడేటి ఫ్యామిలీకి పదవి ఇస్తే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని అధిష్టానం దగ్గరకు తీసుకెళ్లారట కొందరు పెద్దలు. అయితే జిల్లా అధ్యక్ష బాధ్యతలపై బడేటి చంటి అంత ఆసక్తిగా లేరట.

కానీ టీడీపీలో చేరిన ఆళ్లనానికి జిల్లా అధ్యక్ష పగ్గాలు ఇస్తారన్న ప్రచారంతో..బడేటి చంటి అలర్ట్ అయ్యారట. ఎట్టి పరిస్థితుల్లో ఆళ్లనానికి జిల్లా అధ్యక్ష పోస్ట్ దక్కడానికి వీళ్లేదనే పట్టుదలతో ఉన్నారట. ఈ నేపథ్యంలో బడేటి చంటి అధ్యక్ష రేసులో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఏలూరు జిల్లాగా మారిన తర్వాత కూడా ఓసీలను జిల్లా రథసారథులుగా నియమిస్తూ వచ్చింది టీడీపీ అధిష్టానం. ఈసారైనా బీసీలకు ఇవ్వాలంటూ గట్టిగానే డిమాండ్ వినిపిస్తున్నారట. కీలక బీసీ నేతలతో తెరవెనుక ప్రయత్నాలు కూడా గట్టిగానే చేస్తున్నట్టు తెలుస్తుంది

బీసీలకు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే, ఆ కెపాసిటీ ఉన్న నేతలెవరు..? అసలు అధ్యక్ష పీఠానికి దరఖాస్తు చేసుకున్నదెవరని ఆరాతీస్తే, యాదవ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పోలవరం నియోజకవర్గానికి చెందిన శీలం వెంకటేశ్వరరావు, గౌడ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, చింతలపూడి నియోజకవర్గానికి చెందిన దాసరి శ్యామ్ చంద్రశేషు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పటికే యాదవ సామాజికవర్గం నుంచి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథితో పాటు ఇడా ఛైర్మన్ కూడా ఉన్నారు.

దీంతో బీసీల్లో యాదవుల తర్వాత అత్యధిక వర్గం ఉన్న గౌడ, శెట్టిబలిజ వారికి న్యాయం ఎప్పుడు చేస్తారంటూ, మరోవర్గం అధిష్టానాన్ని ప్రశ్నిస్తుందట. దీంతో గౌడ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషుకు జిల్లా అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చిందంటున్నారు. అయితే కాపు నేతకు ఇస్తే బడేటి చంటికి, బీసీకి ఇస్తే దాసరి శేషుకు పార్టీ పగ్గాలు దక్కడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. మరి అధిష్టానం మదిలో ఏముందో వేచి చూడాలి.