కోరి తెచ్చుకొంటే… చిచ్చుపెడుతున్నారా?

  • Published By: sreehari ,Published On : July 17, 2020 / 05:51 PM IST
కోరి తెచ్చుకొంటే… చిచ్చుపెడుతున్నారా?

Updated On : July 17, 2020 / 6:11 PM IST

ప్రభుత్వం మారిన తర్వాత రమణ దీక్షితులుకి గౌరవ ప్రధాన అర్చక పదవి వరించింది. కానీ ఆయనెందుకు సంతృప్తి చెందడం లేదు. టీటీడీపై ప్రత్యక్షంగా జగన్ సర్కార్‌పై పరోక్షంగా ఎందుకు విరుచుకుపడుతున్నారు..? ట్విటర్ వేదికగా రమణ సంధిస్తున్న ట్వీట్లు ప్రభుత్వానికి కంటగింపుగా మారుతున్నాయా..? రమణ దీక్షితులు అసలు టార్గెట్ ఏంటి..?
రమణ దీక్షితులు మళ్లీ మాటల తూటాలు పేలుస్తున్నారు.

టైమ్‌ చూసుకుని మరీ టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. పుండుపై కారం చల్లినట్లుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శ్రీవారి ఆలయంలో పని చేసే సన్నిధి.. గొల్లలకు వంశపార్యపర హాక్కులను కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది రమణ దీక్షితులుకి నచ్చలేదని సమాచారం. అందుకే ప్రభుత్వంతో పరోక్షంగా కయ్యానికి కాలు దువ్వుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. టీటీడీ ఆస్తులకి సంబంధించి ఆడిట్‌.. ఆలయాలకు ప్రభుత్వం నుంచి విముక్తి.. కరోనా టైమ్‌లో దర్శనాలెందుకని.. ఇలా వరుసగా ట్వీట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

టీటీడీ లెక్కచేయలేదని ఆగ్రహం :
అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతో వయో పరిమితి పేరుతో తమను మోసపూరితంగా తొలగించారని.. వంశ పారపర్యంగా అర్చకులను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించినా టీటీడీ పట్టించుకోలేదన్నది రమణ దీక్షితులు వాదన. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఆదేశించినా.. టీటీడీ ఖాతరు చేయడం లేదని ఆరోపిస్తున్నారాయన. ప్రభుత్వం మారినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలే ఇప్పటికీ అమలవుతున్నాయని రమణదీక్షితులు మండిపడుతున్నారు. సీఎం జగన్‌పై నమ్మకంతో మరికొంత కాలం వేచి ఉంటామని చెబుతూనే ట్వీట్ అస్త్రాలు సంధించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

కరోనా విజృంభిస్తుంటే దర్శనాలెందుకు? :
జగన్‌ ప్రభుత్వాన్ని పొగుడుతూనే టీటీడీ పాలకమండలిపై విమర్శలు గుప్పిస్తున్నారు రమణ దీక్షితులు. కొంతమంది అధికారులు కొందరికి తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమధ్య మరో సంచలన ట్వీట్ చేశారు. టిటిడి అర్చకులు కరోనా బారిన పడుతుంటే శ్రీవారి దర్శనం ఎందుకు నిలిపివేయడం లేదని ప్రశ్నించారు. ఈఓ, ఏఈఓ తీరుతో చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ కామెంట్లు చాలా దూరం వెళ్లాయి. స్వయంగా టీటీడీ చైర్మన్‌ స్పందించారు. అర్చకులకు రాజకీయాలు తగదని సున్నితంగా మందలించారు. సమస్యలు, ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలే తప్ప సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేశారు.

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు! :
వరుస ట్వీట్‌లతో సెగ పుట్టిస్తున్న రమణ దీక్షితులు వ్యవహారంతో సీఎం పేషీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అర్చక వారసత్వాన్ని పునరుద్ధరించినా రమణ దీక్షితులు వ్యవహారం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుధ్ధరించడమే కాకుండా.. గొల్లలకు వారి పారంపర్య హక్కులను కాపాడి తిరుమలలో సముచిత స్థానం కల్పించింది. ఇవన్నీ తమకు అనుకూలంగా పరిణమించే అంశాలుగా సర్కారు భావిస్తోంది. అయితే రమణ దీక్షితులు వ్యవహారం కంటిలో నలుసులా మారినట్టు తెలుస్తోంది. ఇన్ని ఆరోపణల మధ్య ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

25ఏళ్లుగా రమణ దీక్షితులు అర్చక విధులు :
ఏ.వి.రమణ దీక్షితులు పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్య క్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో దాదాపు 25ఏళ్ళ పాటు ప్రధాన అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నారు. అర్చకత్వంలో తలపండిన మాట నిజమే. కానీ సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటివరకు టీటీడీ ఆస్తులు, ఆభరణాలు, ఆదాయవ్యాయాలపై ఆడిట్ జరపాలని కొద్దిరోజుల క్రితం రమణ దీక్షితులు చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్ని లేపింది. అది మరువకముందే వారం క్రితం మరో ట్వీట్ చేశారాయన. ఆలయాలకు ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలని పేర్కొన్నారు. ఇది కొత్త వివాదానికి దారితీసింది.

కరోనా బారిన పడుతున్న టీటీడీ ఉద్యోగులు :
లాక్‌డౌన్‌ తర్వాత కొద్ది రోజుల కిందట శ్రీవారి దర్శనానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. చాలా జాగ్రత్తలు పాటించినప్పటికీ టీటీడీలో చాలామంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీంతో మరోసారి రమణ దీక్షితులు సంచలన ట్వీట్ చేశారు. ఇప్పటికే 15 మంది అర్చకులకు వైరస్ సోకి క్వారంటైన్‌లో ఉన్నారని.. మరికొందరి రిపోర్ట్‌ రావాల్సి ఉందన్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే దర్శనాలు ఆపేందుకు టీటీడీ ఈఓ, ఏఈఓ ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. ఇదిలాగే కొనసాగితే పెద్ద ఉపద్రవం తప్పదని హెచ్చరించారు. ఈఓ, ఏఈఓలు టీడీపీకి, మాజీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రమణ దీక్షితులు బాంబు పేల్చారు.

టీటీడీపై కొనసాగుతున్న ప్రభుత్వ అజమాయిషీ :
అవకాశం చిక్కినప్పుడల్లా తనదైన స్టయిల్‌లో పంచ్‌లు పేలుస్తూనే ఉన్నారు రమణదీక్షితులు. నిజానికి టిటిడి స్వతంత్ర సంస్థ. అటానమస్ బాడీ. అయినప్పటికీ టీటీడీపై ప్రభుత్వ ఆజమాయిషీ కొనసాగుతోంది. బహుశా ఇదే రమణ దీక్షితులు జీర్ణించుకోలేకపోతున్నారని స్పష్టమవుతోంది. అయినప్పటికీ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు సంధించకుండా పాలకమండలిపైనే విరుచుకుపడుతున్నారు. అయితే ఇది పరోక్షంగా ప్రభుత్వంపై యుద్ధానికి దిగడమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి.

గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసినట్టే ఇప్పుడు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వాలు మారినా తన పంథా ఇదేనని చెప్పకనే చెబుతున్నారు. రమణ దీక్షితులు చేస్తున్న కామెంట్లు జగన్‌ సర్కార్‌కు కొత్త సమస్యలు తెచ్చిపెట్టినట్టే కనిపిస్తోంది. ఏరికోరి తెచ్చుకుంటే.. అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నాడని కొంతమంది నేతలు కొండపై గుసగుస లాడుకుంటున్నారట. మొత్తానికి రమణదీక్షితులు వ్యాఖ్యలు చివరకు ఏ దరికి చేరుస్తాయోనన్న ఆందోళన అధికార పార్టీలో వ్యక్తమవుతోంది. స్పాట్..

గత ప్రభుత్వ హయాంలో టీటీడీ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు రమణ దీక్షితులు. శ్రీవారి ఆలయంలో స్వామి వారికి కైంకర్యాలు, నివేదనలు వైఖానస అగమం ప్రకారం జరగడం లేదని విమర్శించారు. శ్రీవారి ఆభరణాలలో అతి విలువైన పింక్ డైమండ్ మాయమైందని… టీటీడిలో పనిచేస్తున్న అధికారులు కొంతమందికి తొత్తులుగా మారారని మండిపడ్డారు.

శ్రీవారి ఆలయంలోని వకుళమాత పోటులో తవ్వకాలు జరిపి అక్కడ నేలమాలిగలను తరలించారని తీవ్ర ఆరోపణలు చేశారు రమణదీక్షితులు. ఈ ఆరోపణల పై ఘాటుగా స్పందించిన అప్పటి ప్రభుత్వం 65 ఏళ్ల జీవోను తెర పైకి తెచ్చి ఆయనతో పాటు మరికొంత మంది అర్చకుల చేత 2017 మే 15న పదవీ విరమణ చేయించింది. అర్చకులకు పదవి విరమణ లేనప్పటికీ తమను కక్ష పూరితంగా తొలగించారని ఎన్నికలకు ముందు.. వైసీపీ అధినేత జగన్‌ను కలిసి విన్నవించారు రమణ.

రమణ దీక్షితులు ఎంట్రీ ఇస్తాడని జోరుగా ప్రచారం :
రమణ దీక్షితులు ఆవేదనపై స్పందించిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్ తాము అధికారంలోకి వస్తే అర్చకులకు పదవీ విరమణను తొలగిస్తామని హమీనిచ్చారు. ఎన్నికల్లో వైసిపి విజయం సాధించినప్పటికీ.. రమణ దీక్షితులుకు టీటీడీ ప్రధాన అర్చకుడు హోదాను మాత్రం ప్రభుత్వం కట్టబెట్టలేదు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తిరుమల వెళ్లినప్పుడు పట్టువస్త్రం కప్పి సత్కరించి ఆదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో రమణ దీక్షితులు మరోసారి ఆలయంలోకి ఎంట్రీ ఇస్తాడని భావించారంతా. టీటీడీ పాలకమండలి తొలి సమావేశంలోనే దీనికి సంబంధించి తీర్మానం చేస్తారనే వార్త చక్కర్లు కొట్టింది. కానీ దానికి భిన్నంగా రమణ దీక్షితులుకి గౌరవ ప్రధాన అర్చక పదవిని మాత్రమే కట్టబెట్టారు.

అలాగే టీటీడీ ఆగమ సలహాదారుడిగా మరో పదవిని ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్చకుల వారసత్వ హక్కులను కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అర్చకులకు రిటైర్మెంట్ ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే ఈ ప్రకటనలో చిన్న మెలిక పెట్టింది. టీటీడీ మినహా మిగతా అన్ని ఆలయాలకు ఇది వర్తిస్తుందని జీవోలో పేర్కొంది.