Luxury Homes: హైదరాబాద్‌లో లగ్జరీ గృహాలకు భారీ డిమాండ్.. 20 రెట్లు పెరిగిన విక్రయాలు

Luxury Homes: హైదరాబాద్‌లో లగ్జరీ గృహాలకు భారీ డిమాండ్.. 20 రెట్లు పెరిగిన విక్రయాలు

Hyderabad Luxury Houses

Luxury Houses: ఒకప్పుడు తనకు సొంత ఇల్లు ఉంటే చాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు కేవలం సొంతిల్లు (Own House) మాత్రమే అయితే సరిపోదంటున్నారు మెజార్టీ హైదరాబాదీలు. ప్రస్తుతం చాలామంది విశాలమైన ఇళ్లు కావాలని కోరుకుంటున్నారు. పోస్ట్‌ కోవిడ్‌ (Post Covid) తర్వాత భారత్‌లో గృహ కొనుగోలుదారుల (homebuyers) అభిరుచి పూర్తిగా మారిపోయింది. మొన్నటి వరకు అఫర్డబుల్‌ హౌజెస్‌పై ఉన్న ఆసక్తి ఇప్పుడు తగ్గింది. తాజాగా ప్రీమియం ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో (Hyderabad) ఖరీదైన ఇళ్ల కొనుగోళ్లపై నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఇంటి విస్తీర్ణం 12 వందల చదరపు అడుగుల నుంచి 2 వేల చదరపు అడుగుల వరకు ఉంటే సరిపోతుందని భావించేవారు. ఇంటి ధర సైతం చదరపు అడుగుకు 5 నుంచి 6 వేల రూపాయల వరకు అంటే ఇంటికి 60 లక్షల నుంచి మొదలు కోటి రూపాయలు పెడితే మంచి ఇల్లు సొంతమయ్యేది.

కానీ ఇప్పుడు ఇంటి కొనుగోలుదారుల్లో పూర్తి మార్పు వచ్చింది. చాలా మంది హైదరాబాదీలు ప్రీమియం ఇళ్లను కోరుకుంటున్నారు. ఇంటి ధర కాస్త ఎక్కువైనా పరవాలేదు కాని విశాలంగా ఉండాలని అంటున్నారు. అందులోను గేటెడ్ కమ్యునిటీలో అన్ని హంగులు, సకల సౌకర్యాలు ఉన్న ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారు హైదరాబాద్ వాసులు. భారత్‌లో ముంబై తరువాత హైదరాబాద్‌లోనే లగ్జరీ ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అదే సౌత్ ఇండియాలో అయితే లగ్జరీ గృహాల డిమాండ్, అమ్మకాల్లో మన భాగ్యనగరమే నెంబర్ వన్. అందుకే లగ్జరీ గృహాల డిమాండ్ మేరకు ప్రముఖ బిల్డర్లు సైతం హైరైజ్ అపార్ట్ మెంట్స్‌ను నిర్మిస్తున్నాయి.

గతంలో 25 నుంచి 30 అంతస్థులతో నిర్మించే సంస్థలు ఇప్పుడు ఏకంగా 50 ఫ్లోర్స్ వరకు భారీ రెసిడెన్షియల్ నిర్మాణాలను చేపడుతున్నాయి. ఇక ప్రీమియం ఫ్లాట్స్ ను చాలా విశాలంగా నిర్మిస్తున్నారు బిల్డర్లు. ఒక్కో ఫ్లాట్ కనీసం 2 వేల చదరపు అడుగుల నుంచి 5 వేల చదరపు అడుగుల మేర నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు కుటుంబానికి సరిపోయే రెండు లేదా మూడు బెడ్రూంలు, కిచెన్, హాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు లగ్జరీ అపార్ట్ మెంట్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో పని చేసుకోవడానికి ప్రత్యేకమైన వర్క్ ప్లేస్ తో పాటు హోమ్ థియేటర్ వంటివి ఉంటున్నాయి.

Also Read: దేశం మొత్తం చూపు హైదరాబాద్‌ రియాల్టీ వైపే.. ఇప్పటికీ అందుబాటులోనే ఇళ్ల ధరలు

ఇక హైదరాబాద్‌లో లగ్జరీ అపార్ట్ మెంట్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో లగ్జరీ రెసిడెన్షిల్‌ ప్రాజెక్టులు భారీగా వస్తున్నాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ, కొండాపూర్, నానక్ రామ్‌గూడ, రాయదుర్గం, నార్సింగి, పుప్పాలగూడ, కోకాపేట్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో 50 అంతస్థుల్లో బహుళ అంతస్థుల్లో నివాస గృహాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో లగ్జరీ అపార్ట్‌మెంట్స్ ధరలు కూడా భారీగానే ఉన్నాయి.

Also Read: వృద్ధి బాటలో హైదరాబాద్ రియాల్టీ మార్కెట్.. ఐదు రెట్లు పెరిగిన సేల్స్‌

నగరంలో ప్రీమియం ఫ్లాట్స్ చదరపు అడుగు 8 వేల రూపాయల నుంచి మొదలు 20 వేల రూపాయల వరకు పలుకుతోంది. అంటే పేరున్న నిర్మాణసంస్థ చేపట్టిన ప్రాజెక్టులో లగ్జరీ ఫ్లాట్ కొనాలంటే కనీసం కోటిన్నర రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఖర్చుచేయాలి. హైదరాబాద్‌లో గత ఏడాదితో పోలిస్తే 4 కోట్లు ఆపైన ధరలున్న లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 20 రెట్లు పెరిగాయంటే ఎంత డిమాండ్ ఉందో తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో 4 కోట్ల రూపాయలకు పైగా ధరలున్న గృహాలు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 3 వేల 100 అమ్ముడైతే, హైదరాబాద్‌లో వెయ్యి ఇళ్లు సేల్ అయ్యాయని సీబీఆర్ఈ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసిన నివేదిక చెబుతోంది. మొత్తానికి మధ్యతరగతి వారికి సంబంధించిన అఫర్డబుల్ ఇళ్లతో పాటు ప్రీమియం గృహాలకు మంచి డిమాండ్ ఉండటంతో హైదరాబాద్ నిర్మాణరంగంలో మంచి జోష్ కనిపిస్తోంది.