కిక్కు దిగిపోతుంది : భారీగా పెరగనున్న మద్యం ధరలు

మందుబాబులకు షాకింగ్ న్యూస్. మద్యం రేట్లు భారీగా పెరగనున్నాయి. దీనికి ప్రధాన కారణం రైతు రుణమాఫీనే. గతేడాది డిసెంబర్ లో మూడు రాష్ట్రాల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతులకు వరాల జల్లు కురిపించిన రుణమాఫీని ప్రకటించి రైతులను ఆకట్టుకొంది. కాంగ్రెస్ బాటలోనే మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతు రుణమాఫీని అనుసరిస్తున్నాయి. ఆదివారం(జనవరి 20,2019) తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా 24వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. అస్సాంలోని అధికార బీజేపీ కూడా రైతు రుణమాఫీ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు రైతులకు ప్రకటించిన రుణమాఫీ 1.75 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇటువంటి రైతు అనుకూల నిర్ణయాల తీసుకొని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నిర్ణయాలతో 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాష్ట్రాల ఆర్థిక లోటు 3.2కు చేరుకోనుందని ఇండియా రేటింగ్స్ రీసెంట్ రిపోర్ట్ తెలిపింది.
ఈ సమయంలో రాష్ట్రాలపై భారం తగ్గించేందుకు ఆయా ప్రభుత్వాలు మద్యంపై ట్యాక్స్ లను భారీగా పెంచే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులైన మూడింటిలో మద్యం ఒకటిగా ఉంది. దీంతో అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలను నడిపించాలంటే లిక్కర్ పై ట్యాక్స్ లు పెంచక తప్పదని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒకడుగు ముందుకేసింది. ఈ నెల మొదట్లో దేశీయ తయారీ లిక్కర్ పై 20శాతం పన్ను విధించింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా 2వేల 500 కోట్లు రానుంది. గతేడాది కూడా కొన్ని రాష్ట్రాలు ఆల్కహాల్ పై ట్రాక్స్ లు పెంచాయి. గుజరాత్ అయితే ఆల్కహాల్ పై మూడు రెట్లు ట్యాక్స్ పెంచింది. కేరళ కూడా 210 శాతం ట్యాక్స్ పెంచింది. ఇండియా ఫిల్లింగ్స్ అంచనా ప్రకారం..బీర్, లిక్కర్ పై ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 90వేల కోట్ల రూపాయలను ట్యాక్స్ ల రూపంలో పొందుతున్నాయి. ఆల్కహాల్ ని జీఎస్టీలో చేర్చకపోవడానికి ఇదే ప్రధాన కారణం.