సైకోలా మారిన యువతి… అక్క కొడుకుని చంపి… రక్తం తాగి…..

Crime News: అల్లరి చేస్తున్న పిల్లవాడ్ని మందలించాల్సింది పోయి…. ఓ యువతి సైకోలా మారి, దారుణంగా హతమార్చింది. చాకుతో శరీర భాగాలను కోసి పేగులను మెడలో వేసుకుని రక్తం తాగటం చూసిన గ్రామస్తులు హడలిపోయారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
గ్రామంలోని ముప్పసాని సుబ్బారావు ఇంటి పై అంతస్తులో నాలుగు నెలల క్రితం షేక్ సలాం, ఆషా అనే దంపతులు అద్దెకు దిగారు. భర్త సమీపంలోని ఓ నూలుమిల్లులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి ఆబిద్, షమ్రి ఇద్దరు పిల్లలు. నరసరావుపేటలో ఉంటున్న ఆషా అక్క ఫాతిమా, ఫరిద్ బాషా దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో తన పిల్లలు కరిమున్, కరిముల్లా, ఖాజాతో కలిసి చెల్లెలి ఇంటికి వచ్చింది. ఆదివారం తెల్లవారు జామున ఫాతిమా, ఆమె తల్లి ఖాదర్‌బీ, చిన్న అల్లుడు సలాం కలిసి పనిమీద బాపట్లకు వెళ్లారు.
మధ్యాహ్నం సమయంలో పిల్లలు ఆడుకుంటున్నారు. అప్పడు అక్క కొడుకు కరిముల్లా అల్లరి చేశాడని ఆషా చీపురు కట్టతో పిల్లవాడ్ని కొట్టింది. అంతటితో ఆగక పట్టరాని కోపంతో వంటింట్లో నుంచి చాకు తీసుకొచ్చి బాలుడి చేతిని కోసింది. ఈ ఘటనతో భయపడిన కరిముల్లా కాపాడండి అంటూ పెద్దగా కేకలు వేశాడు.
అక్కడే ఆడుకుంటున్న కరిముల్లా సోదరి కరీమున్ ప్రాణభయంతో తనతోపాటు మిగిలిన ముగ్గురు పిల్లలను ఇంట్లోకి తీసుకు వెళ్లి తలుపు గడియ వేసేసింది. కేకలు విన్న ఇంటి యజమాని భార్య మెట్లెక్కి పైకి రావడాన్ని గమనించిన ఆషా.. చాకును చూపించి చంపేస్తానంటూ ఆమెను బెదిరించడంతో…. యజమానురాలు భయంతో కిందికి వచ్చి భర్తకు చెప్పింది. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈలోగా ఇరుగుపొరుగు వారిని పిలిచి ఘటనాస్థలికి వెళ్లేసరికి బాబు కరీముల్లా గొంతును కోసి హత్య చేసింది. గొంతు నుంచి పొత్తి కడుపు వరకు పూర్తిస్థాయిలో శరీరాన్ని కోసి పేగుల్ని బయటకు తీయడాన్ని చూసి జనంలో వణుకు మొదలైంది.
ఈలోగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆశా వద్ద ఉన్న చాకును అతి కష్టం మీద లాక్కుని ఆమెను ఇంటి బయటికి తీసుకు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
చిలకలూరిపేట రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై ఎ.భాస్కర్ ఆషా మానసిక పరిస్థితి బాగోలేదని గ్రహించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంటి గడియ తీసి లోపల కన్నీరు కారుస్తూ బిక్కుబిక్కుమంటూ భయాందోళనలో ఉన్న నలుగురు పిల్లలను సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తకు అప్పగించారు. బాలుడి మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జరిగిన ఘటన వివరాలు తెలుసుకున్న ఆషా తల్లిదండ్రులు, అక్క ఫాతిమా బంధుమిత్రులు చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. దారుణ పరిస్థితుల్లో మృతి చెందిన తన బిడ్డను చూసుకుని ఫాతిమా, ఆమె తల్లి ఖాదర్‌బీ దుఃఖానికి అంతేలేకుండా పోయింది. వారిద్దరి రోదనలు…. చూపరులను సైతం కంటతడి పెట్టించింది.
తన ప్రాణంతో పాటు మరో ముగ్గురి ప్రాణం నిలిపిన కరీమున్
ఫాతిమా సంతానంలో ముగ్గురిలో కరిముల్లా, కరిమున్ కవలలు. ఖాజా మూడో సంతానం. పిన్ని తన అన్న కరిముల్లాను చాకుతో చేతిపై కోయడాన్ని గమనించగానే తక్షణమే పరిస్థితిని అర్థం చేసుకున్న కరిమున్.. తనతో ఆడుకుంటున్న ముగ్గురి పిల్లలను ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు గడియ పెట్టి వారి ప్రాణాలను ఎంతో ధైర్యంగా కాపాడింది.
ఆషా కరిముల్లాను చంపిన తర్వాత కసితీరక తలుపులు గడియలు తీయాలని పలుమార్లు బాదినా భయపడకుండా గడియను కరిమున్ తీయలేదు. కరిమున్ ధైర్యం చూపి పిల్లలను కాపాడడాన్ని ఊరంతా మెచ్చుకుంటున్నారు.