Ap Elections 2024 : ఏపీలో రీ పోలింగ్‌పై సీఈవో ముకేశ్ కుమార్ మీనా కీలక ప్రకటన
మాచర్ల పరిధిలో 8 ఈవీఎం మెషీన్లని ధ్వంసం చేశారు. కానీ డేటా ఎక్కడికీ పోలేదు. పోలింగ్ కు కొద్దిసేపు అంతరాయం కలిగింది.

Ap Elections 2024 : ఏపీలో రీ పోలింగ్ కు సంబంధించి సీఈవో ముకేశ్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎక్కడా రీ-పోలింగ్ అవసరం లేదని భావిస్తున్నాం అన్నారు. 17A స్క్రూటినీ తర్వాతే రీ-పోలింగ్ విషయంలో నిర్దారిస్తామన్న సీఈవో ముకేశ్ కుమార్ మీనా.. రీ-పోలింగ్ కోసం ఎలాంటి రిక్వెస్టులు రాలేదని వెల్లడించారు.
ఏపీలో పోలింగ్ కు సంబంధించిన వివరాలను సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఇంకా 3వేల 500 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతోందని తెలిపారు. ప్రతి చోట 100 నుంచి 200 మంది ఓటర్లు క్యూలైన్ లో ఉన్నారని వెల్లడించారు. రాత్రి 10 గంటల కల్లా అన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. పోలింగ్ శాతం బాగా పెరిగిందని నమ్ముతున్నాం అన్నారు. గత ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.
”నేనిప్పుడే పోలింగ్ శాతం చెప్పలేను. ఎక్కడా రీ-పోలింగ్ అవసరం లేదని భావిస్తున్నాం. 17A స్క్రూటినీ తర్వాతే రీ-పోలింగ్ విషయంలో నిర్దారిస్తాం. రీ-పోలింగ్ కోసం ఎలాంటి రిక్వెస్టులు రాలేదు. తెనాలి, నరసరావుపేట ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశాం. ఈవీఎం యూనిట్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నాం. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారు. ఈవీఎం మెషీన్లతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సాంకేతిక ఇబ్బందులు గతంతో పోల్చుకుంటే తక్కువగా ఉన్నాయి. పోలింగ్ కు వాతావరణం బాగా సహకరించింది.
నా దగ్గర కార్డు ఉంది. కానీ.. ఓటు లేదనే ఫిర్యాదులు ఎక్కడా కన్పించ లేదు. బందోబస్తు పెద్ద ఎత్తున పెట్టాం. పల్నాడు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో అదనపు బలగాలు మోహరించాయి. పీలేరులో ఏజెంట్ల కిడ్నాప్ ఘటన జరిగినా.. వెంటనే సమస్య పరిష్కరించాం. పల్నాడులో 12 ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. మాచర్ల పరిధిలో 8 ఈవీఎం మెషీన్లని ధ్వంసం చేశారు. కానీ డేటా ఎక్కడికీ పోలేదు. పోలింగ్ కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఆ తర్వాత పోలింగ్ ప్రారంభించాం.
11 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగింది. హింసాత్మక ఘటనలు జరిగినా.. మెషీన్ల డామేజ్ జరిగినా పోలింగ్ నిర్వహించగలిగాం. ఎక్కడా రీ-పోలింగ్ అవసరం లేదు. తెనాలి, అనంతపురంలలో లీడర్లను హౌస్ అరెస్ట్ చేశాం” అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
Also Read : ప్రజలు జగన్‌ను మరోసారి దీవిస్తారు, అందుకు ఇదే నిదర్శనం- కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు