ఘోర పరాజయం తప్పదు..! చిచ్చు రాజేసిన పీకే వ్యాఖ్యలు, భగ్గుమంటున్న వైసీపీ నాయకులు

ఏ రాజకీయ నేత నిజాన్ని ఒప్పుకోరని, ఎన్నికల ఫలితాల రోజు నాలుగు రౌండ్ల తర్వాత నిజమైన ఫలితం ఏంటో ప్రజలే చూడబోతున్నారని వ్యాఖ్యానించారు.

ఘోర పరాజయం తప్పదు..! చిచ్చు రాజేసిన పీకే వ్యాఖ్యలు, భగ్గుమంటున్న వైసీపీ నాయకులు

Prashant Kishor : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై చేసిన కామెంట్స్ వైపీపీలో కాక రేపుతున్నాయి. పీకేకు, వైసీపీ నేతలకు మధ్య ఇప్పటికే డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రశాంత్ కిశోర్. గతంకంటే భిన్నంగా ఈసారి ఆసక్తికర విషయాలు చెప్పారాయన. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి తప్పదన్నారు. ఏ రాజకీయ నేత నిజాన్ని ఒప్పుకోరని, ఎన్నికల ఫలితాల రోజు నాలుగు రౌండ్ల తర్వాత నిజమైన ఫలితం ఏంటో ప్రజలే చూడబోతున్నారని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ..
ఈ నెల 13న పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఏ పార్టీకి విజయం వరిస్తుందోనని నేతలతో పాటు ఓటర్లలోనూ ఉత్కంఠ నెలకొంది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు చెబుతుంటే.. సీఎం జగన్ మాత్రం 2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లతో వైసీపీ పవర్ లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 151కి పైగా ఎమ్మెల్యే సీట్లు, 22 వరకు ఎంపీ సీట్లు ఖాయమన్నారు. అంతేకాదు జూన్ 9న జగన్ రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం పక్కా అంటున్నారు.

వైపీపీకి ఘోర పరాజయం ఖాయం..!
సీఎం జగన్ వ్యాఖ్యల తర్వాత మరోసారి ప్రశాంత్ కిశోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురుకాబోతోందని జోస్యం చెప్పారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్లే.. అటు అమిత్ షా, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ కూడా చెబుతున్నారని అన్నారు. తాను గత పదేళ్లుగా ఎన్నికల్లో పని చేస్తున్నానని, ఫలితాల ముందే ఓటమిని అంగీకరించిన వారు ఎవరూ కనిపించలేదని వ్యాఖ్యానించారు.

ఓటమిని వైసీపీ ముందే ఒప్పుకుంది- పీకే
జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో 4 రౌండ్లు పూర్తైన తర్వాత కూడా వచ్చే రౌండ్లలో తమకు మెజార్టీ ఖాయమని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ధీమాను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ గెలుపోటములపైన చర్చకు అంతమే ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రశాంత్ కిశోర్ ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మూడోసారి. ఏపీ ఎన్నికలకు ముందు కూడా రెండుసార్లు ఇలాగే అన్నారాయన. తాజాగా మూడోసారి కూడా ఇదే చెప్పారు. కాకపోతే ఈసారి వైసీపీ ఓటమిని ముందే ఒప్పుకుందని ప్రశాంత్ కిశోర్ చెప్పడం కాస్త ఇంట్రస్టింగ్ టాక్.

పీకే వ్యాఖ్యలపై గరం గరం..
అటు పీకే కామెంట్స్ ను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఏ అంచనాలతో ఆయన ఈ కామెంట్స్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఓవైపు దేశం ఆశ్చర్యపోయేలా ఏపీ ఫలితాలు ఉంటాయని, తాము భారీ మెజార్టీతో గెలవబోతున్నామని సీఎం జగన్ చెబుతుంటే.. ఓటమిని అంగీరిస్తున్నాం అని పీకే చెప్పడం ఏంటని ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు.

పీకే ఏమైనా బ్రహ్మనా? మళ్లీ జగనే సీఎం- మంత్రి బొత్స
ప్రశాంత్ కిశోర్ పై నిప్పులు చెరిగారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రశాంత్ కిశోర్ ఏమైనా బ్రహ్మనా? ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీకే ఓ క్యాష్ పార్టీ అని, ఆయన గిమ్మిక్కులు చేస్తారని విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిశోర్ కమర్షియల్ అని తెలుసుకుని, తాము వద్దనుకున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ కోసం ఐప్యాక్ నిర్మాణాత్మకంగానే పని చేస్తోందని మంత్రి బొత్స తెలిపారు. ప్రశాంత్ కిశోర్ అయినా, ఐప్యాక్ అయినా తాత్కాలికమేనని, వైసీపీ శాశ్వతం అని స్పష్టం చేశారు. ఎవరెన్ని మాట్లాడినా తామే గెలుస్తామన్నారు మంత్రి బొత్స. జూన్ 9న విశాఖలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారన్నారు మంత్రి బొత్స.

బీజేపీకి గతంకంటే తక్కువ సీట్లు..!- పీకే
ఇక లోక్ సభ ఎన్నికల ఫలితాలపైనా స్పందించారు పీకే. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి గతంకంటే సీట్లు తక్కువని చెప్పుకొచ్చారు. అయితే 400 సీట్లు రాకపోవచ్చన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ, బీజేపీపై అసంతృప్తి మాత్రమే ఉందని, ఆగ్రహం లేదని అన్నారు. అందుకే ఈసారి బీజేపీ 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ అంతకంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు.

Also Read : ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈసీ సీరియస్.. పిన్నెల్లి గెలిచినా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశం!