Gold Investment : పెట్టుబడికి ఫిజికల్ గోల్డ్ కన్నా గోల్డ్ ఈటీఎఫ్ ఎందుకు బెటర్? ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే మీరు ఇదే చేస్తారు!
Gold Investment : బంగారంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? సాధారణ బంగారం (ఫిజికల్ గోల్డ్)లో పెట్టుబడి మంచిదా? గోల్డ్ ఈటీఎఫ్ (డిజిటల్ గోల్డ్)లో పెట్టుబడి పెడితే మంచిదా? ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా ఇలానే ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు.

Gold Investment
Gold Investment : బంగారం ధరలు పెరుగుతున్నాయి.. మళ్లీ తగ్గుతున్నాయి. చాలామంది బంగారంపై పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటారు. అయితే, బంగారంలో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. వాస్తవానికి మనం ఫిజికల్ గోల్డ్ (సాధారణ బంగారం)లో పెట్టుబడి పెట్టడం కన్నా గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు మార్కెట్ నిపుణులు. ప్రస్తుత బంగారం ధరలపై అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
ప్రధానంగా మధ్యప్రాచ్య సంక్షోభం, డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా ప్రస్తుతానికి బంగారం పెట్టుబడికి గమ్యస్థానంగా మారింది. గత కొన్ని వారాలుగా బంగారం ధరలు బాగా పెరిగాయి. మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితమైనదిగా భావిస్తున్నారు. అందుకే గోల్డ్ ఈటీఎఫ్ (ETF) ఫిజికల్ గోల్డ్ కన్నా బెటర్ అని అభిప్రాయపడుతున్నారు.
భారత బులియన్ మార్కెట్లో గోల్డ్ ఈటీఎఫ్‌లు ప్రధాన పెట్టుబడి ఎంపికగా మారుతున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) డేటా ప్రకారం.. 2024లో బంగారు ఈటీఎఫ్‌లు నికర ఇన్‌ఫ్లో 216 శాతం పెరుగుదలతో రూ. 9,225 కోట్లుగా నమోదైంది.
2023లో ఈ సంఖ్య రూ. 2,919 కోట్ల కన్నా చాలా తక్కువగానే నమోదైంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు ఫిజికల్ గోల్డ్ ధరలను ట్రాక్ చేస్తాయి. షేర్ల మాదిరిగానే.. స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా కొనుగోలు చేయొచ్చు లేదంటే అమ్ముకోవచ్చు. అలాగే, పెట్టుబడిదారులు ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఎలాంటి మేకింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
గోల్డ్ ఈటీఎఫ్‌లతో 5 ముఖ్యమైన బెనిఫిట్స్ ఇవే :
1. సులభంగా ట్రేడింగ్ చేయవచ్చు :
ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లు (ETFs) సులభంగా కొనుగోలు చేయవచ్చు. లేదంటే అమ్మవచ్చు. స్టాక్ మార్కెట్లో సులభంగా కొనవచ్చు లేదా అమ్మవచ్చు. మీకు కావలసినప్పుడు ఓపెన్ మార్కెట్లో అమ్మడం ద్వారా గరిష్ట లాభం పొందవచ్చు.
2. నిల్వ ఖర్చులు ఉండవు :
ఫిజికల్ గోల్డ్ మాదిరిగా ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ యూనిట్లకు నిల్వ ఖర్చులు ఉండవు. ఈటీఎఫ్‌లు మీ డీమ్యాట్ అకౌంటుకు లింక్ అయి ఉంటుంది. బంగారం ద్వారా పొందే రాబడి ప్రయోజనాలను బ్యాంకులోనే ఉంచుకోవచ్చు.
3. తయారీ ఛార్జీలు ఉండవు :
మీరు (ETF) రూపంలో డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేస్తే.. బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై ఆందోళన అవసరం లేదు. సాధారణంగా, బంగారు ఆభరణాల తయారీ ఖర్చు 15 శాతం నుంచి 20 శాతం వరకు ఉంటుంది.
4. చిన్నమొత్తంలో యూనిట్లు :
మీరు చిన్న డినామినేషన్లలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక గ్రాం ఫిజికల్ గోల్డ్ ధర దాదాపు రూ.8,600 కాగా, ఈటీఎఫ్‌లు పెట్టుబడిదారులు రూ.500 నుంచి రూ. 1,000 వరకు చాలా చిన్న డినామినేషన్లలో డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసుకోవచ్చు.
5. ధరల పారదర్శకత :
గోల్డ్ ఈటీఎఫ్ ముఖ్య ప్రయోజనాల్లో ధరల పారదర్శకత ఒకటి. పెట్టుబడిదారులు బంగారం ధరను, బంగారు నిల్వల పనితీరును సులభంగా పర్యవేక్షించవచ్చు. బంగారం ధరలను పర్యవేక్షించడం చాలా సులభంగా ఉంటుంది. మీరు ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అందులోని లాభనష్టాలను ఎప్పటికప్పుడూ అంచనా చేయొచ్చు..