Hyderabad: హైదరాబాద్ నలువైపులా రియల్ ఎస్టేట్ జోష్.. నార్త్ లో తగ్గేదేలే అంటోన్న నిర్మాణ రంగం
దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఇప్పటికీ ధరలు చాలా తక్కువని, అందుకే చాలా రియాల్టీ సంస్థలు ఇక్కడ నిర్మాణాలపై మక్కువ చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Hyderabad surrounding real estate projects for sale details here
Hyderabad real estate: పోస్ట్ కోవిడ్ తర్వాత రియాల్టీ రంగంలో స్థిరమైన వృద్ధి కొనసాగుతోంది. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఇదే అనువైన సమయమని కొనుగోలుదారులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా అవుటర్ రింగ్ రోడ్డుతో గ్రేటర్ హైదరాబాద్ నలువైపులా రియాల్టీ రంగం విస్తరిస్తోంది. అవుటర్ లోపల భారీ ఎత్తున గృహాల నిర్మాణం జరుగుతోంది. వ్యక్తిగత నిర్మాణాలతో పాటు చిన్న బిల్డర్లు నిర్మించే అపార్ట్మెంట్లు, పెద్ద సంస్థలు డెవలప్ చేస్తున్న గేటెడ్ కమ్యూనిటీల వరకు పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో పరిమితంగా విల్లా ప్రాజెక్టులు అవుటర్ లోపల అందుబాటులోకి వస్తున్నాయి. ఇతర ప్రాంతాల రియల్ డెవలపర్లు స్థానిక భూ యాజమానులతో ఉమ్మడి భాగస్వామ్యంగా ప్రాజెక్ట్లు చేపట్టేందుకు ముందుకొస్తున్నారు.
దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఇప్పటికీ ధరలు చాలా తక్కువని, అందుకే చాలా రియాల్టీ సంస్థలు ఇక్కడ నిర్మాణాలపై మక్కువ చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్లోని స్థానికులకు ఈ ధరలు కాస్త భారమే అయినా, ముందు ముందు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భూముల ధరలకు అనుగుణంగా ఇళ్లధరలు భవిష్యత్తులో మరింత పెరగక తప్పదని రియాల్టీ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నార్త్ హైదరాబాద్ లో రియాల్టీ ప్రాజెక్టులు ఊపందుకున్నాయి. సెంట్రల్ సిటీకి ఉత్తరం వైపు నుంచి చక్కని ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఉండటం.. జాతీయ రహదారి అనుసంధానం, జేబీఎస్ వరకు మెట్రో, ప్రతిపాదిత ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు ఈ నార్త్ హైదరాబాద్ ప్రాంతంలో నిర్మాణ రంగానికి సానుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. అల్వాల్, బోయిన్ పల్లి, కొంపల్లి, మల్కాజిగిరి వంటి చోట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
జడ్చర్ల వరకు వెళ్లి కొంటున్నారు!
ఇక సౌత్ హైదరాబాద్ లో ఉన్న అత్తాపూర్, హైదర్ గూడ, బండ్లగూడ, కిస్మత్పూర్, అప్పా జంక్షన్ ప్రాంతాల్లోనూ రియాల్టీ ప్రాజెక్టుల వేగం పెరిగింది. గగన్ పహాడ్, సాతంరాయి, శంషాబాద్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు మొదలయ్యాయి. స్థలాలు కొనుగోలు చేసేవారు కొత్తూరు, షాద్ నగర్, జడ్చర్ల వరకు వెళ్లి మరీ కొంటున్నారు. అటు ఫార్మాసిటీ ఏర్పాటుతో శ్రీశైలం హైవేలోనూ రియల్ బూమ్ నడుస్తోంది. ఇక ఈస్ట్ హైదరాబాద్ విషయానికి వస్తే మెట్రో రైలు రాకతో కొనుగోలుదారుల చూపు అటువైపు కూడా మళ్లింది. విజయవాడ, వరంగల్, ఓఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్డుతో రవాణా అనుసంధానంగా ఉండటం హైదరాబాద్ ఈస్ట్ రియాల్టీకి కలిసివచ్చే అంశాలు. ఎల్బీనగర్, నాగోల్, బండ్లగూడ, హస్తినాపురం, ఉప్పల్, ఏ.ఎస్.రావు నగర్, బోడుప్పల్, సైనిక్ పురి ప్రాంతాల్లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. గౌరెల్లిలో అవుటర్ లోపలే విల్లాలు అందుబాటులో ఉన్నాయి.
Also Read: హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోలుకు ఇదే సరైన సమయం.. ఎందుకంటే?
నాగార్జున సాగర్ మార్గంలోనూ..
ఇక బోడుప్పల్ తర్వాత నారపల్లి, పోచారం వరకు గృహ నిర్మాణం ఊపందుకుంది. 50 లక్షల లోపు వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్లు అందుబాయిలో ఉన్నాయి. భవిష్యత్తు దృష్ట్యా స్థలాలపై పెట్టుబడి పెట్టేవారు ఘట్కేసర్, యాదాద్రి వైపు చూస్తున్నారు. నాగార్జున సాగర్ మార్గంలోనూ తుర్కయంజాల్ నుంచి నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని గచ్చిబౌలి, కూకట్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ దూకుడు పెరిగింది. ఐటీ సంస్థలు కార్యాలయాల నిర్మాణాలు ఒకవైపు, వాటికి పోటీగా రెసిడెన్షియల్ విభాగంలో ఆకాశహర్మ్యాలను పలు రియాల్టీ సంస్థలు చేపట్టాయి. కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, నానక్రాంగూడ, పుప్పాలగూడ, ఖాజాగూడ, మణికొండ, బాచుపల్లి, కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, లింగంపల్లి దాటి పటాన్ చెరు వరకు నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
Also Read: ఇల్లు కొనేటప్పుడు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?
వెస్ట్ లో 50 శాతానికి పైగా ప్రాజెక్టులు
హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న సుమారు 50 శాతానికి పైగా రియాల్టీ ప్రాజెక్టులు పశ్చిమం వైపే ఉన్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఐటీ కార్యాలయాలకు 10 నుంచి 20 కిలో మీటర్ల దూరంలోని ప్రాంతాలన్నీ నిర్మాణ రంగంలో దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ నలువైపులా రియాల్టీ నిర్మాణాలు ఊపందుకోవడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణాలకు అనుగుణంగా ఇళ్ల కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ రియల్ రంగానికి రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.