16 నెలలు జైల్లో పెట్టినా జగన్ తగ్గలేదు, ఎన్నికల్లో ఓడిపోతే తగ్గుతాడా..?: పేర్నినాని

ప్యాలెస్ ప్యాలెస్ అంటున్న మంత్రి లోకేశ్ హైదరాబాద్ లో తన ఇంటి వీడియోలు చూపించగలడా..? జగన్ ఇంటిని, మీ ఇంటిని మీడియాకు చూపిద్దాం.. లోకేశ్ కు ఆ ఖలేజా ఉందా..?

16 నెలలు జైల్లో పెట్టినా జగన్ తగ్గలేదు, ఎన్నికల్లో ఓడిపోతే తగ్గుతాడా..?: పేర్నినాని

Perni Nani Slams Lokesh (Photo Credit : Google)

Perni Nani : టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి పేర్నినాని. మాజీ సీఎం జగన్ నివాసాలు, సెక్యూరిటీ గురించి టీడీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కోసం 986 మందితో భద్రత అని, రూ.250 కోట్లు ఖర్చు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎదురు దాడికి దిగారు పేర్నినాని. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 196 మంది భద్రతా సిబ్బంది మాత్రమే ఉండేవారని తెలిపారు. సెక్యూరిటీ ఆడిట్ జరగకుండానే జగన్ కు భద్రత తొలగించారని, ఇంటి ముందు చెక్ పోస్టులు ఎత్తేశారని ధ్వజమెత్తారు.

హైదరాబాద్ లో తన ఇంటి వీడియోలు లోకేశ్ చూపించగలడా?
‘ప్యాలెస్ ప్యాలెస్ అంటున్న మంత్రి లోకేశ్ హైదరాబాద్ లో తన ఇంటి వీడియోలు చూపించగలడా..? జగన్ ఇంటిని, మీ ఇంటిని మీడియాకు చూపిద్దాం.. లోకేశ్ కు ఆ ఖలేజా ఉందా..? ఇద్దరి ఇళ్ళల్లో సిట్టింగ్ జడ్జితో ఆడిటింగ్ చేయిద్దాం.. సిద్ధమా..? జగన్ ది ప్యాలెస్ అయితే మీది రాజమహల్. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఫర్నీచర్.. మీ కరకట్ట ఇంట్లో ఫర్నీచర్ లెక్కగట్టు. ప్రజాధనంతో కరకట్ట ఇంటికి హంగులు, హెలిప్యాడ్ కట్టలేదా..? సీఎంగా ఉన్న వ్యక్తి ఇల్లు, క్యాంప్ ఆఫీసులకు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఫర్నీచర్ కి లెక్క కడితే డబ్బు కడతాం. ఫర్నీచర్ కావాలంటే పట్టుకుని వెళ్ళండి. ఏదీ తేల్చకుండా కావాలనే పెండింగ్ పెట్టి విష ప్రచారం చేస్తున్నారు.

మావి ప్యాలెస్ లు అయితే, మీవి రేకుల షెడ్డులా?
2016లో జీవో నెంబర్ 340 తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. ఈ జీవో ప్రకారం అసెంబ్లీ సీట్లను బట్టి పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయింపు చేశారు. ఏడాదికి వెయ్యి చొప్పున 33 ఏళ్ల లీజుకు ఇవ్వడానికి జీవో ఇచ్చారు. ఈ జీవో ప్రకారం 10 చోట్ల టీడీపీ కార్యాలయాలకు భూములు కేటాయించుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి 99 ఏళ్లు లీజుకు తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ ను పార్టీ ఆఫీస్ కోసం తీసుకుని ట్రస్ట్ కు మార్చేశారు. మా పార్టీ ఆఫీసులు ప్యాలెస్ లు అయితే.. టీడీపీ ఆఫీసులు రేకుల షెడ్డులా..? మీ పార్టీ ఆఫీసులకు ప్లాన్ లు ఉన్నాయా? కొలతలు వేద్దామా..?

జగన్ దమ్మున్న నాయకుడు..
మంగళగిరిలోని పార్టీ ఆఫీస్.. చెరువులు కబ్జా చేసి కట్టారు. అది రేకుల షెడ్డా…? ఆరేళ్ల తర్వాత జగన్ బెంగుళూరు వెళ్లారు. కాంగ్రెస్ లో విలీనం అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. 16 నెలలు జైల్లో పెట్టినా జగన్ తగ్గలేదు. ఎన్నికల్లో ఓడిపోతే తగ్గుతాడా..? జగన్ ఒకరికి భయపడే వ్యక్తి కాదు. దమ్మున్న నాయకుడు. మళ్ళీ గెలిచే వరకూ తాడేపల్లి నుండే జగన్ పోరాడతాడు. పార్టీ నడుపుతాడు. దేశవ్యాప్తంగా పెద్ద పార్టీల్లో 5వ స్థానంలో వైసీపీ ఉంది. టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీ వైసీపీ. మా పార్టీ ఆఫీసులు, మీ పార్టీ ఆఫీసుల కేటాయింపులపై లీగల్ టీమ్స్ తో బహిరంగ చర్చకు సిద్ధమా..?

2019లో తమ్మినేని ఎన్నిక సమయంలో టీడీపీ వాకౌట్ చేసింది మర్చిపోయారా..? చంద్రబాబు మర్యాదగా తమ్మినేనిని స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టారా..? మా నాయకుడి చావు కోరుకునే వ్యక్తిని స్పీకర్ గా పెట్టడం మాకు నచ్చలేదు. అందుకే వెళ్ళలేదు. పసుపు చొక్కా నాకు కొత్త కాదు. జగన్ ముందే అనేక సార్లు పసుపు చొక్కా వేసుకున్నా. పసుపు చొక్కా వేసుకునే అనేకసార్లు చంద్రబాబు, టీడీపీని విమర్శించా. పసుపు రంగు ఏమైనా టీడీపీకి పేటెంటా? బందర్ లో తప్ప ఇంకెక్కడా నాకు, నా కుటుంబ సభ్యులకు కానీ ఒక్క ఇల్లు లేదు” అని పేర్నినాని చెప్పారు.

Also Read : బొత్స కుటుంబం ఇక ఇంటికే పరిమితమా? ఘోర ఓటమికి ప్రధాన కారణం అదేనా?