ఏపీలో అక్కడ పోలింగ్ సా.4 గంటల వరకే, పోలింగ్ కేంద్రాల్లో వాటికి అనుమతి లేదు- సీఈవో మీనా

సైలెన్స్ పీరియడ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటి నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలి.

ఏపీలో అక్కడ పోలింగ్ సా.4 గంటల వరకే, పోలింగ్ కేంద్రాల్లో వాటికి అనుమతి లేదు- సీఈవో మీనా

Ap Ceo Mukesh Kumar Meena (Photo Credit : Google)

Updated On : May 11, 2024 / 8:50 PM IST

Ceo Mukesh Kumar Meena : ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై వివరాలను సీఈవో ముకేశ్ కుమార్ వెల్లడించారు. ఎల్లుండి (మే 13) ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకే పోలింగ్ ఉంటుందన్నారు. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరుగుతుందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. సైలెన్స్ పీరియడ్ లో రాజకీయ ప్రచారం పూర్తిగా నిలిచిపోతుందన్నారు.

”సైలెన్స్ పీరియడ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటి నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలి. రేపు ఉదయం నుంచి సాయంత్రం లోగా EVM మెషిన్లు పోలింగ్ కేంద్రాలకు చేరతాయి. ఉదయం 7 లోపు మాక్ పోలింగ్ పూర్తి చేసి పోలింగ్ ప్రారంభించాలి. పోలింగ్ స్టేషన్ లో ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే ఉండాలి. పోలింగ్ స్టేషన్ కు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయకూడదు. జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్ చేయకూడదు. 10,30,000 మంది యువ ఓటర్లు ఉన్నారు.

పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లకు అనుమతి లేదు. ఇప్పటివరకూ 269.28 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర ఆభరణాలు సీజ్ చేశాం. సివిల్ పోలీసులు 58,948 మంది విధుల్లో ఉంటారు. APSP, కేంద్ర బలగాలు కలిపి మొత్తం 28,588 మంది విధుల్లో ఉన్నారు. NCC, NSS, Ex సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీసులు 18,609 మంది ఉన్నారు. మొత్తంగా 1,06,145 మంది పోలీసులు, ఇతరులు ఉన్నారు. మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్ లలో 12,438 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉంటుంది” అని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

ఏపీలో పోలింగ్ టైమింగ్స్ ఇవే..
* ఏపీలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
జరగనుంది.
* మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్.
* పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్.
* ఆ సమయంలోగా క్యూలైన్ లో నిల్చున్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం.

ఏపీ ఎన్నికలు.. స్థానాలు ఎన్ని? బరిలో ఉన్నది ఎంతమంది?
* ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
* అత్యధికంగా విశాఖ పార్లమెంట్ స్థానంలో 33మంది పోటీలో ఉన్నారు.
* అత్యల్పంగా రాజమండ్రి లోక్ సభ స్థానంలో 12మంది పోటీ.
* 175 అసెంబ్లీ స్థానాలకు 2వేల 387 మంది పోటీ.
* అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో 46 మంది బరిలో ఉన్నారు.
* అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు పోటీ.
* మొత్తం ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు

 

Also Read : వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తా..!- పిఠాపురంలో సీఎం జగన్ కీలక ప్రకటన