Home Buyers: ఇంటి కొనుగోలు కోసం ఎలా సన్నద్ధం కావాలి.. ప్రణాళిక ఎలా ఉండాలి?
సొంతింటి కల ఉన్న వారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేయడం మొదలుపెట్టాలని చెబుతున్నారు.

first time home buyers guide
first time home buyers: సొంతిల్లు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎవరి బడ్జెట్‌కు అనుగుణంగా, తమ వెసులుబాటును బట్టి ఒక్కడో ఓ చోట తమకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలనో.. కొనుక్కోవాలనో అనుకుంటారు. అయితే ఇల్లు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సొంతింటిని కొంతమంది చిన్న వయసులోనే సొంతం చేసుకుంటుంటే, మరికొందరు రిటైర్ అయ్యాక కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమందికి సొంతిల్లు (own house) తీరని కలగానే మిగిలిపోతుంది. సొంత ఇంటిని సమకూర్చుకునే అవకాశం ఆర్థిక స్థోమతతో పాటు ఇంటి కోసం సరైన ముందస్తు ప్రణాళిక (Advance planning) పైనే ఆధారపడి ఉంటుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. సొంతింటి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే ఆ కలను సాకారం చేసుకోవడం సాధ్యమేనంటున్నారు.
ప్రస్తుతం చాలా మంది ఉద్యోగం, ఉపాధిరీత్యా నగరాలు, పట్టణాలకు వలస వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే ఎవరి స్థాయిలో వారు సొంతింటి కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో మధ్య తరగతి వారికి అందుబాటు ధరల్లో ఇళ్ల ధరలు లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతాల్లో అన్ని వర్గాలకు తగ్గ గృహ నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణసంస్థలు. అయినప్పటికీ ఇంటి కొనుగోలు ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అందుకోసం ముందు నుంచి పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్దంగా సన్నద్దం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
సొంతింటి కల ఉన్న వారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేయడం మొదలుపెట్టాలని చెబుతున్నారు. ఎన్నేళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రతి నెలా సంపాదనలో కొంత మొత్తం దాచుకోవాలి. నెలకు కనీసం 10 వేల రూపాయల నుంచి ఆ తరువాత ఎంత వీలైతే అంత మొత్తం పొదుపు చేసుకోవాలి. గృహరుణం తీసుకుంటే నెలనెలా ఎలా ఈఎంఐ చెల్లిస్తారో అలా ఇంటి కోసం మొదటి నుంచి పొదుపు రూపంలో ఈఎంఐ చెల్లించాలన్నమాట. ఇంటి కోసం డౌన్‌పేమెంట్‌కు అవసరమయ్యే 20 శాతం నిధులను సమకూర్చుకుంటే మిగతా మొత్తాన్ని గృహ రుణం తీసుకోవచ్చని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
Also Read: అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై మిడిల్ క్లాస్ ఆశలు.. రూ.30-45 లక్షల రేంజ్ అయితే ఓకే!
ఇలా ప్రతి నెలా పొదుపు చేసిన మొత్తాన్ని అధిక రాబడి ఇచ్చే పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఉద్యోగులైతే పీపీఎఫ్‌లో మదుపు చేయడం, లేదంటే బంగారం కొనుగోలు, నమ్మకమైన సంస్థలో చిట్టీ వేయడం, మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా బ్యాంకులు, పోస్టల్ పథకాలు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ అసలుకు హామీ ఉండి అధిక రాబడి వచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.
Also Read: మెట్రో నగరాల్లో క్రమంగా పెరుగుతోన్న ఇళ్ల ధరలు.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
ఇక ఇంటి కోసం బడ్జెట్ ఎంత అనేది ముందుగా అంచనాకు రావాలి. ఎవరి బడ్జెట్ కు అనుగుణంగా ఆయా ధరల్లోనే ఇల్లు కొనే ప్రయత్నం చేయాలి. ఇల్లు కొన్నాక బ్యాంకు రుణానికి చెల్లించే ఈఎంఐ భారం కాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒక వేళ ఇల్లు అత్యవసరమని భావించకపోతే ముందు ఇంటి స్థలం కొనుగోలు చేసి, ఆ తరువాత భవిష్యత్తులో అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు లేకపోతే సగం స్థలం విక్రయించి మిగతా స్థలంలో కట్టుకోవచ్చని నిపుణులు అంటున్నారు.