బుజ్జగింపులు ఫలించాయా? కవిత దిగివచ్చారా? లేదా కొత్త పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టారా?

కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా టీబీజీకేఎస్‌తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామని ఆమె ప్రకటించడం కొసమెరుపు.

బుజ్జగింపులు ఫలించాయా? కవిత దిగివచ్చారా? లేదా కొత్త పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టారా?

Updated On : May 27, 2025 / 8:32 PM IST

ఒకే ఒక్క లెటర్..ఆ తర్వాత..మీడియా ముందు స్టేట్‌మెంట్స్‌. కవిత ఎపిసోడ్‌ అటు బీఆర్ఎస్‌లో ఇటు తెలంగాణ రాజకీయాల్లో టాక్‌ ఆఫ్‌ది పాలిటిక్స్‌గా మారింది. ఇదే టైమ్‌లో కవిత..బీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్నారని..కేటీఆర్‌, హరీశ్‌, సంతోష్‌తో ఆమెకు గ్యాప్‌ ఉందన్న టాక్ బలంగా వినిపించింది. అంతేకాదు ఆమె కారు దిగి సొంత కుంపటి పెట్టుకుంటారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పటికీ ఆ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ ఇంతలోనే కవిత చిన్న ట్విస్ట్ చేశారు.

బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఫార్ములా ఈకార్‌ రేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ట్వీట్‌ చేసి మరోసారి చర్చకు దారి తీశారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా కేటీఆర్‌కు నోటీసులిచ్చిందన్నారు. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు కవిత. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదంటూ ఫైనల్‌ టచ్‌ ఇచ్చారామె.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ యాజమాన్యంపై హెచ్‌సీఏ ఒత్తిడి తెచ్చి, తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది: విజిలెన్స్ నివేదిక

కవిత బీఆర్ఎస్‌ను వీడుతారని ప్రచార జరుగుతున్న నేపథ్యంలో..ఆమె కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండించడం హాట్ టాపిక్‌ అవుతుంది. ఇంతకీ బీఆర్ఎస్‌లో ఏం జరుగుతుందన్న దానిపై ఆసక్తిరేపుతోంది. అయితే కవిత లెటర్‌ ఇష్యూపై కేసీఆర్, కేటీఆర్ ఫాంహౌస్‌లో రెండున్నగంటల పాటు చర్చించినట్లు వార్తలు వచ్చాయి.

అదే సందర్భంలో కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లాల్సిన కవిత అర్ధాంతరంగా ఆగిపోయారు. కేటీఆర్, కేసీఆర్ మీటింగ్ తర్వాత ఆమె తన కాళేశ్వరం పర్యటనను క్యాన్సల్ చేసుకోవడం చర్చనీయాంశం అయింది. అయితే కేసీఆర్ సూచనతోనే ఆమె తన టూర్‌ రద్దు చేసుకున్నారా లేక మీడియా ముందుకు మరోసారి రావడం ఇష్టం లేక ఆమెనే ఆగిపోయారా అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.

కవితతో చర్చలు
మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ దామోదర్‌రావు, న్యాయవాది గండ్ర మోహన్ రావు మంగళవారం కవితతో భేటీ అయ్యారు. రెండు గంటలకు పైగా ఆమెతో చర్చించారు. అయితే వారిద్దరూ కవితతో ఉన్న సాన్నిహిత్యంతోనే ఆమెను కలిశారు తప్ప..కేసీఆర్, కేటీఆర్‌ల ప్రమేయం ఈ భేటీలో ఏమీ లేదని తెలుస్తోంది. అయితే కవితతో జరిపిన చర్చల సారాంశాన్ని, ఆమె మనోగతాన్ని మాత్రం ఆ తర్వాత గులాబీబాస్‌కు వారు చేరవేశారని అంటున్నారు. అయితే కేసీఆర్‌ మాత్రం కవిత అంశంపై ఏ మాత్రం తగ్గడం లేదని..ముఖ్యంగా లేఖ ఎలా లీక్‌ అయిందన్నది గుర్తించే పనిలో ఉన్నారని చర్చ జరుగుతోంది.

అయితే తాను పార్టీలో ఎదర్కొన్న ఇబ్బందులు, అవమానాలను కవిత దూతల ముందు ఏకరువు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే కొందరి వైఖరి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారట. అంతే కాకుండా తన తండ్రి కేసీఆర్‌ను కలిసి మిగతా విషయాలు మాట్లాడతానని కవిత చెప్పినట్లు సమాచారం.

కేసీఆర్‌ సమయం ఇస్తే పార్టీలో తన పాత్ర, పదవి, తన వర్గానికి పార్టీ పదవులు వంటి డిమాండ్స్‌ను కేసీఆర్ ముందు ఉంచాలన్న ఆలోచనలో కవిత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్‌ మాత్రం ఇప్పట్లో కవితను కలిసేదే లేదని, ఆమెతో మాట్లాడేదే లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఓ వైపు ఇదంతా జరుగుతుండగానే..సింగరేణిలో కవిత తన సంఘాన్ని ఏర్పాటు చేయడం చర్చకు దారితీస్తోంది. సింగరేణి జాగృతి అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఎమ్మెల్సీ కవిత నిర్ణయం తీసుకున్నారు.

పైగా కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా టీబీజీకేఎస్‌తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామని ఆమె ప్రకటించడం కొసమెరుపు. మరోవైపు కవిత అనుచరులు మాత్రం..తెలంగాణ ఆవిర్భావం అయిన జూన్‌ 2నే అక్క పార్టీ పెట్టడం ఖాయమని..పార్టీ పేరు TBRSఅని… పూర్తి పేరు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ప్రచారం చేస్తుండటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కవిత ఎపిసోడ్‌ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.