FASTag New Rule : వాహనదారులకు బిగ్ రిలీఫ్.. ఇక నెలనెలా ఫాస్టాగ్ పాస్ రెన్యూవల్ అక్కర్లేదు.. ఎవరికి వర్తిస్తుందంటే?
FASTag New Rule : టోల్ ప్లాజా సమీపంలో నివసించే వాహనదారులకు కొత్త ఫాస్టాగ్ వార్షిక లోకల్ పాస్.. రూ.3,000తో ఏడాది పాటు ప్రయాణించే అవకాశం లభిస్తుంది. 20 కి.మీ నిబంధన, అర్హత, అవసరమైన డాక్యుమెంట్లు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
FASTag New Rule
- టోల్ ప్లాజా సమీప వాహనదారులకు గుడ్ న్యూస్
- రూ.3,000 కడితే ఏడాది టోల్ టెన్షన్ లేదు
- ఫాస్టాగ్ వార్షిక పాస్ ఎవరికి వర్తిస్తుందంటే?
FASTag New Rule : టోల్ ప్లాజా దగ్గరలో ఉంటున్నారా? మీకో భారీ గుడ్ న్యూస్.. టోల్ ప్లాజాల సమీపంలో నివసించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. జాతీయ రహదారులపై తరచూ టోల్ ప్లాజా దాటే స్థానికులకు ఫాస్టాగ్ వార్షిక లోకల్ పాస్ సదుపాయంలో మార్పులు తీసుకొచ్చింది.
ఇక ప్రతి నెలా పాస్ రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సుమారు రూ.3వేలు కడితే చాలు.. ఏడాది పాటు అదే టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు. అయితే, ఈ సదుపాయం అందరికీ వర్తించదు. కొన్ని కీలక అర్హతలు తప్పనిసరి.. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
20కి.మీ పరిధిలో ఉంటేనే.. :
సంబంధిత జాతీయ రహదారి టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో పర్మినెంట్ రెసిడెన్సీ ఉన్న వారికి మాత్రమే ఈ లోకల్ వార్షిక పాస్ వర్తిస్తుంది. అంతేకాదు.. వైట్ నంబర్ ప్లేట్ ఉన్న నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే పరిమితం. అంటే.. ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాహనాలు అర్హత ఉంటుంది. ట్యాక్సీలు, ఇతర కమర్షియల్ వాహనాలకు ఈ రాయితీ వర్తించదు.
గతంలో రూ.3,075 వార్షిక పాస్ తీసుకున్నా ఏడాదిలో గరిష్టంగా 200 ట్రిప్పులకు మాత్రమే అనుమతి ఉండేది. లేదంటే ప్రతి నెలా నిర్దిష్ట రుసుముతో మంత్లీ పాస్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి వచ్చేది. కొత్త విధానంతో ఈ పరిమితుల వల్ల ఇబ్బంది పడే స్థానికులకు మరింత ఈజీ కానుంది.
పాస్ ఎలా పొందాలి? ఇవి తప్పనిసరి :
లోకల్ ఫాస్టాగ్ పాస్ కోసం వాహన ఆర్సీతో పాటు లోకల్ అడ్రస్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ సమర్పించాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వంటి డాక్యుమెంట్లు ఇందుకు ఉపయోగపడతాయి. ప్రాసెస్ డిజిటల్ విధానంలోనే కొనసాగనుంది. అర్హత నిర్ధారణ తర్వాత పాస్‌ను ఫాస్టాగ్‌తో ఇంటిగ్రేట్ చేస్తారు.
రోజూ టోల్ దాటేవారికి బిగ్ బెనిఫిట్ :
ఉద్యోగం, వ్యాపారం, స్కూళ్లు, వ్యవసాయ పనుల కోసం ప్రతిరోజూ టోల్ ప్లాజా దాటే స్థానికులకు ఈ పాస్ వల్ల టోల్ ఖర్చు భారీగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా రోజుకు పలుమార్లు రాకపోకలు సాగించే వారికి ఇది చాలా బెనిఫిట్..
అయితే రూ.3వేలు చెల్లిస్తే దేశంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద ప్రయాణించలేరు. ఈ సదుపాయం సంబంధిత టోల్ ప్లాజా పరిధిలో అర్హత కలిగిన లోకల్ నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి పాస్ తీసుకునే ముందు మీ నివాస పరిధి, వాహనం అర్హత, అవసరమైన డాక్యుమెంట్లను తప్పనిసరిగా చెక్ చేసుకోండి.
