AP Elections 2024 : ఇరకాటంలో కూటమి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ఇబ్బందిగా మారిన అభ్యర్థుల ఎంపిక

అక్కడ వైఎస్ వివేకా కుటుంబసభ్యులు రంగంలోకి దిగే అవకాశం ఉన్నందున.. టీడీపీ అభ్యర్థి ప్రకటనకు మరింత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

AP Elections 2024 : ఇరకాటంలో కూటమి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ఇబ్బందిగా మారిన అభ్యర్థుల ఎంపిక

ఏపీ ఎన్డీయే కూటమిలో అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు వేగవంతమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో అసంతృప్తి గళాలు వినిపిస్తుండగా.. మిగిలిన అభ్యర్థుల ఖరారు కూటమికి ఇబ్బందిగా మారింది. టీడీపీలో ఇంకా 7 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు.. జనసేన ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీలో ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు పెండింగ్ లో ఉన్నాయి.

టీడీపీలో ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని చంద్రబాబు మాగుంట శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వాలని అనుకుంటూ ఉండగా ఆయన కుటుంబసభ్యులు మాత్రం మాగుంట రాఘవరెడ్డికి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో లింకులు ఉన్నాయన్న ఆరోపణలతో చంద్రబాబు ఆ స్థానానికి అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయలేదు.

మరోవైపు కడప ఎంపీ స్థానంపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడ వైఎస్ వివేకా కుటుంబసభ్యులు రంగంలోకి దిగే అవకాశం ఉన్నందున.. టీడీపీ అభ్యర్థి ప్రకటనకు మరింత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కడప నుంచి శ్రీనివాస్ రెడ్డి టీడీపీ ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. ఇక, వైసీపీ అభ్యర్థి ప్రకటన తర్వాతే కడప అభ్యర్థిని ప్రకటించనున్నారు చంద్రబాబు.

అనంతపురం ఎంపీ లోక్ సభ స్థానాన్ని బోయ సామాజికవర్గానికి చెందిన నాగరాజుకు కేటాయించేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. కానీ, అక్కడ జేసీ పవన్ కుమార్ రెడ్డి టికెట్ కోసం పట్టుబడుతున్నారు. మరోవైపు విజయనగరం ఎంపీ అభ్యర్థిని కూడా బాబు ఇంకా ప్రకటించ లేదు. పొత్తులో భాగంగా విజయనగరాన్ని టీడీపీకి ఇచ్చేసిన బీజేపీ.. రాజంపేట స్థానాన్ని తీసుకుంది.

ఇక విజయనగరంలో తూర్పు కాపు వాళ్లకు టికెట్ ఇవ్వాలని పలువురి పేర్లను బాబు పరిశీలిస్తున్నారు. మరోవైపు అదే స్థానం నుంచి రఘురామకృష్ణరాజు పేరును కూడా బాబు పరిశీలిస్తున్నారు. నర్సాపురం టికెట్ పే రఘురామకృష్ణరాజు ఆశించినా.. బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేదు. ఆయనను విజయనగరం నుంచి బరిలోకి దింపే దిశగా కూటమి ఆలోచిస్తోంది.

ఇక అసెంబ్లీ స్థానాల్లో భీమిలి, దర్శి, చీపురుపల్లి, గుంతకల్లు, రాజంపేట, ఆలూరు, అనంతపురం అర్బన్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. చీపురుపల్లి టికెట్ గంటా శ్రీనివాస రావుకి, భీమిలి టికెట్ కళా వెంకట్రావుకి ఇవ్వాలని యోచిస్తున్నారు చంద్రబాబు. అయితే స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇక పొత్తులో భాగంగా నెల్లిమర్ల టికెట్ కోల్పోయిన బంగార్రాజు, భీమిలి ఇంఛార్జ్ గా ఉన్న కోరాడ రాజబాబు.. భీమిలి టికెట్ ఆశిస్తున్నారు. దర్శిలో సిద్ధా రాఘవరావు టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. టికెట్ ఇస్తే పార్టీలో చేరతారనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.

అయితే అదే స్థానంలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య కుమార్తె పేరు, స్థానిక నేత గోరంట్ల రవికుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రాజంపేటలో జగన్ మోహన్ రాజు, మంచాల చెంగల్రాయుడు పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఇక అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానంలో ప్రభాకర్ చౌదరి, ఎన్ఆర్ఐ నిర్మల రేసులో ఉన్నారు. వీరిలో ఒకరికి టీడీపీ టికెట్ దక్కే అవకాశం ఉంది. ఇక ఆలూరులో వైకుంఠం శ్రీనివాసులు కుటంబం, వీరభద్రయ్య టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

గుంతకల్లు నియోజకవర్గంలో మాజీ మంత్రి జయరాం పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నారు. కాకపోతే అక్కడ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వారికి నచ్చజెప్పేందుకు బాబు రంగంలోకి దిగనున్నారు. ఇదే స్థానం నుంచి మాజీ పోలీసు అధికారి సుధాకర్ యాదవ్ కూడా రంగంలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇక జనసేన నుంచి మూడు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పవన్ కి టఫ్ టాస్క్ గా మారింది. విశాఖ సౌత్ నుంచి వంశీ కృష్ణ యాదవ్ తాజాగా జనసేనలో చేరారు. వంశీ కృష్ణకే విశాఖ సౌత్ టికెట్ అనుకోగా.. జనసేన కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో ఆ టికెట్ ఇంకా ప్రకటించలేదు. అవనిగడ్డ నుంచి బాలశౌరి పేరు ప్రచారంలో ఉండగా.. జనసేనకు చెందిన శ్రీనివాస్, రామకృష్ణ, బండి రామక్రిష్ణల పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో బందరు పార్లమెంటు స్థానాన్ని బాలశౌరికి కేటాయిస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే లిస్టులో ఆయన పేరు రాలేదు. మరోవైపు బందరు పార్లమెంటు స్థానం నుంచి ఓ పారిశ్రామికవేత్త పేరు వినిపిస్తోంది.

ఇక, బీజేపీలోనూ పది అసెంబ్లీ స్థానాలపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఎచ్చెర్ల నుంచి ఎన్వీఆర్ అనే నేతకు టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి శ్రీనాథ్ రెడ్డి, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, ధర్మవరం నుంచి వరదాపురం సూరి టికెట్ ఆశించారు. అయితే, ధర్మవరంలో ఓ సీనియర్ నేతకు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ ఆలోచిస్తోంది. విశాఖ నార్త్ సీటును విష్ణుకుమార్ రాజుకే కన్ ఫర్మ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రేపు సాయంత్రం లోపు బీజేపీ పూర్తి లిస్టు ప్రకటించే అవకాశం ఉంది.

Also Read : ఏపీ బీజేపీలో సీట్ల లొల్లి.. ఢిల్లీ బాటపట్టిన సీనియర్లు