మీరు డబ్బులు దాచుకున్న బ్యాంకు మూతబడితే? మీ డబ్బులన్నీ తిరిగివస్తాయా? ఏం జరుగుతుంది? 

కస్టమర్ తన పత్రాలు సమర్పించి క్లెయిమ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండింటిలో అందుబాటులో ఉంటుంది. కస్టమర్ వద్ద పాస్‌బుక్‌, ఖాతా నంబర్‌, గుర్తింపు పత్రం ఉండాలి.

మీరు డబ్బులు దాచుకున్న బ్యాంకు మూతబడితే? మీ డబ్బులన్నీ తిరిగివస్తాయా? ఏం జరుగుతుంది? 

Updated On : October 5, 2025 / 3:51 PM IST

Bank deposit insurance: ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తాం. ఇంట్లో డబ్బు ఉంచుకుంటే దొంగల బెడద ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బును ఇంట్లో దాచుకునేందుకు రూల్స్‌ కూడా ఒప్పుకోవు. దీంతో దాదాపు ప్రతి ఒక్కరూ తమ సంపాదనను సురక్షితంగా ఉంచేందుకు బ్యాంకులపై ఆధారపడుతున్నారు. కానీ, బ్యాంక్ ఒక్కసారిగా మూతపడితే ఏమవుతుంది? అప్పుడు మన డబ్బు తిరిగి వస్తుందా? వస్తే ఎంత వస్తుంది?

దీనికి ప్రభుత్వం లేదా బ్యాంకులు ఏమైనా నిబంధనలు పెట్టాయా? కస్టమర్ మొత్తం డబ్బు తిరిగి వస్తుందా? లేక పరిమితి ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు మనలో ఉంటాయి.

ఒకవేళ బ్యాంక్ దివాళా తీస్తే ఎంతో కంగారు పడిపోతుంటాం. బ్యాంకుకు అలాంటి పరిస్థితి వచ్చిన వేళ మన డబ్బు పూర్తిగా సురక్షితమని చెప్పలేం. కానీ, నష్టాలు తగ్గించేందుకు కొన్ని నిబంధనలు అమలులో ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం.. ఒక్కో కస్టమర్ డిపాజిట్‌పై గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది.

డబ్బు ఎంతవరకు తిరిగి వస్తుంది?

సేవింగ్స్‌, కరెంట్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ వంటి ఏ ఖాతాలో డబ్బు ఉన్నా మొత్తం కలిపి రూ.5 లక్షల వరకు మన డబ్బు సురక్షితమే. ఆ మొత్తానికి మించి ఉన్న డబ్బు.. బ్యాంక్‌ దివాళా ప్రక్రియలోకి వస్తుంది. బ్యాంక్ తన ఆస్తులను అమ్మి ఇతర డిపాజిటర్లకు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అయితే దీనికి చాలా సమయం పట్టొచ్చు.

నిబంధనలు ఎలా ఉన్నాయ్?

బ్యాంక్‌ మూతపడితే కస్టమర్‌కు డీఐసీజీసీ (డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌) బీమా మొత్తాన్ని తిరిగి ఇస్తుంది. మూతపడిన వెంటనే ఆర్బీఐ లేదా డీఐసీజీసీ నోటీసు జారీ చేస్తుంది. కస్టమర్ తన పత్రాలు సమర్పించి క్లెయిమ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండింటిలో అందుబాటులో ఉంటుంది. కస్టమర్ వద్ద పాస్‌బుక్‌, ఖాతా నంబర్‌, గుర్తింపు పత్రం ఉండాలి.

పెద్ద మొత్తంలో డబ్బు జమచేసేవారు రూ.5 లక్షల పరిమితికి మించి ఉన్న డబ్బు కూడా సురక్షితంగా ఉండాలంటే వేర్వేరు బ్యాంకుల్లో లేదా వేర్వేరు ఖాతాల్లో డిపాజిట్ చేయడం మంచిదని పలువురు నిపుణుల అభిప్రాయం. ఈ విధంగా కస్టమర్లు తమ సేవింగ్స్‌ను కాపాడుకుని, అనుకోని పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావచ్చని చెబుతున్నారు.