రూ.2 లక్షల మార్కును దాటడానికి సిద్ధమవుతున్న తులం బంగారం ధర.. ఎందుకింతగా పెరుగుతోందంటే?

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు 2022 నుంచి బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచాయి.

రూ.2 లక్షల మార్కును దాటడానికి సిద్ధమవుతున్న తులం బంగారం ధర.. ఎందుకింతగా పెరుగుతోందంటే?

Gold (Image Credit To Original Source)

Updated On : January 27, 2026 / 1:27 PM IST
  • 2007లో తులం బంగారం ధర రూ.10,000 
  • ఇప్పుడు రూ.1.6 లక్షల మార్కు దాటింది
  • అనిశ్చితి సమయంలో బంగారమే దిక్కు

Gold prices: బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పటికే తొలిసారి ట్రాయ్‌ ఔన్స్‌(28.35 గ్రాములు)కు $5,000 స్థాయిని దాటింది. అంటే రూ.4,58,130కు చేరుకుంది.

లండన్‌ బులియన్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ వార్షిక అంచనా సర్వే ప్రకారం.. 2026లో ప్రపంచ మార్కెట్లలో బంగారం ధర ట్రాయ్‌ ఔన్స్‌కు $7,000 దాటవచ్చు. ప్రస్తుత మారక విలువల ప్రకారం.. ఈ విలువ సుమారు రూ.6.42 లక్షలు. దీంతో భారత్‌లో తులం బంగారం ధర దాదాపు రూ.2.2 లక్షలుగా మారుతుంది.

అనిశ్చితి సమయంలో సేఫ్ హేవన్ ఆస్తులుగా బంగారం, ఇతర విలువైన లోహాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం పెరగడం, బలహీనమైన అమెరికా డాలర్, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, వడ్డీ రేట్లు తగ్గిస్తారనే అంచనాలు బంగారం డిమాండ్‌ను పెంచాయి.

బంగారం ధరలు పెరిగిన తీరు

  • భారత్‌లో 2007లో తులం బంగారం ధర రూ.10,000 స్థాయికి చేరింది
  • రూ.20 వేల మార్కుకు చేరేందుకు దాదాపు 3-4 ఏళ్లు పట్టింది
  • అక్కడి నుంచి రెట్టింపు (రూ.40 వేలు) కావటానికి తొమ్మిదేళ్లు పట్టింది.
  • రూ.80 వేల మార్కుకు చేరేందుకు ఐదేళ్లు పట్టింది.
  • రూ.1.6 లక్షల మార్కుకు చేరేందుకు కేవలం 1-2 ఏళ్లు సరిపోయాయి.
  • ఈ ఏడాది తులం బంగారం ధర రూ.2 లక్షలు దాటనుంది.

బంగారం నిల్వల తీరు
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు 2022 నుంచి బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచాయి. యుక్రెయిన్‌లో యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షల తర్వాత ఏర్పడిన ప్రపంచ ఆర్థిక అనిశ్చిత్తే దీనికి కారణం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద ప్రస్తుతం 880 టన్నులకుపైగా బంగారం ఉంది.

వాటిలో సుమారు 512 టన్నులు దేశంలోనే నిల్వ ఉన్నాయి. దాదాపు 348 టన్నులు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ సంరక్షణలో ఉన్నాయి. మిగిలినది బంగారు డిపాజిట్ల రూపంలో ఉంది. 2026 తొలి 26 రోజుల్లోనే బంగారం ధరలు దాదాపు 18 శాతం పెరిగాయి.