70ఏళ్ల వయస్సులో.. సీఎం స్థానంలో ఉన్నవ్యక్తి ఆ మాటలేంటి.. ఆ బెదిరింపులేంటి..? : కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్ను భూస్థాపితం చేస్తా అంటున్నారు.. 70ఏళ్ల వయసులో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాటలేంటి..?

70ఏళ్ల వయస్సులో.. సీఎం స్థానంలో ఉన్నవ్యక్తి ఆ మాటలేంటి.. ఆ బెదిరింపులేంటి..? : కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్

YS Jagan

Updated On : June 19, 2025 / 1:21 PM IST

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్ను భూస్థాపితం చేస్తా అంటున్నారు.. 70ఏళ్ల వయసులో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాటలేంటి..? మీరు చేసిన మోసాలను ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా..? ఆ బెదిరింపులేంటి..? ప్రశ్నిస్తే అరెస్టులు.. బెదిరింపులు. రాష్ట్రంలో జరుగుతుంది ఇదే.. అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు దిగజారిపోయాయి. మోసాలతో చంద్రబాబు పాలన సాగుతుందని జ‌గ‌న్ అన్నారు. వెన్నుపోటు దినం నిరసనలకు ప్రజల్లో విశేష స్పందన వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వానికి ఏడాదిలోనే ప్రజల మనసుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు మాటల్లో అసహనం కనిపిస్తుంది. పల్నాడులో నా పర్యటన కర్ఫ్యూ పరిస్థితుల మధ్య జరిగింది. చనిపోయిన మా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం తప్పా..? ఎందుకు నా పర్యటనకు ఆంక్షలు పెట్టారు..? వచ్చినవాళ్ళని ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యకర్తలు, ప్రజల నుండి విశేష స్పందన వచ్చింద‌ని జ‌గ‌న్ అన్నారు.

చంద్రబాబు నన్ను భూస్థాపితం చేస్తా అంటున్నారు. 70 ఏళ్ల వయసులో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాటలేంటి..? మీరు చేసిన మోసాలను ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా.. ఆ బెదిరింపులేంటి..? ప్రశ్నిస్తే అరెస్టులు.. బెదిరింపులు రాష్ట్రంలో ఇదే జరుగుతుందని జగన్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టార్గెట్ చేసి చెవిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ఏడాదిగా ఈ లిక్కర్ కేసులో చెవిరెడ్డి పేరు ఎక్కడైనా బయటికి వచ్చిందా..? గన్‌మ్యాన్‌ను చితకొట్టి తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారు. నన్ను చిత్రహింసలకు గురిచేశారని దెబ్బలతో ఉన్న వీడియోతో కానిస్టేబుల్ డీజీపీ, రాష్ట్రపతిలకు ఫిర్యాదు చేశారు. ఎవరినైనా ఏ కేసులో అయినా ఇరికించేయొచ్చు అనేలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సామాన్యుల నుండి కార్యకర్తలు, నేతలను అందరిని దుర్మార్గంగా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి సంప్రదాయాలను భవిష్యత్ రోజులకు అలవాటు చేస్తున్నారా..? నక్షలిజం అనేది ఇలాంటి చర్యల వల్లే పుడుతుంది. రాష్ట్రాన్ని బీహార్ చెయ్యడంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుకన్నా గొప్పగా ఎవరు చెయ్యలేరు అంటూ జ‌గ‌న్ విమ‌ర్శించారు.

ఇప్పటికే చాలా మందిని అన్యాయంగా అరెస్టులు చేసి జైలులో పెట్టారు. మిగిలిన చాలా మందిని ఎప్పుడెప్పుడు అరెస్టు చెయ్యాలా అని వెంటపడుతున్నారు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, ఆర్కే, అంబటి రాంబాబు, విడదల రజిని, దాడిశెట్టి రాజా ఇలా అందరినీ అరెస్టు చెయ్యడానికి వేధిస్తున్నారు. చిన్నచిన్న వ్యక్తులను కొట్టి తప్పుడు స్టేట్మెంట్లు తీసుకొని పెద్దవాళ్లని అరెస్టు చెయ్యడం ఇదే ప్రక్రియ అందరికీ ఫాలో అవుతున్నారని కూటమి ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తల్లికి వందనం పేరిట తల్లులను వంచన చేశారు ..
సూపర్ సిక్స్ అమలు చేసేశాను అని చంద్రబాబు చెప్తున్నారు.. ఎక్కడ చేసేశారు చూపించండి..? అంటూ జగన్ ప్రశ్నించారు. ఎవరైనా సూపర్ సిక్స్ అడిగితే వారి నాలుక మందం అని బెదిరిస్తున్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు, 50 ఏళ్ళకు పెన్షన్, అన్నదాత సుఖీభవ ఇవన్నీ సూపర్ సిక్స్‌లో హామీలు కాదా..? అత్యంత సులువైన ఉచిత బస్సు, దీపం అమలు చెయ్యడం లేదు. పండగలు వస్తున్నాయి.. వెళ్తున్నాయి. వాయిదాలు పడుతూనే ఉన్నాయి.. పథకాలు మాత్రం రావడం లేదని జగన్ అన్నారు. ఏడాది దాటేసింది ఇంకెప్పుడు అమలు చేస్తారు..? అడిగితే నాలుక మందం అంటారా..?

తల్లికి వందనం పేరిట తల్లులను వంచన చేశారు. రాష్ట్రంలో 87 లక్షల మంది పిల్లలకు 13111 కోట్లు ఇవ్వాలి. కానీ, ఇస్తాను అంటున్నది 8700 కోట్లు. 87లక్షల మంది పిల్లలు ఉంటే 54లక్షల మందికి మాత్రమే ఇస్తాను అంటున్నారు.. 30లక్షల మందికి తల్లికి వందనం పథకంలో కోత పెట్టేశారు.. ఇది పచ్చిమోసం కాదా..? అంటూ జగన్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.