Gold: ఏప్రిల్ నెలలో గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

రాబోయే కాలంలో బంగారం ధర తగ్గుతుందా..? పెరుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. బంగారం వ్యాపారులు, పెట్టుబడి నిపుణులు..

Gold: ఏప్రిల్ నెలలో గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

Gold

Updated On : March 16, 2025 / 2:57 PM IST

Gold Rate: బంగారం ధర భగభగమంటోంది. గతంలో ఎప్పుడూలేని విధంగా ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ఏ శుభకార్యం జరిగినా, పండుగల సమయాల్లో బంగారం కొనుగోళ్లు తప్పనిసరి. ధనికులు, పేదలు అనే తేడాలేకుండా తమ స్థాయికి తగినంతలో బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం మధ్య తరగతి వర్గాల ప్రజలు గతంలోలా బంగారం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. బంగారం ధరలు వారికి అందనంత స్థాయికి వెళ్లిపోయాయి. ప్రస్తుతం 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు రూ.90వేలకు చేరింది.

Gold

ఆర్థిక సంక్షోభం సమయాల్లో..
గత రెండుమూడేళ్ల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. రెండు నెలల నుంచి బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ, వారి ఆశలను అడియాశలు చేస్తూ గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. ముఖ్యంగా 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సందర్భంగా ఔన్సు బంగారం ధర వెయ్యి డాలర్లకు చేరింది. నాలుగేళ్ల క్రితం కొవిడ్ ముప్పు ముంచుకొచ్చినప్పుడు 2వేల డాలర్లు పలికింది. మళ్లీ ఇప్పుడు ఔన్సు బంగారం రేటు 3వేల డాలర్లకు చేరుకుంది. దీంతో ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చినప్పుడు బంగారం ధర రికార్డు స్థాయికి చేరుతున్నట్లు స్పష్టమవుతుంది.

Gold

2022 నుంచి ప్రతీయేటా..
గత కొంతకాలంగా వివిధ దేశాల్లోని కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలుచేసి నిల్వ చేస్తున్నాయి. 2022 నుంచి ప్రతీయేటా వెయ్యి టన్నులకుపైగా బంగారాన్ని కేంద్ర బ్యాంకులే కొనుగోలు చేశాయి. ఇదిలాఉంటే.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గోల్డ్ రేటు భారీగా పెరుగుతోందన్న వాదన ఉంది. ట్రంప్ టారిఫ్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో పెట్టుబడిదారులు బంగారంను తమ పెట్టుబడికి సురక్షిత మార్గంగా ఎంచుకుంటున్నారు. చైనాలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిని అక్కడి మదుపర్లు ఇటీవల బంగారంను ఎక్కువగా కొంటున్నారు. కరెన్సీ విలువ క్షీణించినందున టర్కీ ప్రజల్లోనూ బంగారంపై ఆసక్తి పెరిగింది.

Gold

గోల్డ్ రేటు తగ్గుతుందా..
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 3వేల డాలర్లకు చేరింది. అయితే, రాబోయే కాలంలో బంగారం ధర తగ్గుతుందా..? పెరుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. బంగారం వ్యాపారులు, పెట్టుబడి నిపుణులు ఈ విషయంపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు. ట్రంప్ టారిఫ్ యుద్ధం, రష్యా -యుక్రెయిన్ పోరు, ఇతర ప్రతికూల పరిస్థితులు కొనసాగినంత కాలం ధర తగ్గదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత జోరు కొనసాగితే.. వచ్చే నాలుగైదు నెలల్లో ఔన్సు గోల్డ్ రేటు 3,040డాలర్లకుపైగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో భారతదేశంలో గోల్డ్ రేటు ఈ ఏడాది చివరి నాటికి రూ.లక్షకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే, ఈలోపు అంతర్జాతీయంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులకు ఫుల్ స్టాప్ పడితే బంగారం ధరలు దిగొచ్చే అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.