HYD Beautification : మూసీ సుందరీకరణపై టీ సర్కార్ ఫోకస్.. లండన్‌ థేమ్స్ నదిలా అభివృద్ధిపై ప్రణాళికలు

HYD Beautification : త్వరలో మూసీలోకి వచ్చే మానవ వ్యర్థాలకు అడ్డుకట్ట పడనుంది. ఇక తాజాగా మూసీని శుద్ధి చేయడమే కాకుండా లండన్‌లోని థేమ్స్ నదిలా అభివృద్ధి చేసేలా కొత్త సర్కార్‌ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇటీవల లండన్‌ వెళ్లిన సీఎం రేవంత్‌... అక్కడి థేమ్స్ రివర్‌ అపెక్స్ అధికారులతో చర్చించారు.

HYD Beautification : మూసీ సుందరీకరణపై టీ సర్కార్ ఫోకస్.. లండన్‌ థేమ్స్ నదిలా అభివృద్ధిపై ప్రణాళికలు

Congress Govt Focus on HYD Beautification

Congress Govt Focus on HYD Beautification : మూసీని ఆధారం చేసుకుని ప్రాణం పోసుకున్న భాగ్యనగరం… విశ్వనగరంగా విస్తరించిన తర్వాత ఆ నదినే మురికిమ‌యం చేసింది. రోజు రోజుకు హైదరాబాద్‌ విస్తరించడం, ప‌రిశ్రమ‌లు, వ్యాపార‌ కేంద్రాలు పెర‌గ‌డంతో వాటి నుంచి వెలువ‌డే వ్యర్థాల‌ు మూసీని మురికికాలువగా మార్చాయి. హైద‌రాబాద్‌లో భూముల ధ‌ర‌ల‌ు పెరగడానికి తోడు అధికారుల అల‌స‌త్వం కార‌ణంగా క‌బ్జాకోర‌ల్లో మూసీ బ‌క్కచిక్కింది. అలాంటి మూసీపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. పునరుద్ధరణ చర్యల్లో భాగంగా మూసీని లండన్ థేమ్స్‌లా డెవలప్‌ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

కలుషిత నీటికి కేంద్రంగా మూసి నది :
హైద‌రాబాద్ మహా నగరంలో మూసీ నది సూమారు 55 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తుంది. ఒకప్పుడు శుభ్రమైన నీరు ప్రవహించే ఈ నది… ఇప్పుడు మురుగు నీటికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కాలుష్యం, మానవ వ్యర్థాలు, రసాయనాలతో నగరవాసులను విషకోరల్లో బంధిస్తోంది. ఒకప్పుడు నది పరివాహక ప్రాంతంలో పంటలకు నీరందించిన మూసీ… ఇప్పుడు కలుషిత నీటికి కేంద్రంగా మారింది. ఓపెన్‌గా ప్రవహిస్తున్న ఈ మురుగునీరు ఆ ప్రాంతమంతా దుర్వాసనను వెదజల్లుతుంది. మూసీలో ప్రతి రోజు 1500 మిలియ‌న్ లీట‌ర్ల మురుగునీరు చేరుతుంది. ఇందులో మాన‌వ వ్యర్థాల‌తో పాటు, పారిశ్రామిక వ్యర్థాలున్నాయి. న‌గ‌రంలోని 30కి పైగా ప్రధాన‌ నాలాల ద్వారా మూసీలోకి మురుగు నీరు చేరుతుంది.

Read Also : Real Estate East Hyderabad : మహానగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్టీ రంగం.. ఇన్వెస్ట్‌మెంట్‌కు బెస్ట్‌ చాయిస్‌గా ఈస్ట్‌ హైదరాబాద్‌!

లండన్‌ థేమ్స్ నదిలా అభివృద్ధిపై కొత్త సర్కార్‌ ప్రణాళికలు :
రాజేంద్రన‌గ‌ర్, నార్సింగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో స్వచ్ఛంగా ఉండే మూసీ… న‌గ‌రం న‌డిబొడ్డుకు రాగానే మురికి కూపంగా మారుతోంది. అత్తాపూర్, అంబ‌ర్‌పేట్, నాగోల్, న‌ల్లచెరువు ప్రాంతాల్లో మురుగును శుద్ధి చేయడానికి సీవ‌రేజ్ ట్రీట్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లు కూడా 650 మిలియ‌న్ లీట‌ర్ల మురుగు నీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేయడంలేదు. దీంతో స‌గానికి పైగా మురుగునీరు యథావిధిగా మూసీలో కలుస్తోంది. గత ప్రభుత్వం 3వేల 850 కోట్లతో సిటీలో ఉత్పత్తయ్యే మురుగు శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీంతో త్వరలో మూసీలోకి వచ్చే మానవ వ్యర్థాలకు అడ్డుకట్ట పడనుంది. ఇక తాజాగా మూసీని శుద్ధి చేయడమే కాకుండా లండన్‌లోని థేమ్స్ నదిలా అభివృద్ధి చేసేలా కొత్త సర్కార్‌ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇటీవల లండన్‌ వెళ్లిన సీఎం రేవంత్‌… అక్కడి థేమ్స్ రివర్‌ అపెక్స్ అధికారులతో సమావేశమయ్యారు. కార్యాచరణ, అమలులో ఎదురైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని హైదరాబాద్‌లో ఎలా అతిక్రమించాలనేదానిపై వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం సమీక్షించారు.

మరో 15 వంతెనలను నిర్మించే ప్లాన్ : 
కొన్నేళ్లుగా మూసీ నది 10 నుంచి 15 శాతం వరకు కబ్జాకు గురైంది. వ్యాపారం ముసుగులో మూసీ పరివాహాక ప్రాంతంలో మట్టిని నింపుతూ ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్నారు. అలాంటి వాటన్నింటిని తొలగించి మూసీని డెవలప్ చేయాలని ప్రభుత్వం ఫిక్స్ అయింది. మూసీ పరిసరాలను అందంగా తీర్చిదిద్దడం ద్వారా పర్యాటక ప్రాంతంగా డిజైన్‌ చేయనుంది. ఓ వైపు మురుగు శుద్ధి మరోవైపు అక్రమాల తొలగింపుపై ఏకకాలంలో పనిచేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సిటీ మధ్య నుంచి వెళ్లే మూసీ పొడవునా ఈస్ట్ వెస్ట్ కారిడార్ రూపకల్పనకు కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్ చేసింది. మూసి డెవలప్మెంట్ సమీక్షలో ముఖ్యమంత్రి మూసీపై రోడ్డు నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణంపై చర్చించారు. ఇప్పటికే ఉన్న బ్రిడ్జితో పాటు మరో 15 వంతెనలను నిర్మించాలని గతంలో ప్లాన్‌చేశారు. ఇందులో 4 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేయగా, ముసారాంబాగ్ వద్ద ఒక బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ వంతెనల వద్ద చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేసి బోటింగ్ కోసం ఉపయోగించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.

రియాల్టీ ప్రాజెక్టులు వచ్చే ఛాన్స్ : 
నగరానికి పశ్చిమాన నార్సింగ్ నుంచి ప్రతాప సింగారం వరకు 55 కిలో మీటర్ల వరకు ఉన్న మూసీ వెంట… ఈస్ట్ వెస్ట్ కారిడార్ రూపొందిస్తే సెంటర్ సిటీకి కనెక్టివిటీ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో మూసీ పరిసరాల్లో నివాస, వాణిజ్య కేంద్రాలు పెరిగే అవకాశముంది. ఓల్డ్ సిటి మినహాయిస్తే ఇటు పశ్చిమం వైపు… తూర్పువైపు మూసీ పరిసరాల్లో చాలా వరకు భూమి అందుబాటులో ఉంది. ఆయా ప్రాంతాల్లో రియాల్టీ ప్రాజెక్టులు వచ్చే అవకాశముంది. మురుగు ప్రవహించకుండా చేయడంతో హోటల్ ఇండస్ట్రీ, బోటింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని యోచిస్తోంది. అంతే కాకుండా మూసీ పరిసరాల్లో ఉండేవారికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సుందరీకరణతోపాటు రోడ్డు కనెక్టివిటి పెరిగితే మూసీకి ఇరువైపుల ఒకటి రెండు కిలో మీటర్ల వరకు నిర్మాణ యాక్టివిటీలో పెను మార్పులు వచ్చే అవకాశముందని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. మూసీని ఆధారం చేసుకుని అనేక నివాస కాలనీలు, కమర్షియల్ జోన్లు వస్తాయని అంటున్నారు. మూసీ తీరాన జరిపే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సర్కార్‌ ప్రణాళికలు వీలైనంత త్వరగా అమలైతే అధిక ప్రయోజనాలు ఉంటాయని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు.

Read Also : Hyderabad Real Estate : రియల్ ఇన్‌కమ్.. టీ-సర్కార్‌కు కాసుల పంట.. భారీగా ఆదాయం ఇక్కడి నుంచే..!