మరో విడత నామినేటెడ్ పోస్టులకు ముహూర్తం ఫిక్స్..!?
దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పిఠాపురం SVSN వర్మ లాంటి వారు కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు.

నామినేటెడ్ పదవుల కోసం కూటమి క్యాడర్, లీడర్లు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 13 నెలలుపూర్తి అయినా, నామినేటెడ్ పదవుల భర్తీ ఇంకా పూర్తికాకపోవడంతో కూటమి నేతల్లో నిరాశ, నిస్పృహ కనిపిస్తోంది. కష్టపడ్డాం..పార్టీ గెలిచింది..పవర్‌లో ఉన్నామనే సంతోషం కంటే తమ కష్టానికి తగ్గట్లుగా పదవులు దక్కలేదన్న అసంతృప్తే ఎక్కువగా ఉందట.
ఇంకా 40శాతం పోస్టులు పెండింగ్‌లోనే ఉండటంతో పదవి దక్కని నేతలు ఆశగా అధినాయకత్వంవైపు చూస్తున్నారు. ఇంకా 115 మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులు.. కీలకమైన మైనింగ్ కార్పొరేషన్, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఖాళీ అయిన ఫైబర్ నెట్ కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం పెండింగ్‌లోనే ఉంది. కమ్మ, బ్రాహ్మణ కార్పొరేషన్లకు చైర్మన్, సభ్యులను నియమించాల్సి ఉంది.
అలాగే డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్ల నియామకం కూడా పెండింగ్ లిస్ట్‌లోనే ఉన్నాయి. ఈ పదవుల కోసం ఆశావహులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల పాలకమండళ్ల నియామక ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు నామినేటెడ్ సిఫార్సుల జాబితాను అధినాయకత్వానికి అందజేశారు. అయితే రెండు, మూడు రోజుల్లోనే దేవస్థానాలకు పాలక మండళ్ల నియామక ప్రక్రియను ప్రారంభిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
Also Read: సనాతన ధర్మం కోసం పవన్ కల్యాణ్‌తో కలిసి మాధవీలత పనిచేస్తారా? తేల్చిచెప్పిన మాధవీలత
రాష్ట్రంలో నామినేటెడ్ పదవులకు కూటమి పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉన్నారు. ఇప్పటికే కొందరు నేతలకు పదవీ యోగం దక్కగా, కష్టించి పనిచేసిన మరికొందరు నేతలు పదవుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. దేవాలయ పాలక మండలి నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి వేలాదిమంది ఆశావహులు ఉన్నారు. మూడు పార్టీల నుంచి దాదాపు 70 వేలకు పైగా దరఖాస్తులు అధినాయకత్వానికి అందాయట.
మూడు పార్టీల నుంచి భారీ పోటీ
అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3వేల 200 నామినేటెడ్ పదవులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లుగా నేతలు చెబుతున్నారు. ఇక కమ్మ, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు మిగతా పోస్టుల కోసం మూడు పార్టీల నుంచి భారీ పోటీ ఉందట. ఈ క్రమంలో మంగళగిరిలోనే టీడీపీ కేంద్ర కార్యాలయం చుట్టూ కొందరు నేతలు ప్రదక్షిణలు చేస్తూ సిఫార్సుల జాబితాలో తమ పేర్లు ఉన్నాయా, లేదా, పదవి దక్కుతుందా లేదా అని ఆరా తీస్తున్నారట. అయితే సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ పక్కా అని ప్రచారం జరుగుతోంది.
మొన్నటి ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు..ఎమ్మెల్యేలను గెలిపించేందుకు కష్టపడ్డ లీడర్లు..ఎమ్మెల్యేలుగా గెలిచినా మంత్రి పదవి రానివాళ్లు..ఇలా చాలామంది రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పోస్టుల రేసులో ఉన్నారు. ఇక అశోక్ గజపతి రాజు లాంటి పార్టీ సీనియర్ లీడర్‌ను ఇప్పటికే గోవా గవర్నర్‌గా పంపించారు. మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పదవి మార్చి నెలతో ముగిసిపోయింది. ఆయన మళ్లీ రెన్యూవల్ కోరుతున్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఆయనకు కూడా ఏదైనా క్యాబినెట్ ర్యాంకున్న నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని అంటున్నారు.
ఇక దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పిఠాపురం SVSN వర్మ లాంటి వారు కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు. మెజార్టీ నేతలు కీలక నామినేటెడ్ పదవులపైనే కన్నేయడంతో సెలక్షన్ కష్టమవుతోందట. ఏ ఒక్కరికి ఇచ్చినా మిగతా ఆశావహులు నిరాశ చెందుతున్నారని ఇన్నాళ్లు వెయిట్ చేస్తూ వస్తున్నారట. ఇప్పుడు ఏడాది పాలన అయిపోవడం..నేతల్లో నిరాశతో..త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని ఫిక్స్ అయ్యారట. సీఎం చంద్రబాబు హస్తిన పర్యటన ముగిశాక..క్యాబినెట్ పోస్టుల భర్తీపై ఫైనల్ డెసిషన్ రాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సారైనా పూర్తిస్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తారా..ఇంకా పిక్చర్ అబీ బాకీహై అని పెండింగ్‌లో పెడుతారా అనేది చూడాలి మరీ.