ఏపీ పాలిటిక్స్‌లో విచిత్రాలు: కొత్త ట్రెండ్.. పార్టీల్లో పోటాపోటీ!

  • Published By: sreehari ,Published On : December 30, 2019 / 12:40 PM IST
ఏపీ పాలిటిక్స్‌లో విచిత్రాలు: కొత్త ట్రెండ్.. పార్టీల్లో పోటాపోటీ!

Updated On : December 30, 2019 / 12:40 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎక్కడా లేని విచిత్రాలు జరుగుతున్నాయని జనాలు అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఒక విధానాన్ని అవలంబిస్తూ వచ్చింది. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల టైమ్‌లో అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి ఎవరో ఒక ఎమ్మెల్యేను తమ పార్టీలోకి లాక్కోవడం.. వారితోనే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్‌పై విరుచుకుపడేలా చేయడం.. ఇదీ అప్పట్లో టీడీపీ అనుసరించిన విధానం.

ఇప్పుడు వైసీపీ కూడా అదే ఫాలో అయ్యేలా ప్లాన్‌ చేసుకుందని జనాలు అంటున్నారు. తెలుగుదేశం నుంచి ఈ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే కొంత మందిని లాక్కొని, వారితోనే చంద్రబాబు అండ్‌ కోపై మాటల దాడి చేయాలని భావిస్తోందంట. సో వైసీపీ కూడా టీడీపీ అనుసరించిన దారినే ఫాలో అవుతుందని జనాలు అనుకుంటున్నారు.

కొత్త ట్రెండ్ మొదలైంది :
ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. కొత్త ట్రెండ్‌ మొదలైందని అంటున్నారు ఏపీ జనాలు. ప్రతిపక్ష టీడీపీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలనుకుంటే.. వారి కంటే ముందో… లేకపోతే అదే రోజున సేమ్‌ ప్రొగ్రామ్‌ను వైసీపీ కూడా చేపడుతోందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన అనేక అంశాలను చూస్తే.. జనాలు అనుకుంటున్నదీ నిజమే అనిపిస్తోంది.

చలో ఆత్మకూరు  నుంచి మొదలుపెడితే.. రాజధాని ఇష్యూ వరకూ.. అన్నింటా వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ వాతావరణమే కనిపిస్తోందని అనుకుంటున్నారు. అధికార పక్షం ఒక ఇష్యూ మీద జనం దగ్గరకు వెళ్తే.. ఆ వెంటనే టీడీపీ కూడా అదే ఫాలో అయిపోతుంది. లేదా.. టీడీపీ ముందు ఒక ఇష్యూ మీద ముందుకెళ్తే.. వైసీపీ కూడా అదే పని చేస్తుంది. ఇదంతా చూస్తున్న జనాలు.. ఈ రెండు పార్టీలకు ఏమైందబ్బా అనుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తున్నదని, దాడులు చేస్తోందని చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఆ పార్టీ చేపట్టింది. గ్రామంలో బాధితుల కోసం శిబిరాలను ఏర్పాటు చేసింది. అయితే, దీనికి పోటీగా.. టీడీపీ వాళ్లే తమ కార్యకర్తలపై దాడులు చేశారని వైసీపీ కూడా శిబిరాలను ఏర్పాటు చేసి నానా రచ్చ చేసింది. అధికారంలో ఉన్న పార్టీ కాస్త.. ప్రతిపక్ష పార్టీని ఫాలో అవ్వడం ఏంటోనని అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఒకవేళ టీడీపీ వాళ్లే దాడులు చేసి ఉంటే దాని మీద విచారణ జరిపించే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది కదా అని జనాలు ఆశ్చర్యపోయారు. 

డీజీపీని కలిసేందుకు పోటీ :
మరో సందర్భంలో ఇరు పార్టీలు దాడుల విషయంలో ఒక దానిపై ఒకటి డీజీపీకి కంప్లయింట్లు ఇచ్చుకోవడంలో పోటీ పడ్డాయి. డీజీపీని కలవబోతున్నామంటూ ముందే టీడీపీ ఒక ప్రకటన చేసింది. అయితే, వారి కంటే ముందే అప్పటికప్పుడే వైసీపీ నేతలు డీజీపీని కలిసి వచ్చారు. కాకపోతే వారితో పాటు ఎలాంటి నోట్‌ తీసుకెళ్లలేదు. అది ప్రిపేర్‌ చేసుకోవడానికి టైమ్‌ లేకపోవడంతో పాటు టీడీపీ కంటే ముందే వెళ్లాలనే కారణంతోనే కంప్లయింట్‌ను లిఖితపూర్వకంగా ఇవ్వలేకపోయారంట. ఆ తర్వాత అధికార పక్ష నేతలు తమ పార్టీ వారిపై దాడులు చేస్తున్నారంటూ డీజీపీ వద్ద టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. ఈ విషయంలో జనం ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం చేయలేకపోయారు. 

ఇప్పుడు లేటెస్టుగా రాజధాని విషయంలోనూ జరిగింది. రాజధాని భూములు, నిర్మాణాలు లాంటి విషయంలో టీడీపీ, వైసీపీలు పోటాపోటీ మీటింగులు పెట్టేశాయి. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించేశాయి. రాజధాని మీద డిస్కస్‌ చేయడానికి అఖిల పక్ష మీటింగ్‌ పెడుతున్నామని వైసీపీ చెప్పింది. అయితే.. దానికి వైసీపీ నేతలు, అసైన్డ్‌ భూముల వాళ్లు తప్ప మిగిలిన పార్టీల నుంచి ఎవరూ రాలేదంటున్నారు.

ఇక అదే రోజు తెలుగుదేశం పార్టీ కూడా రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఒకటి పెట్టింది. కాకపోతే దీనికి అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు హాజరవ్వడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్లు హ్యాపీ ఫీలయ్యారట. మొత్తమ్మీద ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఈ పోటాపోటీ కార్యక్రమాలను చూసి ఇదేంది సామీ అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.