Andhra Pradesh Politics : వైసీపీలో మార్పులు, టీడీపీలో చేరికలు.. ఏపీలో వేడెక్కిన రాజకీయం
మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని సీఎం జగన్ తమ పార్టీ లీడర్లను అప్రమత్తం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది.

Andhra Pradesh Politics
ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్ష నేతలు అలర్ట్ అయ్యారు. ఎన్నికలకు కొద్దిరోజులే సమయం ఉండటం, ఇటు అధికార పార్టీలో పెద్దఎత్తున ప్రక్షాళన చేపట్టడం, టీడీపీలో చేరికలకు గేట్లు ఓపెన్ చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. చలిని పటాపంచలు చేసేలా లీడర్ల మధ్య డైలాగ్ వార్ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని సీఎం జగన్ తమ పార్టీ లీడర్లను అప్రమత్తం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎన్నికలు నెల రోజుల ముందుగానే జరగుతాయనే సమాచారంతో కొద్దిరోజుల నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన సీఎం జగన్.. క్యాబినెట్ భేటీ నిర్వహించి పెండింగ్ లో ఉన్న పథకాలకు లైన్ క్లియర్ చేస్తున్నారు.
Also Read : సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీలో భారీ మార్పులు
ముఖ్యంగా వృద్ధులు, వితంతువుల పెన్షన్ 3వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలా పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పట్టాలు ఎక్కించేలా అధికార పార్టీ ఓవైపు చకచకా నిర్ణయాలు తీసుకుంటూ ఉండగా.. ప్రతిపక్షం కూడా యుద్ధానికి సిద్ధం అంటూ సమరనినాదాలు చేస్తోంది.
పార్టీలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. జనవరిలో టీడీపీ సైకిల్ స్పీడ్ పెంచుతుందని, ఫిబ్రవరిలో రికార్డులు బద్దలు కొడతామని రణ నినాదాలు చేస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా వైసీపీ నుంచి 75మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని టీడీపీ నేత బోండా ఉమ చేసిన కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి.
ఇక టీడీపీ కామెంట్లకు కౌంటర్ గా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ పనైపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి సున్నా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు సజ్జల.
సజ్జల ఒక్కరే కాకుండా టీడీపీపై ముప్పుట దాడికి దిగింది వైసీపీ. మంత్రులు అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజుతో పాటు మాజీమంత్రి పేర్నినాని తదితరులు టీడీపీ టార్గెట్ గా వాగ్భాణాలు సంధించారు. ఇటు టీడీపీ, అటు వైసీపీ మాటల యుద్ధానికి దిగడంతో రాష్ట్రంలో రాజకీయం గరంగరంగా మారిపోయింది.
Also Read : ఏపీ రాజకీయాల్లో సంచలనం..! టీడీపీతో టచ్‌లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!
ఉరుము లేని మెరుపులా ఎన్నికల తుపాను కమ్మేయడంతో నేతల్లో ఒక్కసారిగా హడావిడి పెరిగిపోయింది. పార్టీలో సంస్కరణలతో వైసీపీలో ఎవరికి సీటు దొరుకుతుందో? లేదో? అన్న టెన్షన్ తో ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగా.. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లు వైసీపీ నుంచి వచ్చే నేతలు ఎక్కడ తమ టికెట్లు తన్నుకుపోతారో అనే ఆందోళనలో టీడీపీ నేతలు ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే రెండు పార్టీల్లోనూ టికెట్లపై నమ్మకం లేకపోవడం, ఎవరు ఎప్పుడు ఎటువైపు జంప్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.