Vamsi Krishna Srinivas : వైసీపీకి వంశీ రాజీనామా? జనసేన వైపు ఎమ్మెల్సీ చూపు..!

వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వంశీ.. భీమిలి లేదా విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Vamsi Krishna Srinivas : వైసీపీకి వంశీ రాజీనామా? జనసేన వైపు ఎమ్మెల్సీ చూపు..!

YCP MLC Vamsi Krishna Srinivas Likely To Join Janasena

Updated On : December 26, 2023 / 10:37 PM IST

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ల అంశం వైసీపీలో చిచ్చు రాజేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన ఎమ్మెల్యేలలో కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. ఆ ఎమ్మెల్యేల అనుచరవర్గం సైతం రాజీనామాల బాట పడుతున్నారు. ఇప్పటికే కాకినాడ వైసీపీలో రాజీనామాల కలకలం రేగింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అనుచరులు పార్టీకి రిజైన్ చేసేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించేశారు కూడా.

ఇక, కాకినాడలోనే కాదు విశాఖలోనూ అదే సీన్ కనిపిస్తోంది. వైసీపీ నేతలు రాజీనామాల బాట పట్టారు. పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ వంశీ, ఆయన వర్గీయులు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే వంశీతో పాటు ఆయన వర్గం నేతలు వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా జనసేనలో చేరనున్నట్లు సమాచారం.

Also Read : వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గర అవుతున్నారా? జగన్ సోదరి వ్యూహం ఏంటి?

ఈ క్రమంలోనే వంశీ.. భీమిలి లేదా విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజీనామాల విషయం తెలుసుకున్న వైసీపీ నాయకత్వం అలర్ట్ అయ్యింది. వంశీ ఇంటికి వెళ్లిన పార్టీ నగర శాఖ అధ్యక్షుడు కోలా గురువులు ఆయనతో ఏకాంతంగా చర్చించారు. పార్టీ మారే యోచనలో ఉన్న వంశీని కోలా గురువులు బుజ్జగించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.

ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారతారు అనే ప్రచారం రెండు రోజులుగా జరుగుతోంది. వంశీ వైసీపీని వీడి జనసేనలో చేరతారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో విశాఖ సిటీ అధ్యక్షుడు కోలా గురువులు వంశీతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నేరుగా అధిష్టానంతో మాట్లాడిన తర్వాత ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని వంశీ యాదవ్ తో పాటు కోలా గురువులు చెప్పారు.

వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ సుదీర్ఘకాలం పాటు వైసీపీలో పని చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన వైసీపీలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో కచ్చితంగా టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే కొన్ని ఈక్వేషన్స్ కారణంగా పార్టీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. దాంతో వంశీ అనుచరులు పార్టీ కార్యాలయంపై దాడి కూడా చేశారు. ఆ సమయంలోనే వంశీని బుజ్జగించారు. జిల్లా అధ్యక్షుడిగా చేశారు.

Also Read : ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ బిగ్ షాక్..! పీకేను దూరం చేసిన నారా లోకేశ్

తర్వాత మేయర్ ఎన్నికల్లో మేయర్ పదవిని ఆశించారు వంశీ. మేయర్ వంశీనే అవుతారని ప్రచారం కూడా జరిగింది. అయితే, మరొకరికి మేయర్ పదవి ఇచ్చారు. ఏడాదిన్నర క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. పార్టీకి సుదీర్ఘకాలంగా పని చేస్తున్నా.. పార్టీ సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, తనను అవమానిస్తున్నారని వంశీ వాపోతున్నారట.

వైసీపీకి రాజీనామా చేసేందుకు వంశీ రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. రేపు(డిసెంబర్ 27) జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో వంశీ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు మంగళవారం కావడంతో రాజీనామా చేయడానికి మంచి రోజు కాదని వంశీ భావించారట. రేపు సాయంత్రంలోగా పవన్ తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు వంశీ వర్గీయులు నుంచి అందుతున్న సమాచారం. వంశీతో పాటు విశాఖ నగరానికి చెందిన కొందరు ముఖ్య నేతలు, కొంతమంది కార్పొరేటర్లు కూడా జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.