Vizianagaram Race Gurralu : టీడీపీ కొత్త ప్రయోగం ఫలిస్తుందా? సెంటిమెంట్‌‌ను వైసీపీ బ్రేక్‌ చేస్తుందా? విజయనగరంలో విజయతిలకం ఎవరికి?

మొత్తానికి విజయనగరంలో ఇద్దరు బీసీ నేతల మధ్య బిగ్‌ఫైట్‌ జరిగేలా కనిపిస్తోంది. మరి ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు ఎలాంటి రికార్డు సృష్టిస్తారో చూడాలి.

Vizianagaram Race Gurralu : టీడీపీ కొత్త ప్రయోగం ఫలిస్తుందా? సెంటిమెంట్‌‌ను వైసీపీ బ్రేక్‌ చేస్తుందా? విజయనగరంలో విజయతిలకం ఎవరికి?

Vizianagaram Race Gurralu

Vizianagaram Race Gurralu : ఆ లోక్‌సభ స్థానానిదో చరిత్ర. బడా నేతల పురిటగడ్డ అయిన ఆ నియోజకవర్గంలో ఎవరైనా ఒక్కసారితో సరిపెట్టుకోవాల్సిందే. కాకలు తీరిన నేతలు కూడా రెండోసారి చాన్స్‌ దొరక్క రాజకీయంగా విరామం తీసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి చోట ఈ సారి ఆసక్తికర ఫైట్‌ జరుగుతోంది. సిట్టింగ్‌ ఎంపీపై ఓ సాధారణ లీడర్‌ను పోటీకి పెట్టి టీడీపీ కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. టీడీపీ ప్రయోగం ఫలిస్తుందా? వైసీపీకి సేఫ్‌ అవుతుందా? విజయనగరం పార్లమెంట్‌లో పోటీ ఎలా?

ఒకసారి ఎంపీగా గెలిచిన వారికి రెండోసారి నోచాన్స్‌!
ఉత్తరాంధ్రలోని కీలక నియోజకవర్గం విజయనగరం. ఉత్తరకోస్తా మధ్యలో ఉండే విజయనగరం వ్యాపార, వాణిజ్య కేంద్రం. రాజకీయంగా విజయనగరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. విజయనగరం, బొబ్బిలి వంటి సంస్థానాలు ఉన్న విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీసీల ఆధిపత్యమే ఎక్కువ. రాజులు, రాజ్యాలు పోయినా.. ఈ ప్రాంత వాసులు రాజులను ఆదరించడం వల్ల ఇప్పటికీ అశోక్‌ గజపతిరాజు, బొబ్బిలి రాజులు రాజకీయంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో బీసీ నేతలైన మంత్రి బొత్స సత్యనారాయణ, కిమిడి కళావెంకటరావు వంటి వారు రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతున్నారు.

ఇక 2009లో ఏర్పడిన విజయనగరం పార్లమెంట్‌ స్థానానికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకసారి ఎంపీగా గెలిచిన వారు రెండోసారి విజయం సాధించలేకపోవడం, రాజకీయంగా తెరమరుగు కావడం జరుగుతోంది. దీంతో రెండోసారి పోటీ చేస్తున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ఈ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా? లేదా? అనేది ప్రధాన చర్చనీయాంశమవుతోంది.

మరోసారి పోటీకి సిద్ధమైన సిట్టింగ్‌ ఎంపీ బెల్లాన..
విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గంలో తొలిసారి కాంగ్రెస్‌, ఆ తర్వాత టీడీపీ, గత ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి. ఇలా ప్రతి ఎన్నికకూ ఒక్కొపార్టీ గెలవడమే కాకుండా.. గెలిచిన నేత కూడా మారిపోతున్నారు. 2009లో బొత్స ఝాన్సీలక్ష్మి, 2014లో అశోక్‌ గజపతిరాజు, 2014లో బెల్లాన చంద్రశేఖర్‌ విజయనగరం ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2009లో గెలిచిన ఝాన్సీలక్ష్మి 2014లో ఓడిపోగా, ఆ ఎన్నికల్లో విజయం సాధించిన అశోక్‌ గజపతిరాజు గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇక గత ఎన్నికల్లో గెలిచిన బెల్లాన చంద్రశేఖర్‌ తాజాగా మరోసారి పోటీకి సిద్ధమయ్యారు.

ఎమ్మెల్యేలతో సఖ్యత, మంత్రి బొత్స ఆశీస్సులు..
ఎంపీ బెల్లానకు ప్రత్యర్థిగా టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడిని బరిలోకి దిగారు. వాస్తవానికి ఈ సారి ఎంపీగా పోటీకి విముఖత ప్రదర్శించిన బెల్లాన.. ఎచ్చెర్ల ఎమ్మెల్యే స్థానం ఆశించారు. తన సొంత నియోజకవర్గంలో మంత్రి బొత్స పోటీ చేస్తుండటం వల్ల.. తన బంధువర్గం ఉన్న ఎచ్చెర్లలో ఎమ్మెల్యేగా గెలవడం ఈజీ అనుకున్నారు. కానీ, వైసీపీ హైకమాండ్‌ బెల్లానను ఎంపీగానే పోటీ చేయాలని ఆదేశించింది. గత ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న బెల్లానపై జిల్లాలో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఎమ్మెల్యేలు అందరితో సఖ్యతగా ఉండటమే కాకుండా, మంత్రి బొత్స ఆశీస్సులు ఉండటంతో ఆయనకు రెండోసారి చాన్స్‌ ఇచ్చింది పార్టీ.

ఫ్యాన్ సునామీతో పాటు కలిసొచ్చిన బీసీ నినాదం..
గత ఎన్నికల్లో సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజును ఓడించిన బెల్లాన… ఈ సారి బీసీ నేత కలిశెట్టి అప్పలనాయుడును ఢీకొట్టబోతున్నారు. గత ఎన్నికల్లో ఫ్యాన్‌ సునామీతో పాటు బీసీ నినాదం బెల్లానకు కలిసొచ్చిందని చెబుతారు. 2014లో ఎంపీగా ఎన్నికైన అశోక్‌ గజపతిరాజు కేంద్రమంత్రిగా పనిచేశారు. అటువంటి సీనియర్‌ నేతపై బెల్లాన గెలవడం అప్పట్లో సంచలనంగా మారింది.

బలంగా పని చేసిన బీసీ నినాదం..
విజయనగరం నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఆ ఏడు చోట్ల వైసీపీ అభ్యర్థులే గెలిచారు. కానీ, ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీతో పోల్చితే ఎంపీ బెల్లాన మెజార్టీ మాత్రం భారీగా తగ్గింది. దీనికి కారణం అశోక్‌ గజపతిరాజుకి భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరగడమే. బీసీ నినాదం బలంగా పని చేయడం వల్ల ఆ ఎన్నికల్లో బెల్లాన గెలిచినట్లు విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో బీసీ నేతకే చాన్స్‌ ఇవ్వాలని భావించింది టీడీపీ.. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడికి టికెట్‌ ఇచ్చింది.

లక్కీగా టికెట్ కొట్టేసిన కలిశెట్టి..
వాస్తవానికి విజయనగరం టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. లక్కీగా టికెట్‌ కొట్టేశారు. టీడీపీ యువనేత లోకేశ్‌తో మంచి సంబంధాలు ఉన్న కలిశెట్టి.. ఈ ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. మూడు నాలుగేళ్లుగా అదే నియోజకవర్గంలో గ్రౌండ్‌ వర్క్‌ బాగా చేశారు. ఆ నియోజకవర్గంలో సీనియర్‌ నేత కళా వెంకటరావు ఉన్నప్పటికీ, టీడీపీ అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో మొండిగా వ్యవహరించారు కలిశెట్టి. సైకిల్‌ యాత్రలు, పాదయాత్రలు చేయడమే కాకుండా నియోజకవర్గం మొత్తం విస్తృతంగా పరిచయాలు పెంచుకున్నారు.

గుడులు, గోపురాలకు విరాళాలిచ్చి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయినప్పటకీ రాజకీయంగా ఇంతవరకు ఏ పదవీ చేపట్టని కలిశెట్టికి ఎమ్మెల్యే టికెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో పొత్తుల్లో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించడంతో కలిశెట్టికి అనూహ్యంగా ఎంపీ టికెట్‌ లభించింది. ఇన్నాళ్లు ఒక్క ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గానికే మాత్రమే పరిమితమైన అప్పలనాయుడు.. ఎంపీగా గట్టిపోటీనే ఎదుర్కొంటున్నారు.

కలిశెట్టి ముందు అనేక సవాళ్లు..
మొత్తం ఏడు నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలతో పరిచయాలు పెంచుకోవడమే ఆయనకు సవాల్‌గా మారుతోంది. పైగా సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు తప్పుకోవడం, మరో సీనియర్‌ నేత కళావెంకటరావుతో విభేదాలు, గజపతినగరం నియోజకవర్గంలో పార్టీలో అంతర్గత విభేదాలు, నెల్లిమర్ల జనసేనకు, ఎచ్చెర్ల బీజేపీకి కేటాయించడం అప్పలనాయుడు పోటీపై ప్రభావం చూపుతున్నాయి. కానీ, ప్రతికూల పరిస్థితులు అన్నింటినీ చక్కదిద్దుకుని ముందుకు వెళుతున్నారు కలిశెట్టి అప్పలనాయుడు.

వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా చరిత్రే..
మొత్తానికి విజయనగరంలో ఇద్దరు బీసీ నేతల మధ్య బిగ్‌ఫైట్‌ జరిగేలా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ సారి విజయనగరం సెంటిమెంట్‌కు బ్రేక్‌ పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతవరకు ఏ పార్టీ రెండోసారి గెలవకపోగా, ఈ సారి ఏ పార్టీ గెలిచినా రెండోసారి విజయం సాధించినట్లే అవుతుంది. ఇక ఎంపీ బెల్లానకు వన్స్‌మోర్‌ లభిస్తే అదో రికార్డు అవుతుంది. టీడీపీ అభ్యర్థి కలిశెట్టి గెలిచినా… అదో చరిత్ర అవుతుంది. ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలాంటి పదవి చేపట్టని కలిశెట్టి ఏకంగా పార్లమెంటులో అడుగుపెట్టే అరుదైన అవకాశం దక్కించుకున్నట్లు అవుతుంది. మరి ఈ ఇద్దరు అభ్యర్థులు ఎవరు ఎలాంటి రికార్డు సృష్టిస్తారో చూడాలి.

Also Read : చంద్రబాబు కోటను బద్ధలు కొట్టడం సాధ్యమా? కుప్పంలో వైసీపీ భారీ వ్యూహం ఏంటి?