Ugadi 2025 : ఉగాది రోజున బంగారం కొనొచ్చా? ఏ సమయంలో కొంటే మంచిది? పండితులు ఏం చెబుతున్నారు..
ఉగాదిని ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఆరోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకు మంచి రోజు అని పండితులు చెబుతున్నారు.

Ugadi 2025 : ఉగాది పర్వదినం వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అంటారు. మార్చి 30న శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ రోజునే ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇదే రోజున పంచాంగం శ్రవణం కూడా జరుపుతారు. చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున కృత యుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం.
ఉగాది పండుగ రోజు అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం ఉంటుంది. కొత్త సంవత్సరంలో గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి, వర్షాలు ఏ మేర పడతాయి, పంటలు ఎలా పండతాయి, ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుంది, ఇలా భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న విషయాలను అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తారు. ఉగాది లేదా యుగాది అని కూడా పిలుస్తారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సర దినం. తెలుగువారి మొదటి పండుగ ఉగాది. అందుకే దీన్ని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు.
Also Read : 29న షష్టగ్రహ కూటమి.. ఆ రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు..
తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మార్చి 30న ఆదివారం ఉగాది పండుగ జరుపుకోనున్నారు. ఉగాదిని ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఆరోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకు మంచి రోజు అని పండితులు చెబుతున్నారు.
ఉగాది పర్వదినాన బంగారం కొనొచ్చా? పసిడి కొనుగోలు చేయాలంటే ఏ సమయంలో చేయాలి? పండితులు ఏం చెబుతున్నారు? అనే వివరాల్లోకి వెళితే.. ఉగాది పర్వదినాన గోల్డ్ కొనొచ్చని పండితులు చెబుతున్నారు. దానికి ఓ సమయం కూడా ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల లోపల బంగారం కొనుగోలు చేయడానికి శుభ సమయంగా నిర్ణయించారు. దాంతో పాటే వెండి కొనుగోలుకు కూడా అదే మంచి సమయమట. అంతేకాదు.. పసుపు, బెల్లం, చింతపండు మొదలైన శుభకరమైన వస్తువులు కొనడానికి అదే శుభ సమయం అంటున్నారు పండితులు.
ఇక.. ఉగాది రోజున పూజ ఏ సమయంలో చేయాలి అనే సందేహం చాలా మందికి కలిగి ఉండొచ్చు. అందుకు ఉదయం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు పూజ చేసుకోవచ్చని పండితులు చెతున్నారు. ఇక ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల లోపల నూతన వస్త్రధారణ, నూతన యజ్ఞోపవీత ధారణ చేయడానికి, ఉగాది పచ్చడి తీసుకోవడానికి శుభ సమయం అని పండితులు వివరించారు.