విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌ బై చెప్పినా ఆయనను వదిలిపెట్టని వైసీపీ

ఏదైనా విజయసాయిరెడ్డిని బద్నాం చేయాలనుకుంటే పార్టీనే ఇరకాటంలో పడుతుందన్న టాక్‌ వైసీపీలో కూడా వినిపిస్తోంది.

విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌ బై చెప్పినా ఆయనను వదిలిపెట్టని వైసీపీ

VijaySai Reddy

Updated On : May 27, 2025 / 8:43 PM IST

విజయసాయిరెడ్డి. వైసీపీలో కీలక నేత. ఓ రకంగా ఆ పార్టీలో నెంబర్‌ టు పొజిషన్‌ ఆయనదేనన్న ప్రచారం ఉండేది. ఏమైందో ఏమో తెలియదు కానీ..వైసీపీ ఓడిపోయాక జగన్‌తో ఇంకా గ్యాప్‌ పెరిగి..పార్టీని వీడటమే కాదు రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఏ పార్టీలోకి వెళ్లడం లేదని తేల్చిచెప్పారు.

అయినా వైసీపీ సోషల్‌ మీడియా విజయసాయిరెడ్డి టార్గెట్‌గా పోస్టులు పెట్టడం రచ్చకు దారి తీస్తోంది. సీఎం చంద్రబాబునాయుడుకు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న ఓ టీడీపీ నేతతో విజ‌య‌సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ అయ్యారంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది వైసీపీ. విజ‌య‌సాయిరెడ్డి టీడీపీతో కుమ్మక్కు అయ్యార‌నడానికి ఇదే సాక్ష్యమని వైసీపీ నుంచి పోస్టులు వెల్లువెత్తాయి.

వైసీపీ బయటపెట్టిన పోస్ట్‌కు విజయసాయి రివర్స్ కౌంటర్ స్టార్ట్ చేశారు. తనను రెచ్చగొడితే వైఎస్‌ జగన్‌కే నష్టమంటూ సంచలన ట్వీట్‌ చేసి వైసీపీకి ఇచ్చి పడేశారు. తాను మౌనంగా ఉండటం వైసీపీలో కోటరీకి సచ్చటం లేదంటూ కాస్త స్ట్రాంగ్ రియాక్షనే ఇచ్చారు. కోటరీనే తనకు వెన్నుపోటు పొడిచిందని..ఎవరో కోటరీ చేసిన నేరాలను తాను నెత్తి మీద వేసుకోవాలా లేకపోతే టీడీపీ మనిషి అయిపోతానా అని ప్రశ్నిస్తున్నారు.

Also Read: బుజ్జగింపులు ఫలించాయా? కవిత దిగివచ్చారా? లేదా కొత్త పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టారా?

అంతేకాదు తాను ఈ జన్మలో టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పా..కలవాలని అనుకుంటే చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి చర్చిస్తానంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే, ఆ స్కామ్‌ రహస్యాలు మాట్లాడటానికి తాను టీడీపీ నేతల్ని కలిశానని జగన్ కోటరీ అంటున్నారంటూ మండిపడ్డారు.

వైసీపీ సోషల్ మీడియా, క్యాడర్ అత్యుత్సాహం?
అయితే విజయసాయిరెడ్డి విషయంలో వైసీపీ సోషల్ మీడియా, క్యాడర్ అత్యుత్సాహం చూపిస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు విజయసాయిరెడ్డి జగన్‌ను ఎక్కడా డైరెక్టుగా కామెంట్‌ చేయడం లేదు. కోటరీ అంటూ మాత్రమే విమర్శలు చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా పోస్టులు ఇలాగే కొనసాగితే..టీడీపీతో కుమ్మక్కయ్యారని విమర్శించడం కంటిన్యూ చేస్తే విజయసాయిరెడ్డి డైరెక్టుగా జగన్‌ను టార్గెట్‌ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు.

విజయసాయిరెడ్డిని వైసీపీ ఎంత గెలకకపోతే ఆ పార్టీకి అంత మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా పోస్టులతో ఇరిటేట్‌ చేస్తే తాను స్ట్రాంగ్‌గానే స్పందిస్తానని విజయసాయిరెడ్డే చెప్తున్నారు. విజయసాయికి తమ పార్టీ సీక్రెట్స్‌ అన్నీ తెలుసని వైసీపీ భావిస్తుందో..లేక..ఆయన టీడీపీ మనిషని ఎక్స్‌పోజ్‌ చేయాలనుకుంటుందో తెలియదు కానీ..అత్యుత్సాహానికి పోయి పోస్టులు పెట్టి గెలికి మరీ ఆయనతో గోక్కుంటున్నారన్న చర్చ అయితే నడుస్తోంది.

సీఎం చంద్రబాబుకు లొంగిపోయిన విజయసాయిరెడ్డి..మూడేళ్లు రాజ్యసభ సీటును ప్రలోభాలకులోనై చంద్రబాబుకు అమ్మేశారని కామెంట్‌ చేశారు జగన్. అలాంటి వ్యక్తులు లిక్కర్‌ కేసులో ఇచ్చే స్టేట్మెంట్స్‌కు విలువ ఏముందంటూ వైసీపీ అధినేత చేసిన కామెంట్స్‌నే..ఆ పార్టీ సోషల్‌ మీడియాకు అస్త్త్రంగా మలుచుకుంటుందన్న చర్చ జరుగుతోంది.

ఏదైనా విజయసాయిరెడ్డిని బద్నాం చేయాలనుకుంటే పార్టీనే ఇరకాటంలో పడుతుందన్న టాక్‌ వైసీపీలో కూడా వినిపిస్తోంది. వైసీపీ నేతలెవరూ విజయసాయిరెడ్డి విషయంలో పెద్దగా స్పందించనిది కూడా అందుకేనంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనపై పోస్టులు పెట్టకుండా ఉంటే బెటర్‌ అని..లేకపోతే ఆయన టీడీపీకి అస్త్రంగా మారొచ్చన్న డౌట్స్‌ ఫ్యాన్ పార్టీలో వినిపిస్తున్నాయి.