పదిహేను రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర

పదిహేను రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర

Updated On : February 20, 2020 / 2:00 AM IST

పసిడి ధర ఆకాశానికంటింది. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన ధర పదిహేను రోజుల్లో రూ.600 పెరిగి పీక్స్‌కు చేరింది. బంగారం ధర పెరుగుతూ పోతుంటే.. వెండి కూడా ఇదే దారిలో నడిచింది. బంగారం పెరగడానికి కరోనా వైరస్ ఓ ప్రధాన కారణమనే చెప్పాలి. 

చైనాలో ఏర్పడ్డ కరోనా భయం.. గ్లోబల్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందనే ఆందోళనలు పెరిగిపోయాయి. ఏడేళ్ల గరిష్ట స్థాయికి తాకి 1600 డాలర్ల పైకి చేరింది. పసిడి ధర ఔన్స్‌కు 0.20 శాతం పెరుగుదలతో 1606.85 డాలర్లకు ఎగబాకింది. బంగారం మాదిరిగానే వెండి ధర కూడా పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.40 శాతం పెరుగుదలతో 18.22 డాలర్లకు చేరింది.

హైదరాబాద్ మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర గురువారం భారీగా పెరిగింది. 10 గ్రాములకు రూ.520 పెరగడంతో రూ.39వేల 650కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.520 పెరిగి పసిడి ధర 10 గ్రాములకు రూ.42వేల 640 నుంచి రూ.43వేల 160కు చేరింది. 

వెండి ధర కూడా బంగారం దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.400 పెరిగిం దీంతో ధర రూ.49,500 నుంచి రూ.49,900కు చేరింది. వెండి ధర పుంజుకోవడానికి పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయరీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం కారణంగా ఉంది. 

విజయవాడ, విశాఖపట్నంలోనూ పసిడి, వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.520 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.39వేల 650కు చేరింది. వెండి ధర రూ.49వేల 900కు పెరిగింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ మార్కెట్‌లోనూ అదే పరిస్థితి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.400 పెరుగుదలతో రూ.41వేల 550కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 పెరిగి రూ.40వేల 350కు ఎగసింది. కేజీ వెండి ధర రూ.49వేల 900కు చేరింది.

ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యూయలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి.