ఎయిర్ ఇండియా డొమెస్టిక్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం

  • Published By: murthy ,Published On : May 22, 2020 / 09:49 AM IST
ఎయిర్ ఇండియా డొమెస్టిక్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం

Updated On : May 22, 2020 / 9:49 AM IST

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్-‌4లో  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల మేరకు దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా డొమెస్టిక్‌ ఫ్లైట్‌ బుకింగ్స్‌ ప్రారంభించింది. శనివారం నుంచి డొమెస్టిక్‌ ఫ్లైట్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని ఎయిర్‌ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

దేశీయ విమాన సర్వీసుల విషయంలో కేంద్రం ఇచ్చిన మినహాయింపుల మేరకు వచ్చే 3 నెలల్లో, మే 25 నుంచి ఆగస్టు 25 వరకు ఎయిర్‌ ఇండియా వారానికి 8,428 సర్వీసుల చొప్పున నడుపనున్నట్లు ప్రకటించింది. 

కాగా, మే 25 నుంచి ప్రారంభమయ్యే డొమెస్టిక్‌ సర్వీసుల చార్జీలు కనిష్టంగా 2,000, గరిష్టంగా 18,600 పరిమితిని దాటకూడదని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి స్పష్టం చేశారు. దేశంలోని అన్ని ఎయిర్‌ లైన్స్‌కు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి హర్దీప్‌ ఆదేశాలకు లోబడి ధరల నిర్ణయించిన ఎయిర్‌ ఇండియా సంస్థ శనివారం నుంచి డొమెస్టిక్‌ విమానాల బుకింగ్‌లు మొదలుపెట్టింది.

Read: 25 నుంచి ఎగరనున్న విమానాలు.. ఛార్జీలపై 3 నెలల నియంత్రణ

కాగా ….తమిళనాడు రాష్ట్రంలో  కరోనా కేసులు  పెరుగుతుండటంతో మే 31 వరకు విమాన ప్రయాణాలకు అనుమతి ఇవ్వవద్దని ఆరాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని… ప్రజారవాణా సౌకర్యాలు కూడా తగినంత అందుబాటులో లేవని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖకు రాసిన లేఖలో పేర్కోంది. 

కొద్ది దూరం ప్రయాణం చేసిన వారికి క్వారంటైన్ అవసరంలేదని విమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కాగా….. కేంద్రం సూచనల మేరకు చెన్నై విమానాశ్రయంలో వైరస్ నిరోధక చర్యలుచేపడతామని అధికారులు ప్రకటించారు. తమిళనాడులో ఇప్పటి వరకు సుమారు 13వేల మందికి కరోనా వైరస్ సోకింది.