YS Jagan: అందుకే నాలో చాలా మార్పు వచ్చింది: వైఎస్ జగన్
ప్రజలకు హామీలు ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తానని అన్నారు.

YS Jagan
వైసీపీ ప్లీనరీని వచ్చే ఏడాది బ్రహ్మాండంగా నిర్వహిద్దామని పార్టీ నేతలతో వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిలో ఇవాళ వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో జగన్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో మాట్లాడారు.
“ఏపీలోని ప్రస్తుత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుంది. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరినీ గొప్ప స్థానంలో కూర్చోబెడతాను.
ఈ సారి కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యం. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను. ప్రజలకు హామీలు ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తాను. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చింది.. కేడర్ ధైర్యంగా నిలబడింది. రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎక్కడకు వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారు.. రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు పరిపాలనపట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. రాజకీయాలతో సంబంధం లేనివారిని కూడా కక్షలకు గురిచేస్తున్నారు. బూత్ కమిటీలు పూర్తయ్చే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షల మంది ఉంటారు” అని జగన్ వ్యాఖ్యానించారు.