Hyderabad Insurance : ఇన్సురెన్స్ కంపెనీకి రూ.79 లక్షల జరిమానా..!
బీమా పాలసీ సేవలందించడంలో విఫలమైన ఓ ఇన్సురెన్స్ కంపెనీకి కన్సుమర్ ఫోరమ్ భారీ జరిమానా విధించింది. పాలసీదారుడు నష్టపోయిన సొమ్మును వడ్డీతో చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

Hyderabad Insurance Firm Fined Rs 79 Lakh For Deficiency In Service
Hyderabad Insurance firm : బీమా పాలసీ తీసుకున్న వినియోగదారులకు సేవలందించడంలో విఫలమైన ఓ ఇన్సురెన్స్ కంపెనీకి కన్సుమర్ ఫోరమ్ భారీ జరిమానా విధించింది. పాలసీదారుడు నష్టపోయిన సొమ్మును వడ్డీతో చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అంతేకాదు.. సరైన సమయంలో సర్వీసులను అందించకుండా తీవ్ర మానసిక క్షోభకు గురిచేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన హితేశ్ కుమార్ కేడియా అనే వ్యాపారవేత్త.. స్పాంజ్ ఐరన్ బిజినెస్ చేస్తున్నాడు.
స్పాంజ్ ఐరన్ స్టాక్ సంబంధించి న్యూ ఇండియా అష్యురేన్స్ కంపెనీలో 2018 ఫిబ్రవరి 25న బీమా పాలసీని తీసుకున్నాడు. పాలసీ సమయంలోనే అకస్మాత్తుగా మంటలు సంభవించాయి. ఇలాంటి సమయాల్లో కూడా బీమా పాలసీ ద్వారా నష్టపరిహారాన్ని పొందేలా తీసుకున్నాడు. అయితే 2018 అక్టోబర్ 5న హితేశ్ కుమార్ నిల్వ చేసిన గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతడు నిల్వ చేసిన రూ.20 కోట్ల విలువైన స్పాంజ్ ఐరన్ స్టాక్ అంతా మంటల్లో దగ్ధమైంది. దీనికి సంబంధించి నష్టపరిహారం కోసం బీమా పాలసీని ఆశ్రయించాడు. అందుకు బీమా కంపెనీ అంగీకరించలేదు. దాంతో బాధితుడు హితేశ్ కుమార్ కేడియా హైదరాబాద్ కన్సుమర్ ఫోరమ్-1లో కేసు నమోదు చేశాడు.
విచారణకు స్వీకరించిన కన్సుమర్ ఫోరమ్.. ఇన్సురెన్స్ కంపెనీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. పాలసీదారుడికి సరైన సమయంలో సర్వీసును అందించడంలో విఫలమైందంటూ కన్సుమర్ ఫోరమ్ సదరు ఇన్సురెన్స్ కంపెనీకి మెట్టికాయలు వేసింది. హితేశ్ కుమార్ నష్టపోయిన స్టాకు విలువ రూ.79 లక్షలను వడ్డీతో చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుడికి అందించిన సర్వీసులో లోపాన్ని ఎత్తిచూపుతూ.. ఏళ్ల తరబడి ఇబ్బందులకు గురిచేసినందుకు రూ. 3 లక్షలు జరిమానా విధించింది. కోర్టు ఖర్చులకు సంబంధించి కూడా రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది. తీర్పు వెలువడినప్పటి నుంచి 45 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది.
Read Also : Covid Vaccination : కోవిడ్ టీకా ఏ సమయంలో వేయించుకోవాలో తెలుసా? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..