Insurance GST : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి, తీసుకోబోయే వారికి కేంద్రం అదిరిపోయే శుభవార్త..?
Insurance GST : గత డిసెంబర్‌లో జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించిన 13 మంది సభ్యుల మంత్రుల బృందం పూర్తి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై చెల్లించే ప్రీమియంలకు జీఎస్టీ మినహాయింపును సిఫార్సు చేసింది.

GST on insurance may be slashed to 5 Percent
Insurance GST : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోబోతున్నారా? అయితే, కేంద్ర ప్రభుత్వం మీకో గుడ్ న్యూస్ అందించనుంది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించనుంది. జీఎస్టీని పూర్తిగా మినహాయించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అంశంపై మంత్రుల బృందం 5 శాతం జీఎస్టీని సిఫార్సు చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా తొలగించే అవకాశం లేదని నివేదికలు చెబుతున్నాయి. మంత్రుల బృందంలో 5శాతం జీఎస్టీపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉంది. అధికారిక వర్గాల ప్రకారం.. స్థూల ప్రీమియంలపై ఇప్పుడు 18శాతం వర్తించే జీఎస్టీని 5శాతానికి తగ్గించే అవకాశం ఉంది. అదే జరిగితే లైఫ్, హెల్త్ బీమా ప్రీమియం పాలసీదారులపై భారం తగ్గనుంది. అదే సమయంలో ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ఫెసిలిటీని కూడా అలానే ఉంచనుంది.
సంబంధిత వర్గాల ప్రకారం.. IRDAI నివేదిక తర్వాత.. మంత్రుల బృందం ఈ అంశాన్ని పునఃపరిశీలిస్తోంది. బీమా కంపెనీలు 12 శాతం జీఎస్టీని డిమాండ్ చేస్తున్నాయి. జీఎస్టీని రద్దు చేస్తే ప్రీమియం పెరుగుతుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆరోగ్యం, టర్మ్ బీమాపై జీఎస్టీ లేకపోవడం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ. 3500 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఏప్రిల్ లేదా మేలో GST కౌన్సిల్ సమావేశం :
GoM తదుపరి సమావేశం ఏప్రిల్‌లో జరుగుతుంది. మే నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ బీమా ప్రీమియంలపై పన్ను విధించడంపై ఐఆర్డీఏఐ రూపొందించిన నివేదికను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. బీమా కంపెనీలు చెల్లించే ఇన్‌పుట్ పన్ను వారి టర్మ్ ప్లాన్‌ల ఖర్చులో దాదాపు 8 శాతం నుంచి 11శాతం ఉంటుంది. పన్నును 5శాతానికి తగ్గిస్తే బీమా పరిశ్రమ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
సీనియర్ సిటిజన్లతో పాటు రూ. 5 లక్షల వరకు కవరేజీ కలిగిన ఆరోగ్య బీమాపై జీఎస్టీ విధించవద్దని GoM మొదటి రిపోర్టులో సిఫార్సు చేసింది. లైఫ్, టర్మ్ బీమా ప్రీమియంలపై జీఎస్టీని కూడా మాఫీ చేయాలని సిఫార్సు చేసింది. అయితే, బీమా కంపెనీలు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌తో పాటు 12 శాతం జీఎస్టీని డిమాండ్ చేస్తున్నాయి.
అంతేకాదు.. మంత్రుల బృందం 12శాతం రేటుకు అంగీకరించే అవకాశం లేదని వర్గాలు చెబుతున్నాయి. బీమా ప్రీమియంలపై పూర్తిగా జీఎస్టీ మినహాయింపు అందిస్తే కంపెనీలు టాక్స్ క్రెడిట్‌లను క్లెయిమ్ చేయలేరు. కంపెనీ ఖర్చులతో పాటు ప్రీమియం ధరలను పెంచుతుందని AKM గ్లోబల్ పార్టనర్ సందీప్ సెహగల్ అన్నారు.
టర్మ్-లైఫ్ ఇన్సూరెన్స్‌ను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించడం వల్ల ఖజానాపై ఏటా దాదాపు రూ.200 కోట్లు భారం పడుతుందని, సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా ప్రీమియంలను మినహాయించడం వల్ల మరో రూ.3వేలు కోట్లు ఖర్చవుతుందని వర్గాలు తెలిపాయి.
FY22, FY24 మధ్య ఆరోగ్య బీమా ప్రీమియంల నుంచి సేకరించిన మొత్తం GST దాదాపు రూ.21వేలు కోట్లు. 5శాతం ఐటీసీతో బీమా సంస్థలు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు. క్యాస్కేడింగ్ పన్ను భారాన్ని తగ్గిస్తుంది. ఈ విధానంతో ప్రభుత్వ ఆదాయ నష్టం దాదాపు రూ. 36,112 కోట్లకు పరిమితం అవుతుందని, అదే మినహాయింపు ఇస్తే.. రూ. 50వేల కోట్లు నష్టపోతాయని అంటున్నారు.